How To Become A Stock Trader : చాలా మంది మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించడానికి, సురక్షితమైన ఆర్థిక భవిష్యత్‌ను కలిగి ఉండడానికి అదనపు ఆదాయ మార్గాలను సృష్టించుకుంటున్నారు. ఇందులో భాగంగా స్టాక్ మార్కెట్ షేర్లలో పెట్టుబడి పెట్టడాన్ని కూడా ఒక మార్గంగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. మంచి రాబడి పొందాలంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
విశ్లేషణా సామర్థ్యం
స్టాక్ మార్కెట్ రంగంలో ప్రవేశించేవారు సునిశితమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. వారు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారో ఆ పరిశ్రమలపై ప్రభావం చూపే అన్ని సంబంధిత సమాచారాన్ని కనుగొనడానికి ఆసక్తి ప్రదర్శించాలి. రాజకీయ వర్గాలు, బ్యూరోక్రాట్స్ చేసే ఫైనాన్షియల్ ప్రకటనలు కూడా ఒక్కోసారి స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తుంటాయి. ట్రేడింగ్‌లో కీలకమైన సాధనం మార్కెట్‌పై లోతైన పరిశోధన, సాంకేతిక విశ్లేషణ చేయాలి. సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా ట్రేడింగ్‌లో అధిక నష్టాలకు గురవ్వకుండా ఉండొచ్చు.
ఓపిక అవసరం
స్టాక్స్‌లో ట్రేడింగ్ చేసే ప్రతి వ్యక్తి విజయవంతం అవ్వకపోవచ్చు. చాలాసార్లు స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా ప్రవేశించిన మదుపర్లు నష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఎక్కువ ఆందోళన చెందుతారు. ఇలాంటి వారికి స్టాక్ మార్కెట్లు సెట్ కావు. ఒక ట్రేడర్ అన్ని రకాల పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా నష్టం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. స్టాక్ ట్రేడర్ కూడా ప్రొఫెషనల్స్‌తో సమానం. ఒక ప్రొఫెషనల్ నిరంతరం ప్రతి విషయంలో మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి. తన ప్రశాంతతను కాపాడుకోవాలి. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని కూడా విశ్లేషించే సామర్థ్యం ఉండాలి. పరిస్థితిని మరింత దిగజార్చుకోకూడదు.
మార్కెట్ వ్యూహాలు
ఇన్వెస్టర్లు మార్కెట్‌లో గరిష్ఠం, కనిష్ఠం రెండింటి హెచ్చు తగ్గులను చాలాసార్లు చూసే ఉంటారు. అలాంటి సమయంలో మార్కెట్‌లో ఉండడం చాలా కీలకం. ఎందుకంటే అటువంటి సమయంల్లోనే ట్రేడింగ్‌లో అవసరమైన సర్దుబాట్లు చేయడానికి, తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ట్రేడర్లు వృద్ధి అవకాశాలను గుర్తించి, మంచి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నిసార్లు ఇన్వెస్టర్లు చేసే ఓవర్ ట్రేడింగ్ వల్ల భారీ నష్టాన్నీ కలిగించవచ్చు. ఓవర్‌ట్రేడింగ్ అనేది మదుపర్లు చేసే సాధారణ తప్పు. ట్రేడింగ్ చేసేటప్పుడు క్రమశిక్షణతో కూడిన విధానం పాటించడం అవసరం. ఒక్కసారిగా లాభాలను ఆర్జించే బదులు మార్కెట్‌లో నిలదొక్కుకుని, క్రమం తప్పకుండా రాబడులు సంపాదించాలనే ఆలోచన కలిగి ఉండాలి. ట్రేడింగ్‌లో రిస్క్ మేనేజ్‌మెంట్ అతి ముఖ్యమైనది. మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడం, స్టాప్-లాస్ ఆర్డర్లను ఉపయోగించడం, పెద్ద ట్రేడ్స్‌ను నివారించడం లాంటి చర్యల ద్వారా మార్కెట్ వ్యూహాలను అమలు చేయాలి.
