How To Implement The 8-8-8 Rule : మన విలువైన సమయం వృథా కాకుండా ఉండాలంటే టైం మేనేజ్‌మెంట్ ఎంతో అవసరం. ఈ సాంకేతిక యుగంలో పని విధానం(వర్క్ కల్చర్)లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. కనుక ఉన్న కొద్దిపాటి సమయంలోనే వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేసుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఉద్యోగ జీవితంలో ఏకకాలంలో అనేక పనులు చేయాల్సి వస్తోంది. దీనితో శారీరక, మానసిక ఒత్తడి పెరిగిపోతోంది. అందుకే మన వర్క్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసే 8-8-8 రూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏమిటీ 8-8-8 రూల్?
మన విలువైన సమయాన్ని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలిపే టైమ్ మేనేజ్‌మెంట్ పద్ధతి ఇది. మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సమతుల్యం చేసుకునేందుకు ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ 8-8-8 రూల్ ప్రకారం, ఒక రోజులోని 24 గంటలను 8 గంటలు చొప్పున 3 భాగాలుగా విభజించుకోవాలి. వాస్తవానికి ఓ 8 గంటను ఎలానో ఉద్యోగానికి కేటాయించాల్సి వస్తుంది. మరో 8 గంటలను మీ దైనందిన పనులు చేయడానికి, మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో ఆనందంగా గడపేందుకు ఉపయోగించాలి; మిగతా 8 గంటల్ని నాణ్యమైన నిద్ర కోసం కేటాయించాలి. దీని వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యాలు పదిలంగా ఉంటాయి. అంతేకాదు మీ లక్ష్యాలను సులువుగా చేరుకొనేందుకు అవకాశం కలుగుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.
లాభాలేంటి?
ఈ 8-8-8 రూల్ అనేది అందరికీ ఒకేలా నప్పకపోవచ్చు. కనుక ఎవరి అవసరాలను బట్టి వారు తమకున్న సమయాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని, చక్కని ప్రణాళిక వేసుకోవాలి. వాస్తవానికి ఈ రూల్‌ను క్రమశిక్షణతో ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి.
మీ జీవన శైలిని ఆరోగ్యంగా, సంతృప్తికరంగా మలచుకొనేందుకు ఈ 8-8-8 రూల్ ఓ చక్కని సాధనంగా ఉపయోగపడుతుంది. మీ పనుల్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకోవడం వల్ల చేసే పని పట్ల ఫోకస్ పెరుగుతుంది. కనుక ఈ రూల్‌ను మీ దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే మీ పనులు సక్రమంగా పూర్తవుతాయి. నిర్లక్ష్య ధోరణి కూడా తగ్గుతుంది. ఫలితంగా దీర్ఘకాలంలో మరిన్ని మంచి సత్ఫలితాలు సాధించవచ్చు.
సరైన విధంగా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో హాయిగా గడపవచ్చు. పైగా సంగీతం, పుస్తక పఠనం వంటి అలవాట్లతో మీ ఊహాశక్తిని పెంచుకోవచ్చు. కొత్త ఆలోచనలతో నిత్యనూతనంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు.
ఈ విధంగా మీరు మీ సమయాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవడం వల్ల ఎప్పటికప్పుడు విశ్రాంతి లభిస్తుంది. కనుక ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటారు. పనిలోనూ సృజనాత్మక పెరుగుతుంది. దీనితో ఎలాంటి సమస్యకైనా పరిష్కారాలు కనుగొని, కెరీర్‌లో రాణించడానికి అవకాశం ఏర్పడుతుంది. తగినంత నిద్రతో మీ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు ఒత్తిడి, ఆందోళన, నిరాశ లాంటివి తగ్గి, శరీరంలో సహజ ప్రక్రియలు మెరుగవుతాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
అడ్డంకులు వస్తాయ్ - కానీ!
ఈ 8-8-8 రూల్‌ను అమలుచేయడం అంత తేలికైన విషయం కాదు. దీనికి అనేక రకాల అడ్డంకులు ఎదురవుతుంటాయి. వాతావరణంలో మార్పులు, శబ్దాలు, అనారోగ్య పరిస్థితులు వల్ల ఒక్కోసారి నాణ్యమైన నిద్రకు భంగం కలిగించవచ్చు. దీనికితోడు సహచరులు, కుటుంబ సభ్యులు, ఆఫీస్‌లో బాస్ నుంచి ఏదో ఒక రూపంలో ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా సహజమే. అందుకే సరైన ప్రణాళిక వేసుకొని, అంకితభావంతో 8-8-8 రూల్ పాటించేస్తే, ఒత్తిడి తగ్గి, జీవితంలోని అనేక రంగాల్లో గొప్ప విజయాలు సాధించే అవకాశం ఏర్పడుతుంది.
పదో తరగతి అర్హతతో - సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 484 ఉద్యోగాలు - Bank Jobs In 2024