Common Car Service Scams : మీ కారును సర్వీసింగ్‌కు ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇటీవలి కాలంలో కార్ సర్వీసింగ్ స్కామ్స్ బాగా పెరిగిపోతున్నాయి. కనుక ఇలాంటి మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కారు కొంటే సరిపోదు దానిని చక్కగా మెయింటైన్ చేయగలగాలి. అప్పుడే అది చక్కగా పనిచేస్తుంది. మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. అందుకే చాలా మంది కార్ సర్వీస్ రిమైండర్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే మీ కారును సర్వీసింగ్‌కు ఇచ్చే ముందు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏమిటంటే?
- సెకెండ్ ఒపీనియన్ : మీ కారును సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లినప్పుడు, వాళ్లు కారులో మార్చాల్సిన భాగాలు (పార్టులు) గురించి, చేయాల్సిన పనులు గురించి వివరంగా తెలియజేస్తారు. కొన్ని సార్లు అవసరం లేని పనులు చేసి, అధికంగా బిల్లు వేస్తుంటారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే, కచ్చితంగా సెకెండ్ ఒపీనియన్ తీసుకోవాలి. అంటే మరో నిపుణుడి దగ్గరకు వెళ్లి మీ కారును చెక్ చేయించాలి. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలకు తావులేదు.
- ఇంజిన్ ఫ్లష్ : సాధారణంగా సర్వీస్ సెంటర్లకు వెళ్లగానే, 'మీ కారును పూర్తిగా ఫ్లష్ చేయాలి సార్' అని అంటూ ఉంటారు. వాస్తవానికి ప్రతిసారీ ఇలా చేయాల్సిన అవసరం ఉండదు. మీరు రెగ్యులర్‌గా ఆయిల్‌ను మారుస్తూ, కారును చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటే, ప్రత్యేకంగా మళ్లీ ఇంజిన్ ఫ్లష్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని కార్ వర్క్‌షాపుల్లో, చివరికి కొన్ని ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలో కూడా ఈ సర్వీస్ స్కామ్ చేస్తున్నారు. కనుక మీరు ఆ ట్రాప్‌లో పడకండా జాగ్రత్తపడండి.
- ఫ్లూయిడ్ ఫ్లష్ : ఇంజిన్ ఫ్లష్ లాగనే, ఫ్లూయిడ్ ఫ్లష్ స్కామ్స్ కూడా జరుగుతుంటాయి. అంటే అవసరం లేకపోయినా ఫ్లూయిడ్స్ మార్చాలని సర్వీస్ సెంటర్లలో చెబుతుంటారు. చాలా మందికి ఈ విషయం తెలియక అనవసరంగా డబ్బులు చెల్లించి, మోసపోతూ ఉంటారు. కనుక ఈ ఫ్లూయిడ్ ఫ్లష్ స్కామ్స్ విషయంలో కస్టమర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి.
- రీప్లేసింగ్ పార్ట్స్ : కొన్ని సర్వీస్ సెంటర్లలో మీ కారులోని బ్రేక్ ప్యాడ్‌లు, కేబుళ్లు, బెల్ట్‌లు, ఫిల్టర్లు మార్చమని చెబుతుంటారు. నిజానికి సదరు పార్టులు బాగున్నప్పటికీ, మీ నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడం కోసం ఇలా చేస్తుంటాయి. కనుక మంచిగా ఉన్న పార్టులను మార్చవద్దని నిక్కచ్చిగా చెప్పేయండి.
