Indian Economy By 2025 : భారతదేశం 2025 నాటికి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇండియా జీ20 షెర్పా, నీతిఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, గత మూడు త్రైమాసికాల్లో వరుసగా 8 శాతం జీడీపీ వృద్ధి వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ఠం చేశాయని అమితాబ్ కాంత్ అన్నారు. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2022లో యూకేను వెనక్కినెట్టి ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుంది భారత్.
"రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు(రూ.2.1 లక్షల కోట్లు, 27 దేశాల్లో భారత కరెన్సీ రూపాయితో వ్యాపారాలు, స్టీల్, సిమెంట్, ఆటోమొబైల్ తయారీ రంగాల్లో రెండంకెల వృద్ధి, జన్ ధన్, ఆధార్, మొబైల్ ద్వారా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో ప్రస్తుతం రూ.2.32 లక్షల కోట్లకుపైగా నగదు నిల్వలు, సగటు వార్షిక ద్రవ్యోల్బణం తగ్గుదల వంటివి భారత ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేశాయి. స్థిరంగా జీడీపీ వృద్ధి, దేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్బీఐ ద్రవ్య విధానం ఇవన్నీ ఇటీవలి త్రైమాసికాల్లో భారత ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లాయి"
- అమితాబ్ కాంత్, మాజీ నీతిఆయోగ్ సీఈఓ
Indian Economy Grow Indicators :
- రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు(రూ.2.1 లక్షల కోట్లు)
- గత మూడు త్రైమాసికాల్లో 8 శాతం చొప్పున వృద్ధి
- 27 దేశాలతో భారత కరెన్సీ రూపాయితో వ్యాపారం
- స్టీల్, సిమెంట్, ఆటోమొబైల్ తయారీ రంగాల్లో రెండంకెల వృద్ధి
- డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గ్లోబల్ లీడర్‌గా భారత్ ఎదుగుదల
- 134 బిలియన్ల ఈ-లావాదేవీలు పెరగడం
- మొత్తం గ్లోబల్ డిజిటల్ చెల్లింపులలో 46% భారత్‌లోనే జరగడం!
- జన్‌ధన్, ఆధార్, మొబైల్ ట్రినిటీ కింద తెరిచిన ఖాతాల్లో ప్రస్తుతం రూ.2.32 లక్షల కోట్లకుపైగా జమ
- తగ్గిన సగటు వార్షిక ద్రవ్యోల్బణం
- స్థిరంగా జీడీపీ వృద్ధి
- దేశంలో రాజకీయ స్థిరత్వం
- ఆర్బీఐ ద్రవ్య విధానం
ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) నివేదిక ప్రకారం 2024వ ఏడాదిలో ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేకాదు ఈ ఏడాది భారతదేశ వృద్ధి అంచనాలను 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది అంతర్జాతీయ ద్రవ్యనిధి. కాగా, ప్రస్తుతం దేశ జీడీపీ సుమారు 3.7 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.
దశాబ్దం క్రితం ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది. కేవలం ఒక దశాబ్ద కాలంలోనే మెరుగైన ఆర్థిక వృద్ధి సాధించి ప్రస్తుతం ఐదో స్థానానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది(2025) నాటికి నాలుగో స్థానానికి భారత ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అంచనా వేస్తున్నారు.
అలర్ట్ - త్వరలో కిలో వెండి ధర రూ.1లక్ష దాటే ఛాన్స్! - Silver Price Forecast
SBI నుంచి హోమ్ లోన్ తీసుకోవాలా? EMI కాలిక్యూలేషన్ చేయండిలా! - SBI Home Loan EMI Calculation