How To File Income Tax Returns Online : ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే తరుణం వచ్చేసింది. ఉద్యోగం చేస్తూ వేతనం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నవారు, ఆడిట్ పరిధిలోకి రానివారు కూడా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిందే. ఇందుకోసం జులై 31 వరకు గడువు ఉంది. అయినప్పటికీ ముందుగానే ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిది.
ఐటీ శాఖ ఇటీవలి కాలంలో ఆదాయ పన్ను రిటర్నులను మరింత సులభతరం చేస్తూ అనేక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 2024-25 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఉద్యోగులు ఏం చేయాలి?
ఉద్యోగులు, తమ యాజమాన్యాల నుంచి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వివరాలతో ఫారం 16, ఫారం 26ఏఎస్‌లను తీసుకోవాలి. అలాగే ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లోకి వెళ్లి మీ ఆదాయ వివరాలతో వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) డౌన్లోడ్ చేసుకోవాలి. ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ 3 పత్రాలు అత్యంత కీలకమని మీరు గుర్తుంచుకోవాలి.
సరైన ఫారం ఎంచుకోవాలి!
ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు సరైన ఫారాన్ని ఎంచుకోవడం తప్పనిసరి. పొరపాటున వేరే ఫారాన్ని ఎంచుకుంటే, ఆదాయ పన్ను శాఖ దానిని డిఫెక్టివ్ రిటర్నుగా పరిగణిస్తుంది. ఫలితంగా మీరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) నోటిఫై చేసిన ఫారాల్లో మీకు సరిపడే ఫారాన్ని ఎంచుకోవాలి.
ఆదాయం, నివాస స్థితి, వ్యాపారం మొదలైనవాటి ఆధారంగా ఈ ఫారాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం 7 ఫారాలు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన దానిని ఎంచుకోవాలి.
- ఐటీఆర్ 1 (సహజ్) : ఇది చాలా సరళమైనది. రూ.50 లక్షల లోపు వేతనం, ఒకే ఇంటిపై ఆదాయం, వడ్డీ రూపంలో ఆదాయం అందుకుంటున్నవాళ్లు ఈ ఫారాన్ని ఎంచుకోవాలి.
- ఐటీఆర్ 2 : రూ.50 లక్షలకు మించి ఆదాయం, మూలధన లాభాలు, వ్యాపార ఆదాయం, విదేశాల నుంచి ఆదాయం, ఒకటి కంటే ఎక్కువ ఇళ్ల ద్వారా ఆదాయం వచ్చినప్పుడు ఈ ఫారాన్ని తీసుకోవాలి.
- ఐటీఆర్ 3 : హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్)లకు చెంది ఉండి, వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం ఆర్జించే వారు ఈ ఫారాన్ని తీసుకోవాలి.
పాత, కొత్త పద్ధతుల్లో!
ఐటీ రిటర్నులను ఏ విధానంలో దాఖలు చేయాలన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మీరు ఎలాంటి మినహాయింపులు వద్దు అనుకుంటే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. మినహాయింపులతోపాటు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలని అనుకుంటే పాత పన్ను విధానంలోనే కొనసాగవచ్చు. మీకు ఏ విధానం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకునేందుకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌వారు అందిస్తున్న కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకోవచ్చు.
కచ్చితమైన సమాచారం ఇవ్వాలి!
ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే ముందు కొన్ని విషయాలపై స్పష్టత ఉండాలి. వేతనం ద్వారానే కాకుండా, ఇతర మార్గాల్లో కూడా మీకు ఏమైనా ఆదాయం వస్తోందా? లేదా? అనేది చూసుకోవాలి. అంటే పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో ఆదాయం రావడం, షేర్లు, మ్యూచువల్ ఫండ్ల నుంచి డివిడెండ్లు, గతంలో వచ్చిన పన్ను రిఫండ్‌పై వడ్డీ లాంటివన్నీ చూసుకోవాలి. అప్పుడే మీ మొత్తం ఆదాయం ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏఐఎస్‌ను పరిశీలించి కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా మీ ఆదాయ వివరాల్లో ఏమైనా తప్పులుంటే, వాటిని సరిచేసుకున్న తరువాత మాత్రమే రిటర్నులు సమర్పించాలి.
పన్ను మినహాయింపుల కోసం
పన్నుల భారం తగ్గాలంటే, మీరు పెట్టిన పెట్టుబడులు, తీసుకున్న బీమా పాలసీల వివరాలన్నీ సరిగ్గా నమోదు చేయాలి. ఒకవేళ ఫారం-16లో నమోదు చేయని మినహాయింపులు ఉంటే, వాటిని కూడా రిటర్నులలో చూపించుకోవచ్చు. అయితే అందుకు తగిన ఆధారాలు మీ దగ్గర కచ్చితంగా ఉండాలి.
బ్యాంకు ఖాతా ధ్రువీకరణ
ఐటీఆర్ సమర్పించినప్పుడు మీ బ్యాంక్ ఖాతా వివరాలు కూడా సమర్పించాలి. అప్పుడే మీకు రావాల్సిన రీఫండ్ సులువుగా పొందడానికి వీలవుతుంది. ఇందుకోసం మీరు ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లో మీ బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో, లేదో చూసుకోవాలి. ఖాతా సంఖ్య, బ్యాంకు పేరు, ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్లను సరిచూసుకోవాలి. మీకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నప్పుడు వాటి వివరాలు పేర్కొనడమే మంచిది. కానీ, రీఫండు ఏ ఖాతాకు రావాలన్నది మీరే ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే రిటర్నులు దాఖలు చేసే సమయంలో మరోసారి అన్ని వివరాలు ధ్రువీకరించుకోవడం మేలు.
గడువులోగానే
ఐటీఆర్ దఖలు చేసేందుకు జులై 31 వరకు గడువు ఉంది. అయినప్పటికీ వీలైనంత త్వరగా రిటర్నులు దాఖలు చేయడం మంచిది. లేకుంటే చివరి నిమిషంలో ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు ఇబ్బందులు వస్తే, గడువు తేదీ దాటిపోతుంది. దీని వల్ల అనవసర జరిమానాలు కట్టాల్సి వస్తుంది. పైగా మూలధన నష్టాలు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కూడా కోల్పోవాల్సి ఉంటుంది.
హోం లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్! - Home Loan Tips
ఉద్యోగం లేకున్నా క్రెడిట్ కార్డు పొందవచ్చు - ఎలాగో తెలుసా? - How To Get Credit Card Without Job