- వీల్ అలైన్మెంట్ : కారు సర్వీసింగ్‌కు ఇచ్చినప్పుడు 'వీల్ అలైన్మెంట్ చేయాలి సార్' అని అంటూ ఉంటారు. వీల్ అలైన్మెంట్ అంటే టైర్ యాంగిల్, పొజిషన్ సరిగ్గా ఉండేలా అమర్చడం. అయితే ఇది ప్రతిసారీ అవసరం ఉండదు. కానీ అదనంగా డబ్బులు వసూలు చేసేందుకు, సర్వీస్ సెంటర్ వాళ్లు ఇలా చెబుతూ ఉంటారు. కొన్ని సర్వీస్ సెంటర్లు అయితే ఇందుకోసం థర్డ్ పార్టీ వారి సహాయం తీసుకుంటాయి. మరికొన్ని అయితే ఎలాంటి వీల్ అలైన్మెంట్ చేయకపోయినా, కస్టమర్లకు బిల్లులు వేస్తుంటాయి. కనుక ఈ విషయంలో కారు ఓనర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.
- అడిటివ్స్ : కొన్ని సర్వీస్ సెంటర్లు - ఇంజిన్ ఆయిల్, ఫ్యూయెల్స్‌లో అడిటివ్స్ కలపాలని చెబుతుంటాయి. వాస్తవానికి ఇంజిన్ ఆయిల్, ఫ్యూయెల్స్‌లో ఎలాంటి అడిటివ్స్ కలపాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆటోమైబల్ కంపెనీలు ఎలాంటి అడిటివ్స్ లేకుండానే కారు ఇంజిన్‌లు చక్కగా పనిచేసేలా వాటిని రూపొందిస్తాయి.
- డిటైలింగ్, పాలిషింగ్ : కారు డిటైలింగ్, పాలిషింగ్ అనేది చాలా ప్రత్యేకమైనది. సర్వీస్ సెంటర్లు ఇందుకోసం భారీగా బిల్లు వేస్తాయి. కనుక ఇలాంటి వాటిని ఒక నిపుణుడి సాయంతో చేసుకోవడమే మంచిది. దీని వల్ల మీకు ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది.
- యాక్సెసరీస్ : కార్ ఉపకరణాల (యాక్సెసరీస్) మార్కెట్ చాలా పెద్దది. అయితే కొన్ని సర్వీస్ సెంటర్లు అవసరం లేని యాక్సెసరీస్‌ను కూడా మీకు అంటగట్టాలని చూస్తుంటాయి. కనుక మీరు వాళ్ల ట్రాప్‌లో పడవద్దు. కేవలం మీకు అవసరమైన యాక్సెసరీస్ మాత్రమే కొనుగోలు చేయండి. మరొక విషయం ఏమిటంటే, సర్వీస్ సెంటర్లో అమ్మే యాక్సెసరీస్ చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. కనుక బయట మార్కెట్లో లభించే ఉపకరణాలు కొనుగోలు చేయడమే బెటర్‌గా ఉంటుంది. మీ కారు వైరింగ్ లేదా ఇన్‌స్టాలేషన్ లాంటివి చేయాలంటే, సర్వీస్ సెంటర్లలో కాకుండా, ప్రైవేట్ ప్రొఫెషనల్ సాయం తీసుకోవడం మంచిది. దీని వల్ల మీపై చాలా వరకు ఆర్థిక భారం తగ్గుతుంది.
- ఓవర్ ఛార్జింగ్ : కారు సర్వీసింగ్ చేయించిన తరువాత సర్వీస్ సెంటర్ వాళ్లు ఇచ్చిన బిల్లును చాలా జాగ్రత్తగా పరిశీలించండి. విడిభాగాల మార్పులు, లేబర్ ఛార్జీల విషయంలో అదనంగా బిల్లు వేస్తే, వాటిని తీసివేయమని అడగండి. అలా వారు ఒప్పుకోకపోతే, నిపుణుల నుంచి సెకెండ్ ఒపీనియన్ తీసుకోండి. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు పడకండి.
కారు సెలక్షన్‌లో ఇబ్బంది పడుతున్నారా? డోంట్ వర్రీ - ఈ టాప్ 10 టిప్స్ మీ కోసమే!
ఆఫ్‌లైన్‌లో కార్/బైక్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి!