Financial Plan For Children Future : చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా అల్లారుముద్దుగా పెంచుతారు. అయితే పెంపకమే కాదు, పిల్లలను ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా చూసుకోవడం తల్లిదండ్రుల కనీస బాధ్యత. ప్రస్తుతం పిల్లల భవిష్యత్తు అనేక ఆర్థికాంశాలతో ముడిపడి ఉంది. అందుకు తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితిని సురక్షితంగా ఉంచుకోవాలి. దీంతోపాటు పిల్లల భవిష్యత్తు కోసం తగిన ఆర్థిక ప్రణాళికలు వేసుకోవాలి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
పిల్లలు పుట్టగానే వారు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటామో, వారి ఆర్థిక భవిష్యత్తు కోసం మొదటి నుంచి ఓ ప్లాన్ ఉండాలి. ఎవరికైనా జీవితం సాఫీగా సాగడానికి ఆర్థిక స్థిరత్వం, ప్రణాళిక చాలా అవసరం. ఆర్థిక ప్రణాళిక అనేది పెద్దలకు, వృద్ధులకు మాత్రమే కాదు, పిల్లలు ఎదిగే వయసులో చిన్న, పెద్ద లక్ష్యాలను సాధించడంలో వారికి సాయపడుతుంది. అందుకే పిల్లలు ఆర్థికంగా సురక్షితంగా ఉండడానికి తల్లిదండ్రులు రక్షణతో కూడిన తగిన మదుపు, బీమా పథకాలను ఎంచుకోవాలి. సరైనా పెట్టుబడి ప్రణాళిక లేనప్పుడు వారి పిల్లల వివిధ ఆర్థిక అవసరాలను తీర్చడం సవాలుగా మారొచ్చు. అందుచేత, ముందుగానే చురుకైన చర్యలు తీసుకోవడం వల్ల పిల్లల సురక్షిత భవిష్యత్తుకు మంచి బాట వేసినట్లవుతుంది.
విద్య
పిల్లలకు బడిలో చేరింది మొదలు, ఉన్నత విద్య వరకు అంతా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఆర్థికంగా ఇదొక సవాలు లాంటిదే. అందుకే పిల్లల విద్యా ప్రణాళికకు సరైన సేవింగ్స్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టాలి. ఈ పథకాలు మార్కెట్ హెచ్చుతగ్గులతో పెద్దగా సంబంధం లేకుండా ఉంటే మంచిది. అలాగే చిన్నారుల విద్యా ఆక్షాంక్షలు నెరవేరేలా చూసేందుకు క్రమశిక్షణతో కూడిన పొదుపు చాలా అవసరం. అందుకోసం కొన్ని సేవింగ్స్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన
ఆడపిల్లలు గల తల్లిదండ్రులకు సుకన్య సమృద్ధి యోజన బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం మంచి వడ్డీ రేటును, పన్ను ప్రయోజనాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా, ఈ పథకం బాలికల ఉన్నత విద్యకు, శ్రేయస్సుకు బాగా ఉపయోగపడుతుంది. అమ్మాయి యుక్త వయసుకు వచ్చేసరికి ఈ పథకం ద్వారా లభించే నగదు వివాహానికి ఆసరాగా పనికొస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన ఖాతాను పోస్టాఫీసు/బ్యాంకులో తెరవొచ్చు. తమ కుమార్తె విద్యా, వివాహం కోసం తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో ప్రతి ఏడాది రూ.1 లక్ష చొప్పున, 15 ఏళ్లు మదుపు చేస్తే, 21 ఏళ్లకు (8.20 శాతం వడ్డీ రేటు ప్రకారం) దాదాపు రూ.46.65 లక్షలు పొందొచ్చు.
మ్యూచువల్ ఫండ్లు
పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విద్యా ద్రవ్యోల్బణం కూడా ఏటా 10-12 శాతం పైనే ఉంది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు అంటే కాస్త రిస్క్ ఉంటుంది. అయితే దీర్ఘకాలం పాటు పెట్టుబడులు చేసేటప్పుడు రిస్క్ కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలానికి సగటున 10-12 శాతం వరకు రాబడి రావొచ్చు. పిల్లలు చిన్న వయసులో ఉండగానే తల్లిదండ్రులు ఇలాంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అధిగమించొచ్చు. ఆర్థిక సలహాదారుడి సిఫార్సు మేరకు మెరుగైన ఫండ్ లో ప్రతి నెలా రూ.10 వేలు సిప్ చేస్తే, 12శాతం రాబడి చొప్పున 15 ఏళ్లకు దాదాపు రూ.50.45 లక్షల వరకు అందుకునే అవకాశం ఉంది. పిల్లల ఉన్నత చదువులకు ఇలాంటి నిధులు బాగా ఉపయోగపడతాయి.
