How To Identify Fake GST Bill : పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పటికీ చాలా చోట్ల జీఎస్టీ ఎగవేత, నకిలీ బిల్లుల ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. హోటల్, కొన్ని షోరూమ్స్, దుకాణాల్లో జీఎస్టీ బిల్లులను ఇస్తుంటారు. అందులో కొన్ని నకిలీవి ఉంటాయి. అందుకే మోసాలను అరికట్టేందుకు, మీ నుంచి జీఎస్టీ పేరుతో అదనపు సొమ్ము కొల్లగొట్టకుండా ఉండేందుకు బిల్లుల ప్రామాణికత తెలుసుకోవడం చాలా ముఖ్యం.
నకిలీ జీఎస్టీని గుర్తించడం ఎలా?
వెరిఫై GSTIN
వస్తు, సేవలు అందించే వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రత్యేకమైన 15 అంకెల GSTINను కేటాయిస్తారు. ఇందులో రాష్ట్ర కోడ్, సరఫదారుని పాన్ నంబర్, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. మీకు సప్లయర్ బిల్లు ఇచ్చిన వెంటనే, అందులోని GSTINని చెక్ చేయాలి. జీఎస్టీ పోర్టల్‌లో దానిని ఎంటర్ చేయాలి. ఒక వేళ సదరు GSTIN సరైనదే అయితే, జీఎస్టీ పోర్టల్‌లో పన్ను చెల్లింపుదారు రకం, రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ స్థానం (రాష్ట్రం), చట్టపరమైన పేరు, వ్యాపారం, వాణిజ్యం పేరు, UIN లేదా GSTIN స్టేటస్ కనిపిస్తాయి. అప్పుడు మీకు ఇచ్చిన బిల్లు అసలైనదో? నకిలీదో? తేలిపోతుంది.
ఇన్వాయిస్ నంబరు చెక్ చేయండి
మీకు ఇచ్చిన జీఎస్టీ బిల్లులోని ఇన్ వాయిస్ నంబర్, తేదీలను కూడా చెక్ చేయాలి. ఈ ఇన్వాయిస్ నంబర్ యూనిక్‌గా, వరుస క్రమంలో ఉండాలి. మరీ ముఖ్యంగా మీరు వస్తు, సేవలు కొన్న నిర్ణీత టైమ్ కూడా దానిలో నమోదై ఉండాలి.
వెరిఫై ఇన్వాయిస్ వాల్యూ
జీఎస్టీ బిల్లులో మీరు కొనుగోలు చేసిన వస్తు, సేవల విలువ, దానిపై విధించిన పన్ను మొత్తం ఉంటుంది. అందుకే మీరు జీఎస్టీ వెబ్‌సైట్‌లోని కాలిక్యులేటర్ ఓపెన్ చేసి, ఇన్వాయిస్లోని డబ్బులకు సరిపడా జీఎస్టీ వేశారా? లేదా ఎక్కువ వసూలు చేస్తున్నారా? అనేది చెక్ చేసుకోవాలి.
సరఫరాదారుని సంతకం
అలాగే జీఎస్టీ బిల్లులో సప్లయర్ లేదా అతని అధీకృత ప్రతినిధి సంతకం ఉండాలి. బిల్లుపై కనిపించే ఆ సంతకం జీఎస్టీ పోర్టల్‌లో ఉన్న సంతకంతో సరిపోలుతుందో లేదో తనిఖీ చేయాలి.
ట్యాక్స్ పేమెంట్ స్టేటస్
చివరగా కస్టమర్లు జీఎస్టీ పోర్టల్‌లోని సప్లయర్ టాక్స్ పేమెంట్ స్టేటస్‌ను కూడా చెక్ చేయవచ్చు. ఒక వేళ జీఎస్టీ పోర్టల్‌లో సదరు సప్లయర్ వివరాలు కనిపించలేదంటే, అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడని తెలుసుకోండి.
ఫిర్యాదు చేయండిలా!
ఒకవేళ మీరు నకిలీ జీఎస్టీ బిల్లును గుర్తించినట్లైతే నేరుగా జీఎస్టీ పోర్టల్‌లోనే ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే పోర్టల్‌లోని టోల్-ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి రిపోర్ట్ చేయవచ్చు.
జీఎస్టీ రిటర్న్ అంటే ఏమిటి? దీనిని ఎవరు దాఖలు చేయాలి? - What Is GST Return