Major Upcoming IPOs in 2024 : వచ్చే రెండు నెలల్లో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకు(Initial Public Offering) వస్తున్నాయి!. దీంతోపాటు హ్యూందాయ్ మోటార్ ఇండియా తొలిసారిగా ఐపీఓకు సిద్ధమవుతోంది. ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, వారీ ఎనర్జీస్, నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్, గరుడ కన్స్ట్రక్షన్, వన్ మొబిక్విక్ సిస్టమ్స్ ఐపీఓలను ఇష్యూ చేయనున్నాయి. ఇవన్నీ కలిపి అక్టోబర్, నవంబర్ నెలల్లో రూ.60 వేల కోట్లు సమీకరిచేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆఫర్ ఫర్ సేల్‌తో హ్యూందాయ్ మోటార్ ఇండియా
హ్యుందాయ్ మోటార్ ఇండియా 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25,000 కోట్ల) పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనకు మార్కెట్ల నియంత్రణ సంస్థ- సెబీ అనుమతి ఇచ్చింది. దీంతో దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా ఇది నిలవనుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ మొత్తం 'ఆఫర్ ఫర్ సేల్' పద్ధతిలో జరగనుంది. ఐపీలో భాగంగా 142,194,700 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. అక్టోబర్‌లోనే హ్యూందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం.
స్విగ్గీ ఐపీఓ రెడీ!
ఈ ఐపీఓ ద్వారా రూ.10,414 కోట్ల సమీకరించాలని స్విగ్గీ భావిస్తోంది. ఇందులో రూ.3,750 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా, రూ.6,664 కోట్లు ఆఫర్ సేల్ పద్ధతిన విక్రయించనున్నారు. స్విగ్గీ ఐపీఓ నవంబర్‌లో ఉండొచ్చని సమాచారం.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ
ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ కంపెనీ ఎన్టీపీసీ అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 10 వేల కోట్లను సమీకరించేందుకు సిద్ధంగా ఉంది. నవంబర్ మొదటి వారంలోనే ఈ కంపెనీ ఐపీఓకు రానున్నట్లు సమాచారం.
మిగతా ఐపీఓలు
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఏఐఎల్) ఐపీఓ ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధమైంది. వారీ ఎనర్జీస్ ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.3వేల కోట్లు సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో విక్రయించే షేర్లు దీనికి అదనం. నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్, వన్ మొబిక్విక్ సిస్టమ్స్ వరుసగా రూ.3 వేల కోట్లు, రూ.700 కోట్ల సమీకరించాలని చూస్తున్నాయి.
ఇప్పటికే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఫస్ట్‌క్రై మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ సహా 62 కంపెనీలు దాదాపు రూ.64 వేల కోట్లను సమీకరించాయి. ప్రస్తుతం సెబీ 22 ఐపీఓలను ఆమోదించింది. దీంతో కంపెనీలు సుమారు రూ.60 వేల కోట్లను సమీకరించాలని చూస్తున్నాయి. అదనంగా 50కిపైగా సంస్థలు సెబీ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి.
IPOకి అప్లై చేస్తున్నారా? ఇలా చేస్తే పక్కా అలాట్ అవుతాయ్!
IPOలకు అప్లై చేస్తున్నారా? ఈ స్కామ్ గురించి తెలుసుకోండి - లేకుంటే ఇక అంతే! - SME IPO Scams