స్టాక్‌మార్కెట్ ట్రెండ్స్ విశ్లేషణ
స్టాక్ మార్కెట్ అనేది చాలా అస్థిరంగా ఉంటుంది. ఇన్వెస్టర్లు మంచి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి మార్కెట్ ట్రెండ్స్‌ను విశ్లేషించాలి. ఈ విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఇన్వెస్టర్లకు స్టాక్ డేటాను సమీక్షించడం, నమూనాలను గుర్తించడం, ఆర్థిక అంచనాలను సమర్థంగా చేయడంలో ఉపయోగపడతాయి. కంపెనీ, ఆర్థిక పనితీరు, స్టాక్ హిస్టరీ, మీడియా రిపోర్ట్‌లను గురించిన సమాచారాన్ని కనుగొనడంలో తగిన నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఒక విజయవంతమైన ట్రేడర్ నిరంతరం నేర్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. ఒక స్టాక్ ఇన్వెస్టర్ తన పాత్రను సమర్థంగా నిర్వహించడానికి అకౌంటింగ్ నైపుణ్యాలు అవసరమవుతాయి. ఈ వృత్తిలో కార్యకలాపాలు డేటా ఆధారితంగా ఉన్నందున, స్టాక్ మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి, కంపెనీ ఆదాయ నివేదికలు, మార్కెట్ ట్రెండ్స్ లాంటి ఆర్థిక సమాచారాన్ని విశ్లేషించడానికి ఈ నైపుణ్యం అవసరం.
బిజినెస్ వార్తలను ఫాలో అవ్వడం
ఆర్థిక వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఏ పెట్టుబడిదారుడికైనా చాలా కీలకం. ఎందుకంటే ఇది సకాలంలో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయకారిగా ఉంటుంది. కంపెనీ ఆదాయ నివేదికలు లాంటి సంక్లిష్టమైన సమాచారాన్ని విశ్లేషించే ముందు ఆర్థిక వార్తలకు సంబంధించిన ముఖ్యాంశాలు, కథనాల సారాంశాలను చదవాలి. ద్వారా పెట్టుబడులను చిన్నగా ప్రారంభించవచ్చు. వివిధ పరిశ్రమలలో ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి మీరు ఆన్‌లైన్ పబ్లికేషన్లు, పత్రికలు, మ్యాగజైన్స్, ఫైనాన్షియల్ బ్లాగ్స్‌ను చదవుతూ ఉండాలి.
సర్టిఫికేషన్ ఆన్‌లైన్ కోర్సులు
స్టాక్ ట్రేడర్‌గా మారాలంటే ఫైనాన్షియల్ మార్కెట్లు, సెక్యూరిటీలు, ట్రేడింగ్, ఇన్వెస్టింగ్‌పై పూర్తి అవగాహన అవసరం. మీరు స్టాక్‌మార్కెట్ సబ్జెక్ట్స్‌పై పట్టు సాధించడానికి ఫ్రీ/పెయిడ్ ఆన్‌లైన్ కోర్సుల్లో చేరవచ్చు. కొన్ని ఆన్‌లైన్ కోర్సుల్లో స్టాక్ మార్కెట్, ఇన్వెస్టింగ్ సిమ్యులేషన్ గేమ్స్ రియల్ టైమ్‌లో ట్రేడింగ్ నేర్పిస్తారు. అనేక కాలేజీలు, బిజినెస్ స్కూల్స్, ఆర్థిక సంస్థలు ఆఫ్‌లైన్ కోర్సులను ప్రస్తుతం అందిస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ డిప్లొమాస్‌కు సంబంధించి ఫైనాన్షియల్ మార్కెట్స్, ఈక్విటీ డీలర్ సర్టిఫికేషన్, ఇతర సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి.
సెమినార్లు, వెబినార్లు
ప్రముఖ స్టాక్ అనలిస్టులు నిర్వహించే సెమినార్లు, వెబ్‌నార్స్‌కు హాజరవ్వడం ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి, వారి ముఖ్యమైన విధానాలను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాలను అర్థం చేసుకోవడానికి స్టాక్ ట్రేడర్స్‌కు చెందిన పుస్తకాలను చదవొచ్చు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో స్టాక్ మార్కెట్ అనలిస్ట్స్ అభిప్రాయాలను తెలుసుకోవడం మంచిది. ఇతర ఇన్వెస్టర్లతో కనెక్ట్ అయ్యి వాళ్లతో అభిప్రాయాలను పంచుకోవడం మంచిది. అలాగే, వీటికి సంబంధించిన కాన్ఫరెన్స్‌లకు హాజరవ్వండి. ట్రేడింగ్ ఫోరమ్స్‌లో చేరవచ్చు. ట్రేడింగ్ కమ్యూనిటీల్లో పాల్గొనడం లాంటివి చేస్తే మీకు స్టాక్స్‌పై మంచి అవగాహన వస్తుంది.
ATM బిజినెస్‌తో నెలకు రూ.60వేలు ఆదాయం - ఎలా ఏర్పాటు చేయాలో తెలుసా?
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ టాప్-8 టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!