ఆరోగ్య బీమా
ఒక వ్యక్తి, కుటుంబ ఆర్థిక ప్రణాళికలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. కుటుంబం ఏర్పడిన తర్వాత ఆరోగ్య బీమాతో మరింత అవసరం పడుతుంది. అలాంటి వారు ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమాను ఎంచుకోవడం ఉత్తమం. ఒకవేళ ఆరోగ్య బీమా లేకపోతే అప్పటి వరకు సమకూర్చుకున్న అత్యవసర నిధి, పొదుపు పూర్తిగా ఖర్చయిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పిల్లల చదువులు, అనేక ఇతర ఖర్చులకు నిధుల సమస్య ఏర్పడొచ్చు. కాబట్టి, పనిచేసే సంస్థ అందించే బీమా పాలసీయే కాకుండా అదనంగా మరికొంత బీమాను కలిగి ఉండడం మేలు. 31 ఏళ్ల వ్యక్తి తనతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లల కోసం రూ.5 లక్షల ఆరోగ్య బీమా తీసుకుంటే, వార్షిక ప్రీమియం సుమారు రూ.17,500 వరకు అవుతుంది.
జీవిత బీమా
ఎవరి జీవితంలోనైనా ఆర్థిక ప్రణాళికల్లో జీవిత బీమా కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఊహించని పరిస్థితుల్లో కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు కూడా కుటుంబానికి ఆర్థిక భద్రతగా ఇది ఉంటుంది. అందుకే పిల్లల విద్య, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, రోజువారీ జీవన వ్యయాలతో సహా కుటుంబ అవసరాలను తీర్చడానికి తగిన కవరేజీని అందించే సమగ్ర జీవిత బీమా పాలసీని తీసుకోవాలి. కుటుంబ ఆర్థిక రక్షణ కోసం గణనీయమైన మొత్తానికి హామీ, క్లిష్టమైన రైడర్స్ తో సమగ్ర టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ఎంపిక చేసుకోవాలి. 30 ఏళ్ల (స్మోకింగ్ అలవాటు లేని) వ్యక్తి రూ.1 కోటి టర్మ్ ప్లాన్ తీసుకుంటే, ప్రముఖ బీమా సంస్థల్లో వార్షిక ప్రీమియం సగటున రూ.14,000-18,000 వరకు అవుతుంది. కుటుంబ పెద్ద జీవితం రిస్క్ లో పడినప్పుడు పిల్లల విద్యా అవసరాలతో పాటు, మరిన్ని ఆర్థిక అవసరాలకు టర్మ్ బీమా ఉపయోగపడుతుంది.
వీలునామా
చాలా కుటుంబాల్లో పెద్దలు ఎస్టేట్ ప్లానింగ్‌ను తరచూ విస్మరిస్తుంటారు. కానీ, ఊహించని పరిస్థితుల్లో మీ పిల్లల ఆర్థిక ప్రయోజనాలను కాపాడడంలో దీని పాత్ర కీలకం. మీ ఆస్తులు ఎలా పంపిణీ చేస్తారో వివరిస్తుంది. పిల్లల సంరక్షణ/పెంపకం కోసం సంరక్షకులను నియమిస్తుంది. కాబట్టి, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే తమ పిల్లల భవిష్యత్తుకు, శ్రేయస్సుకు భంగం కలగకుండా వీలునామా రాయడం మంచిది. దీనివల్ల విద్యా విషయంలోను, భవిష్యత్తులోను ఆర్థిక భద్రత సంబంధిత అంశాల్లోను పిల్లలకు మేలు చేకూరుతుంది.
ఆర్థిక పాఠాలు ముఖ్యమే!
కుటుంబంలో పెద్దలు ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడి వ్యూహాలతో పాటు పిల్లలకు చిన్న వయసు నుంచే ఆర్థిక అక్షరాస్యత, విలువలను నేర్పించడం చాలా ముఖ్యం. ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, మెరుగైన ఆర్థిక అలవాట్లను పెంపొందించుకోవడానికి వారిని ప్రోత్సహించండి. పొదుపు, బడ్జెట్, బాధ్యతాయుతమైన ఖర్చుల ప్రాముఖ్యాన్ని వారికి నేర్పించండి.