Nominee In Term Insurance : తక్కువ ప్రీమియంతో ఎక్కువ జీవిత బీమా రక్షణ ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ మంచి ఆప్షన్. అయితే ఈ బీమాలో కట్టిన ప్రీమియం మెచ్యూరిటీ సమయంలో తిరిగి రాదు. కానీ ఆర్థిక భద్రత చాలా ఎక్కువ. పాలసీ వ్యవధిలో అనుకోని ప్రమాదం జరిగి పాలసీదారుడు మరణిస్తే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ కుటుంబానికి ఆర్థిక రక్షణను ఇస్తుంది. పాలసీలో పేర్కొన్న నామినీకి ఈ ఇన్సూరెన్సీ కవరేజ్ అందుతుంది.
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో నామినీ కీలక పాత్ర పోషిస్తారు. అందుకే మీరు జాగ్రత్తగా నామినీని ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా పాలసీదారులు నామినీగా భార్య, సంతానం, తోబుట్టువులు, తల్లిదండ్రులు వంటి కుటుంబసభ్యులను పెట్టుకుంటారు. మరికొందరు అత్త, మామ, మేనకోడలు, మేనల్లుడిని నామినీని ఎంచుకుంటారు. అయితే ఈ నామినీ అంటే ఏమిటి? టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో నామినీగా ఎవరినీ పెట్టుకోవాలి? వంటివి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నామినీల్లో రకాలు
కుటుంబ నామినీలు : భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, చట్టబద్ధంగా సంబంధం ఉన్న వ్యక్తులను కుటుంబ నామినీలుగా పరిగణిస్తారు. చాలా మంచి ఇన్సూరెన్స్ పాలసీకి నామినీగా కుటుంబ సభ్యులనే ఎంచుకుంటారు. సహోద్యోగి, స్నేహితుడు వంటి వారిని కూడా మీరు నామినీలుగా పెట్టుకోవచ్చు. బంధువులు లేని అవివాహితులు టర్మ్ పాలసీకి నామినీలుగా కుటుంబేతరులను ఎంపిక చేసుకుంటారు.
మైనర్ నామినీలు : 18 ఏళ్లు కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులను మైనర్ నామినీలు అంటారు. తల్లిదండ్రులు తమ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నామినీలుగా వీరిని ఎంపిక చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి అభ్యంతరం ఉండదు.
బహుళ నామినీలు : పాలసీదారులు బహుళ వ్యక్తులను నామినీగా నియమించుకునే అవకాశం ఉంది. పాలసీదారుడు బహుళ నామినీలను పెట్టుకోవచ్చు.
నామినీని ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే!
కుటుంబ పరిస్థితి : మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం నామినీను ఎంచుకునేటప్పుడు మీ కుటుంబ పరిస్థితిని అంచనా వేయడం చాలా అవసరం. మీ వ్యక్తిగత, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా నామినీ ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీ తల్లిదండ్రులను నామినీ పెట్టొచ్చు. అలాగే మీకు వివాహం జరిగినట్లేతే మీ భార్య, పిల్లలను నామినీగా పెట్టవచ్చు.
భవిష్యత్తు అవసరాలను అంచనా వేయండి : మీపై ఆధారపడిన వారి భవిష్యత్తు ఆర్థిక అవసరాలను అంచనా వేయండి. ఉదాహరణకు భవిష్యత్తులో బీమా ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయడానికి మీ తల్లిదండ్రులు సమీపంలో లేకపోయినా మీ పిల్లలకు ఆర్థిక సాయం అవసరమవుతుంది. అందుకే వీటిని పరిగణలోకి తీసుకుని నామినీని పెట్టుకోండి.
బీమా శాతాన్ని విభజించాలి : మీరు బహుళ నామినీలను ఎంచుకోవాల్సిన అవసరం కొన్నిసార్లు రావొచ్చు. ఉదాహరణకు మీరు మీ జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలను ఒకే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు నామినీలుగా పెట్టుకోవచ్చు. అప్పుడు మీరు వారికి శాతాల వారికి బీమా మొత్తాన్ని పొందేటట్లు పాలసీలో పొందుపర్చాలి. ఇందులో భాగంగా మీ భార్యకు 50 శాతం, ఇద్దరి పిల్లలకు చెరో 25 శాతం చొప్పున కేటాయించవచ్చు.
ఒకే నామినీ పేరు : మీరు లేనప్పుడు చట్టపరమైన సమస్యలను నివారించడానికి మీ వీలునామా, బీమా పాలసీల్లో ఒకే పేరును నామినీగా పెట్టండి. లేదంటే కుటుంబంలో వాగ్వాదాలు జరగొచ్చు.
మైనర్ నామినీ విషయంలో సంరక్షకుడిని నియమించండి : మీరు మీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు నామినీగా మైనర్‌ను పెట్టినట్లైతే వారికి ఒక చట్టపరమైన సంరక్షకుడిని కూడా నియమించాలి. ఆ సంరక్షకుడు మీ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా బీమా చెల్లింపును పిల్లలకు అందేలా చూస్తారు. మీ పిల్లల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు సంరక్షుడు (గార్డియన్)గా నమ్మదగిన, విశ్వసనీయమైన వ్యక్తిని పెట్టుకోండి.
నామినీ పేరు అప్డేట్ చేయండి : మీ వ్యక్తిగత సంబంధాలలో ఏదైనా మార్పులు జరిగితే వాటిని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో కూడా తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు భార్యతో విడాకులు తీసుకున్నా లేదా ఆమె మరణించినా మీ సతీమణి పేరును పాలసీ డాక్యుమెంట్ నుంచి తీసివేయండి. వారి స్థానంలో కొత్త నామినీని అప్డేడ్ చేయండి.
నామినీకి తెలియజేయండి: పాలసీదారుడు పాలసీ గురించి నామినీలకు తెలియచేయడం, వారితో పాలసీ పత్రాలను పంచుకోవడం చాలా ముఖ్యం.
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో నామినీ లేకపోతే ఏం జరుగుతుంది?
ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో నామినీ లేకపోతే, బీమా కంపెనీ మీ జీవిత భాగస్వామి, పిల్లలు, చట్టపరమైన బంధువులకు ఆ బీమా చెల్లింపును అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో బీమా కంపెనీ మీ వీలునామాను కూడా పరిశీలిస్తుంది. వీలునామాలో రాసిన విధంగా ఆ ఆదాయాన్ని అందించవచ్చు.
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? - Types Of Term Insurance
మంచి ఆరోగ్య బీమా పాలసీ ఎంచుకోవాలా? ఈ టాప్-6 టిప్స్ మీ కోసమే! - How To Choose Best Health Insurance