How To Change Car Gears Correctly : కారు ఎంత స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు గేర్లు మార్చాలో కొంత మందికి అవగాహన ఉండదు. ఇలా గేర్లను స్పీడ్ ప్రకారం వేయకపోవడం వల్ల.. కారు తొందరగా షెడ్డుకు వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఎంత స్పీడ్‌లో ఉన్నప్పుడు ఏ గేర్లో కారును డ్రైవ్ చేయాలి ? గేర్లు మార్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్న కార్లలో తరచూ గేర్లను మార్చాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అవి స్పీడ్‌ను బట్టి ఆటోమేటిక్‌గా మారిపోతూ ఉంటాయి. కానీ.. ఇవి తక్కువ మైలేజ్ ఇస్తాయి. అయితే.. మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న కార్లలో స్పీడ్ ప్రకారం గేర్లను మార్చాల్సి ఉంటుంది. లేదంటే.. ఫ్యూయల్ ఎక్కువగా ఖర్చవుతుందని తెలియజేస్తున్నారు.
కార్లలో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణాలివే!
యాక్సిలరేషన్ కోసం మొదటి మూడు గేర్లు :
కారులో ఒకటి నుంచి ఐదు గేర్లు ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే! అయితే.. ఇందులో మొదటి మూడు గేర్లను తొందరగా కారును యాక్సిలరేట్ చేసేందుకు ఉపయోగించాలని నిపుణులంటున్నారు. ఆ తర్వాత కారు కొంత స్పీడ్‌కు వెళ్లినప్పుడు టాప్ స్పీడ్ కోసం 4, 5 గేర్లను వేయాలని చెబుతున్నారు.
ఏ గేర్‌లో ఎంత స్పీడ్ వెళ్లాలి ?
మొదటి గేర్ : కారును స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేస్తాం. ఆ కారు ట్రాఫిక్‌లో నెమ్మదిగా గనక కదులుతూ ఉంటే మొదటి గేర్‌లోనే ఉండాలి.
రెండవ గేర్ : కారు స్పీడ్ గంటకు 10 నుంచి 20 కి.మీ. వేగంలో ఉన్నప్పుడు రెండవ గేర్ వేయాలి. అలాగే కొద్దిగా స్పీడ్‌గా ట్రాఫిక్‌లో కదులుతున్నప్పుడు కూడా వెహికిల్ రెండవ గేర్‌లోనే ఉండాలి. ఇంకా ఎక్కడైనా టర్న్ తీసుకోవాల్సినప్పుడు కూడా కారు రెండవ గేర్‌లోనే ఉండాలి.
మూడవ గేర్ : కారు స్పీడ్ గంటకు 30 నుంచి 35 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు మూడవ గేర్ వేయాలి. నగరంలో సాధారణ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ గేర్ వేయాలి.
నాలుగవ గేర్ : కారు స్పీడ్ గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఉన్నప్పుడు నాలుగవ గేర్ వేయాలి. అలాగే సిటీ రోడ్లపై మంచి మైలేజ్ రావాలంటే కూడా నాలుగో గేర్‌లోనే డ్రైవ్ చేయాలి. హైవే పై ప్రయాణిస్తున్నప్పుడు ముందున్న వెహికిల్‌ను ఓవర్‌టెక్ చేయాలనుకుంటే.. ఫోర్త్ గేర్‌లో వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఐదవ గేర్ : కారు స్పీడ్, మైలేజ్ బాగుండటానికి ఈ గేర్ వాడాలి. కారు స్పీడ్ గంటకు 65 కి.మీ. వేగం దాటినప్పుడు మాత్రమే ఐదవ గేర్ వేయాలి.
ఇంకా :
- టర్న్ తీసుకోవాల్సి వస్తే.. మలుపు దగ్గరకు రావడానికి ముందే గేర్లను తగ్గించి.. అనుగుణంగా టర్న్ తీసుకోండి.
- గేర్లను సున్నితంగా మార్చండి. గట్టిగా గేర్లను మార్చితే ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
- తక్కువ స్పీడ్‌తో వెళ్తున్నప్పుడు ఎక్కువ గేర్లు వేస్తే ఇంజిన్ నుంచి శబ్ధం వస్తుంది. కాబట్టి.. ఇంజిన్ సౌండ్ విని గేర్ వేయాలి.
- ఇలా గేర్లను సరిగా వినియోగించకపోతే.. గేర్ బాక్స్ పగిలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కారు ఇంజిన్‌లో ఎలుకలు దూరి అంతా పాడు చేస్తున్నాయా? - ఈ టిప్స్‌తో అవి పరార్!
టాటా, మారుతి కార్లపై భారీ ఆఫర్స్ - ఆ మోడల్‌పై ఏకంగా రూ.1.53 లక్షలు డిస్కౌంట్!