ICICI Bank Fraud Alert : ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు ఒక హెచ్చరిక చేసింది. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఈ-మెయిల్స్‌కు, ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తున్న అనుమానాస్పద, హానికరమైన లింక్‌లు క్లిక్ చేయవద్దని సూచించింది. పొరపాటున ఈ లింక్‌లు క్లిక్ చేస్తే, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే నేరగాళ్లు బ్యాంకు అధికారులలాగా ఫోన్లు కూడా చేస్తున్నారు. వీటిని కూడా నమ్మవద్దని ఐసీఐసీఐ బ్యాంక్ సూచించింది.
ఆర్థికంగా నష్టపోవడం ఖాయం!
మీరు కనుక సైబర్ నేరగాళ్లు పంపించిన లింక్స్ ఓపెన్ చేస్తే, మీ డివైజ్‌లోకి హానికరమైన సాఫ్ట్వేర్లు లేదా అప్లికేషన్లు ఇన్స్టాల్ అయిపోతాయి. దీనితో మీ డివైజ్‌లో డేటా, బ్యాంకింగ్ వివరాలు వారి చేతికి చిక్కుతాయి. మీకు రావాల్సిన ఓటీపీలు కూడా సైబర్ నేరగాళ్లకే చేరతాయి. దీనితో మీ బ్యాంక్ అకౌంట్ల్లోని డబ్బులు మొత్తం సైబర్ నేరగాళ్ల దోచుకుంటారు. అందువల్ల కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లలో ఎలాంటి అనుమానాస్పద సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లు ఇన్స్టాల్ చేసుకోవద్దని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
"ఐసీఐసీఐ బ్యాంక్ ఎప్పుడూ వాట్సాప్ మెసేజ్‌లు, ఎస్ఎంఎస్లు చేసి, ఫలానా నంబర్‌కు కాల్ చేయమని, లేదా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని కస్టమర్లను కోరదు."
- ఐసీఐసీఐ బ్యాంక్
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ICICI Bank Provided Safety Tips For Customers : ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం కొన్ని సేఫ్టీ టిప్స్ కూడా చెప్పింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- కస్టమర్లు తమ మొబైల్లో లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను, సెక్యూరిటీ ప్యాచెస్‌ను అప్డేట్ చేసుకోవాలి.
- కేవలం గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల్లోని అధికారిక యాప్‌లను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి.
- తమ డివైజ్‌ల్లో పవర్ఫుల్ యాంటీ వైరస్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.
- ఏదైనా కొత్త యాప్ ఇన్స్టాల్ చేసే ముందు, అది ఏయే పర్మిషన్స్ అడుగుతోందో చెక్ చేసుకోవాలి.
- అనుమానాస్పద లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.
- హానికరమైన, అనధికారిక అప్లికేషన్లను ఎప్పుడూ ఓపెన్ చేయకూడదు. ఇన్స్టాల్ చేసుకోకూడదు.
- ఓటీపీ, పాస్వర్డ్, పిన్, కార్డ్ నంబర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు.
- అత్యవసరమైతే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి, సహాయం తీసుకోవాలి.
- అవసరమైతే పోలీసులకు కూడా రిపోర్ట్ చేయాలి.
క్రెడిట్ కార్డుతో బంగారం కొనుగోలు చేస్తే లాభమా? నష్టమా? - Can I buy gold using a credit card
రూ.80వేలు దాటిన వెండి - రూ.72వేలకు చేరువలో బంగారం! - Gold Rate Today April 3rd 2024