Infosys Narayana Murthy Advice : ఇన్ఫోసిస్ కంపెనీ సహ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. తాజాగా ఆయన టీచ్ ఫర్ ఇండియా లీడర్స్ వీక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పన్నెండేళ్ల విద్యార్థి 'మీలా కావాలంటే ఏం చేయాలి?' అని ఆయనను ప్రశ్నించాడు. దీంతో నారాయణమూర్తి బదులిస్తూ "నువ్వు నాలా కావాలని నేను కోరుకోవడం లేదు. నా కంటే మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటున్నాను. ఒకరి అడుగుజాడల్లో నడవడమే కాదు. మనకంటూ ఓ కొత్త మార్గాన్ని వేసుకోవాలి. దేశం కోసం ఉన్నతంగా తయారుకావాలి" అని సూచించారు.
జీవిత పాఠాలు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి తన జీవితంలో నేర్చుకున్న పలు విషయాలను, జీవిత పాఠాలను విద్యార్థులకు చెప్పారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు టైమ్ టేబుల్ వేసుకొని పరీక్షలకు చదవడమెలాగో తన తండ్రి నేర్పించారని, దానివల్లే పలు పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు సాధించగలిగేవాడినని ఆయన వివరించారు. విద్యార్థి దశలో క్రమశిక్షణతో ఉంటే, అది ఎప్పటికీ ఒక అలవాటుగా మారుతుందని అన్నారు. నిరంతరం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉండడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సూచించారు.
ఒక రోజులో 22 గంటలు పనిచేశా
తాను ఇంజినీర్ అయిన మొదటి రోజుల్లో పారిస్‌లో జరిగిన ఓ విషయాన్ని నారాయణ మూర్తి గుర్తు చేసుకున్నారు. 'మా బృందం ఓ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్న సమయంలో అనుకోకుండా మొత్తం కంప్యూటర్ సిస్టమ్ మెమొరీ పోయింది. అప్పుడు మా బాస్ కోలిన్‌తో కలిసి, దానిని పునరుద్ధరించడానికి ఏకంగా 22 గంటలు పని చేశాను. ఈ సందర్భంలో మా బాస్ మమ్మల్ని ఎవరినీ ఏమీ అనలేదు. ఒక బాస్‌గా ఆ పరిస్థితికి పూర్తి బాధ్యత తనే తీసుకున్నారు. ఇదే విధంగా ఇప్పుడున్న విద్యార్థులు కూడా నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్లాలి. మన వైఫల్యాలకు పూర్తి బాధ్యత మనమే వహించాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశం ఉంటుంది' అని నారాయణ మూర్తి తెలిపారు.
ఇతరులకు ఇవ్వడంలోనే ఆనందం
ఇతరులకు ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని తన తల్లి నేర్పించిందని ఇన్పోసిస్ నారాయణమూర్తి పేర్కొన్నారు. అవసరంలో ఉన్నవారికి తగిన సమయంలో మనం అందించే సాయం మనలోని మానవతాదృక్పథాన్ని తెలియజేస్తుందని ఆయన అన్నారు. ఇలా ఆయన విద్యార్థులతో పలు విషయాలు చర్చించి, వారి సందేహాలను తీర్చే ప్రయత్నం చేశారు.
వారానికి 70 గంటలు వర్క్ చేశా, అందుకే ఆ సలహా ఇచ్చా : నారాయణమూర్తి
కోపిస్టి కస్టమర్ దెబ్బకు స్టోర్ రూమ్‌లో పడుకున్న 'ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి!