How To Protect Car From Rats : కారు ఇంజిన్‌లో ఎలుకలు దూరితే చిన్నపాటి అరాచకమే సృష్టిస్తాయి. వైర్లు, ఫ్యూయెల్ పైపులు, హోస్ పైప్స్, బెల్టులు, రబ్బర్ వస్తువులు, ఏసీ పైపులు.. ఇలా ఏది కనిపిస్తే అది కొరికి పారేస్తాయి. దీనివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఎలుకలు మీ కారులోకి రాకుండా చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మిరియాల పొడి :
మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగించే మిరియాల పొడితో.. కారులోకి ఎలుకలు రాకుండా అడ్డుకోవచ్చు. కొద్దిగా పెప్పర్ పౌడర్‌ను ఇంజిన్ బే వద్ద చల్లితే మిరియాల నుంచి వచ్చే ఘాటు వాసనకు ఎలుకలు రాకుండా ఉంటాయట. అయితే.. దీనివల్ల కారులో కొద్దిగా మిరియాల వాసన వస్తుంది.
ఎలుకల మందు :
కొంత మంది ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉంటే వాటిని చంపడానికి ఎలుకల మందును పెడుతుంటారు. ఈ ఐడియాను కారు విషయంలోనూ ఉపయోగించవచ్చు. అది ఎలా అంటే.. ఎలుకల మందును గోధుమ పిండిలో కలిపి చిన్నగా ముద్దలు చేసి ఇంజిన్ బే దగ్గర పెట్టాలి. దీనివల్ల ఎలుకలు ఆ పిండి ముద్దను తిని చనిపోతాయని నిపుణులంటున్నారు.
మీ కారు మంచి ధరకు అమ్ముడుపోవాలంటే - ఇలా చేయండి!
నాఫ్తలీన్ బాల్స్ :
కారు బేలోకి తరచూగా ఎలుకలు వెళ్లి అంతా పాడుచేస్తుంటే, ఇంజిన్‌లో అక్కడక్కడా నాఫ్తలీన్ బాల్స్‌ను పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల వాటి నుంచి వచ్చే వాసనకు ఎలుకలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.
పొగాకు :
మీరు కారును పార్క్ చేసిన చోట ఎలుకలు ఎక్కువగా ఉంటే.. ముందు జాగ్రత్తగా మేల్కోవడం మంచిది. ఇందుకోసం.. పొగాకును ఉపయోగించొచ్చు. అది ఎలా అంటే.. ముందుగా మార్కెట్లో దొరికే పొగాకును తీసుకొచ్చి.. చిన్న వస్త్రం ముక్కలో కట్టి పెట్టుకోండి. తర్వాత ఆ వస్త్రం మూటను ఇంజిన్ బేలో రబ్బర్ పైపులకు కట్టండి. వీటిని బ్యాటరీ వైర్‌లకు కొంత దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పొగాకును బట్టలో కట్టి ఇంజిన్‌లో పెట్టడం వల్ల ఆ వాసనకు ఎలుకలు కారు ఇంజిన్ బేలోకి రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ర్యాట్ డిటరెంట్‌తోనూ ఫలితం :
కారు ఇంజిన్‌లోని వివిధ భాగాలను ఎలుకలు పాడు చేస్తుంటే.. ర్యాట్ డిటరెంట్‌ను వాడండం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందట. ఇది ప్రస్తుతం అన్ని దుకాణాలు, ఇంకా ఆన్‌లైన్ స్టోర్లలోనూ దొరుకుతోంది. వీటిని తెచ్చి ఇంజిన్ బేలో పెట్టడం వల్ల ఎలుకలు బెడద తొలగిపోతుంది.
ఇంకా ఇలా చేయండి..
- వీలైనంత వరకూ కారును మురికి కాలువల దగ్గర పార్క్ చేయకండి
- పార్కింగ్ దగ్గర ఎలుకలు ఎక్కువగా ఉంటే ఆల్ట్రా సోనిక్ పరికరాలను ఉపయోగించండి
- కారు ఇంజిన్‌లోని భాగాలు ఎలా ఉన్నాయో తరచూ చెక్ చేస్తూ ఉండండి
అలర్ట్ : కారు టైర్లు ఎందుకు పేలుతాయి? - ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
మీ కారు ఇంటీయర్ను క్లీన్ చేసుకోవాలా? ఈ 5-సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు!