Home Insurance Protection : వరదలు, భూకంపాలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మనం కట్టుకున్న ఇల్లు పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో తీవ్ర ఆస్థి నష్టం జరుగుతుంది. దీని నుంచి కోలుకునేందుకు గృహ బీమా తోడుగా ఉంటుంది. ఆస్తి పాడైనప్పుడే కాకుండా, అద్దెకున్న వారు ఇల్లు ఖాళీ చేసినప్పుడూ అద్దె నష్టాన్ని భర్తీ చేసుకునే విధంగానూ బీమా పాలసీ తోడ్పడుతుంది. 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకూ పాలసీలను ఆయా బీమా సంస్థలు అందిస్తున్నాయి. ఆస్తి యజమానితోపాటు, అద్దెకు ఉన్నవారూ ఈ బీమా పాలసీని తీసుకోవచ్చు. ఆ పాలసీలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మీ ఆభరణాలకు రక్షణ : గృహోపకరణాలు, ఫర్నిచర్, దుస్తులు, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, టెలివిజన్ మొదలగువాటితో పాటుగా ఇంట్లో ఉన్న ఇతర వస్తువులనూ గృహ బీమా పరిధిలోకి తీసుకురావచ్చు. ఆభరణాల వంటి విలువైన వాటికీ గృహ బీమా కింద విడిగా పాలసీ తీసుకునే వెసులుబాటు ఉంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడే కాకుండా, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ధరించిన ఆభరణాలకూ బీమా చేసుకోవచ్చు.
పునరావాసం కోసం : అగ్ని ప్రమాదాల వంటి ఘటనల విషయంలో బీమా సంస్థల నిబంధనలు, షరతుల మేర నిర్మాణ వ్యయాన్ని తిరిగి చెల్లిస్తాయి. పునరావాసం కోసం అవసరమైన ఖర్చులకు గృహ బీమాలో అనుబంధ పాలసీ (యాడ్ ఆన్)లూ పాలసీలు ఉంటాయి. ఇంట్లోని వస్తువులు దొంగతనానికి గురైనప్పుడు, ఆ వస్తువుల ఖర్చునూ పాలసీ చెల్లిస్తుంది.
పొరుగువారి ఆస్తికి నష్టం : కొన్ని సందర్భంల్లో మీ ఇంటి వద్ద జరిగిన ప్రమాదం కారణంగా మూడో పక్షానికి (థర్డ్ పార్టీ) భౌతిక, ఆస్తి నష్టం జరిగినప్పుడు కూడా వారికి నష్టపరిహారం అందేలా పాలసీ తీసుకోవచ్చు. ఉదాహరణకు సిలిండర్ పేలుడు, ఇంటిలో మరమ్మతు కారణంగా పొరుగువారి ఆస్తికి నష్టం కలిగే ఆస్కారం ఉంది. గృహ బీమా పాలసీలో పబ్లిక్ లయబిలిటీ అనుబంధ పాలసీని ఎంచుకోవడం ద్వారా ఇలాంటి వాటికి రక్షణ లభిస్తుంది.
కొత్త వస్తువులతో భర్తీ : గృహ బీమా పాలసీని మీకు ఇష్టం ఉన్నట్లు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. బీమా తీసుకునే సమయంలో ఆస్తి, వస్తువుల విలువను బీమా తీసుకునే వ్యక్తి సొంత ధ్రువీకరణతో వెల్లడించవచ్చు. దీనికి బీమా సంస్థ అంగీకరిస్తే అందుకు సంబంధించిన పాలసీని ఇస్తుంది. దెబ్బతిన్న ఆస్తి, వస్తువులను కొత్త వస్తువులతో భర్తీ చేసేలా పాలసీని తీసుకోవచ్చు. మార్కెట్ విలువ ప్రకారం పరిహారం పొందే విధంగానూ పాలసీని ఎంచుకోవచ్చు.
అనుబంధ పాలసీలు : అద్దె నష్టం, తాత్కాలిక పునరావాసం, తాళాలు పోవడం సహా పెంపుడు జంతువులకు రక్షణ లభించే విధంగా అనేక అనుబంధ పాలసీలను గృహ బీమాలో భాగంగా తీసుకునే అవకాశం ఉంది. గృహ బీమా చాలా ఖరీదైనదేమీ కాదు. కొన్ని సంస్థలు రోజుకు రూ.5, రూ.10తో కూడా ఈ బీమా పాలసీని అందిస్తున్నాయి. కాబట్టి, ఇంటికి ఈ బీమా పాలసీలతో రక్షణ కల్పిస్తే చింత లేకుండా ఉండొచ్చు.
హౌస్ లోన్ EMI భారంగా ఉందా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఈజీగా! - Home Loan EMI Reducing Tips