IndiGo Air Taxis : ఇండిగో మాతృసంస్థ 'ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్' భారత్‌లో 2026లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం అమెరికా కంపెనీ 'ఆర్చర్ ఏవియేషన్'తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఈ ఎయిర్‌ట్యాక్సీ సాయంతో దిల్లీలోని కన్నాట్ నుంచి హరియాణాలోని గురుగ్రామ్‌కు కేవలం 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చని తెలిపింది.
ఆర్చర్ ఏవియేషన్ కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్‌కు 200 ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఇవీటీఓఎల్) విమానాలను సరఫరా చేయనుంది. ఇందులో పైలట్‌తో పాటు నలుగురు వ్యక్తులు కలిసి ప్రయాణించవచ్చు. వాస్తవానికి ఇవి హెలీకాప్టర్‌ల మాదిరిగా పనిచేస్తాయి. కానీ శబ్దం తక్కువగా, భద్రత ఎక్కువగా ఉంటుంది. 200 ఇవీటీఓఎల్‌ల ధర దాదాపు బిలియన్ డాలర్లు (రూ.8,300 కోట్లు) ఉంటుంది.
ఎయిర్ ట్యాక్సీ సర్వీస్
ఇంటర్‌గ్లోబ్, ఆర్చర్ ఏవియేషన్ సంస్థలు - దిల్లీతో పాటు ముంబయి, బెంగళూరుల్లో ఎయిర్‌ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నాయి.
ఛార్జీలు : కన్నాట్ ప్లేస్ నుంచి గురుగ్రామ్ మధ్య 7 నిమిషాల ప్రయాణానికి రూ.2000 నుంచి రూ.3000 వరకు ఛార్జీలు ఉండవచ్చని ఆర్చర్ ఏవియేషన్ ప్రతినిధులు తెలిపారు. 'అమెరికా నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ)తో చర్చలు నడుస్తున్నాయి. మా విమానానికి సర్టిఫికేషన్ ప్రక్రియ తుది దశల్లో ఉంది' అని ఆర్చర్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆడమ్ గోల్డ్‌స్టీన్ పేర్కొన్నారు. బహుశా వచ్చే ఏడాదిలో సర్టిఫికేషన్ రావచ్చని, అనంతరం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వద్ద అనుమతుల ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం దిల్లీ-గురుగ్రామ్ మధ్య 27 కి.మీ. దూరానికి కారులో 90 నిమిషాల సమయం పడుతోంది. దీనికి రూ.1500 వరకు ఖర్చవుతోంది. అయితే ఎయిర్‌ట్యాక్సీ అయితే రూ.2000 నుంచి రూ.3000 వరకు ఛార్జీ అవుతుందని ఆయన తెలిపారు.
5 సీట్లు కలిగిన ఈ ఇండిగో ఎయిర్ట్యాక్సీల్లో 6 బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. పూర్తి ఛార్జింగ్‌కు 30-40 నిమిషాల సమయం పడుతుంది. ఒక్క నిమిషం ఛార్జింగ్‌తో ఒక్క నిమిషం ప్రయాణించవచ్చని చీఫ్ కమర్షియల్ అధికారి నిఖిల్ గోయల్ తెలిపారు.