India's Youngest Millionaire : ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి తన మనవడైన ఏకగ్రహ్ రోహన్ మూర్తికి అక్షరాల రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు. దీనితో ఆ 4 నెలల పసికందు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్‌గా అవతరించాడు.
ఎక్స్ఛేంజీ ఫైలింగ్ ప్రకారం, నారాయణ మూర్తికి దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌లో 0.40 శాతం వాటా ఉంది. దీనిలోంచి 0.04 శాతం వాటాను (15 లక్షల షేర్లను) తన మనువడైన ఏకగ్రహ్ రోహన్ మూర్తికి బహుమతిగా ఇచ్చారు. 'ఆఫ్-మార్కెట్' విధానంలో ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. దీనితో ఇన్ఫోసిస్‌లో నారాయణ మూర్తి వాటా 0.36 శాతానికి తగ్గింది. అయినప్పటికీ ఆయన చేతిలో ఇంకా 1.51 కోట్ల షేర్లు ఉన్నాయి.
మనవడు పుట్టిన ఆనందంలో!!
నారాయణమూర్తి, సుధామూర్తిలకు రోహన్ మూర్తి అనే కుమారుడు ఉన్నాడు. అతని భార్య అపర్ణా కృష్ణన్ 2023 నవంబర్‌లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ శిశువుకు ఏకగ్రహ్ అనే పేరు పెట్టారు. ఈ సంస్కృత పదానికి 'అచంచలమైన దృష్టి, గొప్ప సంకల్పం' అని అర్థం. ఈ విధంగా సుధ, నారాయణమూర్తి దంపతులు నాన్నమ్మ, తాతయ్యలు అయ్యారు.
వాస్తవానికి వీరికి అక్షతా మూర్తి అనే అమ్మాయి కూడా ఉంది. ఆమె బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ భార్య. ఆ దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇన్ఫోసిస్ మహాప్రస్థానం!
నారాయణమూర్తి తన భార్య అయిన సుధామూర్తి వద్ద 250 డాలర్లు అంటే సుమారుగా 20 వేల రూపాయలు తీసుకుని 1981లో ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించారు. దానిని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ, నేడు దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా తీర్చిదిద్దారు. ఇలా 25 ఏళ్లు ఆహోరాత్రాలు కష్టపడి పనిచేసిన నారాయణమూర్తి 2021 డిసెంబర్లో రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి తన ఫ్యామిలీ ఫౌండేషన్ ద్వారా (చారిటీ) స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయన సతీమణి సుధామూర్తి ఇటీవలే రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కోపిస్టి కస్టమర్ దెబ్బకు స్టోర్ రూమ్‌లో పడుకున్న 'ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి!
'ప్రధాని అత్తగారినంటే.. ఎవరూ నమ్మలేదు'.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సుధామూర్తి