Indian Economy Growth Rate 2024 : ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.5 శాతానికి చేరుకోవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అలాగే దక్షిణాసియా వృద్ధి రేటు 2024లో 6 శాతంగా ఉండవచ్చని పేర్కొంది. భారతదేశం బలమైన ఆర్థిక వృద్ధితో దూసుకుపోతుండడం, పాకిస్థాన్, శ్రీలంకల ఆర్థిక వ్యవస్థలు రికవరీ అవుతుండడమే ఇందుకు కారణని ప్రపంచ బ్యాంక్ మంగళవారం విడుదల చేసిన 'సౌత్ ఏసియా డెవలప్మెంట్ అప్డేట్'లో పేర్కొంది.
ఈ దక్షిణాసియా అభివృద్ధి అప్డేట్ నివేదిక ప్రకారం, 2025లో దక్షిణాసియా 6.1 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తుంది. అలాగే రానున్న రెండేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా దక్షిణాసియా కొనసాగుతుంది.
"భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5 శాతం వృద్ధిరేటు సాధించవచ్చని అంచనా. అయితే మీడియం టెర్మ్‌లో ఈ వృద్ధి రేటు 6.6 శాతంగా ఉండవచ్చు. కానీ భారతీయ పరిశ్రమల, సేవా రంగాల కార్యకలాపాలు మరింత పటిష్టమవుతాయని భావిస్తున్నాం."
- ప్రపంచ బ్యాంక్
పాక్, బంగ్లాదేశ్, శ్రీలంకల పరిస్థితి ఏమిటి?
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్ 5.7 శాతం వృద్ధిరేటు సాధించవచ్చు. కానీ అధిక ద్రవ్యోల్బణం; వాణిజ్యం, విదేశీ మారక ద్రవ్యం పరిమితంగా ఉండడం అనేవి ఆ దేశ ఆర్థిక వృద్ధిని నిరోధిస్తున్నాయని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది.
- 2023లో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది. కానీ తరువాత క్రమంగా పుంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో 2024-25లో పాక్ వృద్ధి రేటు 2.3 శాతానికి చేరుతుందని బ్యాంక్ అంచనా వేసింది.
- శ్రీలంక విషయానికి వస్తే, ఇప్పుడిప్పుడే టూరిజం మళ్లీ రికవరీ కావడం ప్రారంభమైంది. ఆర్థిక వ్యవస్థ కూడా క్రమంగా స్థిమితపడుతోంది. అందుకే 2024లో శ్రీలంక వృద్ధిరేటు 2.5 శాతం ఉండవచ్చని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.
వృద్ధి అవకాశాలు ఉన్నప్పటికీ?
'దక్షిణాసియా దేశాలకు స్వల్పకాలంలో మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు అంత పటిష్టంగా లేవు. వాతావరణ మార్పులు ఈ దేశాలకు పెద్ద సవాలుగా నిలుస్తాయి' అని ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ రైజర్ అన్నారు. అందుకే దక్షిణాసియా దేశాలు తమ వృద్ధిని, ఆర్థిక స్థితిగతులను పటిష్టంగా ఉంచుకోవాలంటే, కచ్చితంగా ప్రైవేట్ పెట్టుబడులను పెంచుకోవాలి. అలాగే ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించే విధానాలను అనుసరించాలని ఆయన అన్నారు.
మానవ వనరులను సరిగ్గా వాడుకోవడం లేదు!
దక్షిణాసియా దేశాల్లో మానవ వనరులు బాగా ఉన్నప్పటికీ, వారిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాయని సౌత్ ఏసియా ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఫ్రాంజిస్కా ఓన్సార్జ్ విశ్లేషించారు. దీని వల్ల దక్షిణ ఆసియా దేశాలు చాలా మంచి అవకాశాలు కోల్పోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ దక్షిణాసియా దేశాలు తమ యువతకు సరైన అవకాశాలు కల్పిస్తే, ఇప్పుడు జరుగుతున్న దాని కంటే దాదాపు 16 శాతం అధికంగా ఉత్పత్తి సాధించవచ్చు అని ఓన్సార్జ్ తెలిపారు.
అంచనాలను మించి రాణిస్తోంది!
ఇండియన్ కాంపోజిట్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 60.6 వద్ద ఉంది. ఇది ప్రపంచ సగటు 52.1 కంటే చాలా ఎక్కువ. ఇది మునుపటి భారత ఆర్థిక వృద్ధి అంచనాలను మించిపోయిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
ద్రవ్యోల్బణం కట్టడి
'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని చాలా వరకు కట్టడి చేయగలిగింది. అలాగే కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అయితే ఆహార ద్రవ్యోల్బణం మాత్రం పెరిగింది. అయినప్పటికీ భారత ఆర్థిక పరిస్థితులు చాలా అనుకూలంగానే ఉన్నాయి. వాణిజ్య రంగం విషయానికి వస్తే, దేశీయ క్రెడిట్ జారీ డిసెంబర్ 2024లో 14 శాతం పెరిగింది. ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతను సూచిస్తున్నాయని' ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.
మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్‌లో తప్పులు ఉన్నాయా? సరిచేసుకోండి ఇలా! - How To Rectify Cibil Errors
SIP చేస్తున్నారా? 7-5-3-1 నియమం పాటిస్తే భారీ లాభాలు గ్యారెంటీ! - Mutual Fund Investment Tips