Budget 2024 Income Tax Changes : వేతన జీవులకు ఊరట కల్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను విధానంలో కీలక మార్పులు చేశారు. పన్ను శ్లాబుల్లో మార్పులతో పాటు, ప్రామాణిక తగ్గిపు - స్టాండర్డ్ డిడక్షన్ విషయంలోనూ ఊరట కల్పించారు.
ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 ఉండగా, ఆ మొత్తాన్ని రూ.75,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు ఏకంగా రూ.17,500 వరకు ప్రయోజనం చేకూరుతుందని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ట్యాక్స్ శ్లాబ్స్
పాతపన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం, ఎప్పటిలానే కొత్తపన్ను విధానంలో రూ.3 లక్షల వరకు వరకు ఎలాంటి పన్ను ఉండదు. గతంలో రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల శ్లాబులో పన్ను 5 శాతంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. గతంలో రూ. 6 లక్షల నుంచి రూ.9 లక్షలు ఉన్న శ్లాబును రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు మార్చారు. దీంతో ఇకపై రూ.10 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి 10 శాతం పన్ను వర్తించనుంది.
రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వార్షికాదాయం కలిగిన వారికి 15 శాతం పన్ను; రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వార్షికాదాయం కలిగిన వారికి 20 శాతం పన్ను విధిస్తారు. రూ.15 లక్షలపైన వార్షికాదాయం ఉన్నవారు 30 శాతం ఆదాయ పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ మార్పులు పాత పన్ను విధానం ఎంచుకునే వారికి వర్తించవు.
కొత్త శ్లాబులు ఇలా!
- సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను '0' (జీరో)
- రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
- రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
- రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
- రూ.12- 15 లక్షల 20 శాతం పన్ను
- రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను
పెన్షనర్లకు ఊరట : నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో పెన్షనర్లకు ఊరట కల్పించారు. పెన్షనర్లకు రూ.15 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.25 వేలకు పెంచారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండొంతుల మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారని ఆమె చెప్పారు. ఆ ఏడాది ఏకంగా 8.61 కోట్ల ఆదాయ పన్ను రిటర్నులు దాఖలయ్యాయని తెలిపారు.
ఏంజెల్ ట్యాక్స్
అంకురాల, ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని తరగతుల పెట్టుబడిదారులపై ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వృత్తి నిపుణులు విదేశాల్లో కలిగివున్న చరాస్తులపై సమాచారం ఇచ్చి తీరాలని స్పష్టం చేసింది. లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
గుడ్ న్యూస్ - ముద్ర లోన్ లిమిట్ రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు! - MUDRA Loan Scheme Doubled
కొత్తగా ఉద్యోగంలో చేరితే నెల జీతం బోనస్- ఐదేళ్లలో 4.1 కోట్ల మందికి ఉపాధి! - Union Budget 2024