Financial Deadlines In March 2024 : మరికొద్ది రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అందువల్ల మార్చి 31లోపు ఐటీఆర్ ఫైలింగ్, ఫాస్టాగ్ అప్డేట్, ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం చాలా మంచిది. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. ఆదాయ పన్ను రిటర్నులు : 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, సవరించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు 2024 మార్చి 31. కనుక సదరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారులు, సవరించిన ఐటీఆర్‌ను లేదా ఐటీఆర్-యూను మార్చి 31లోపు సమర్పించుకోవచ్చు.
ఆదాయపు పన్ను షరతులు పాటించినట్లయితే, సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసినప్పటి నుంచి రెండేళ్లలోపు అప్డేట్ చేసిన ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ చేసుకునే వెసులుబాటు ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైల్ చేయనివారు ఈ మార్చి 31 లోపు దానిని దాఖలు చేయవచ్చు.
2. ఫాస్టాగ్ అప్డేట్ : ఫాస్టాగ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ అప్డేట్ కోసం 2024 మార్చి 31 వరకు గడువు పొడిగించింది. కనుక ఫాస్టాగ్ వినియోగదారులు ఈ గడువులోగా కేవైసీ (Know Your Customer) పూర్తి చేసుకోవాలి.
3. ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్లు : ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసేందుకు మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఈ తేదీలోగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే, పన్ను ఆదా కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్స్‌లో మదుపు చేస్తున్నవారు, ఈ ఏడాది మార్చి 31లోపు ఈ పథకాల్లో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. లేదంటే సదరు ఖాతాలు స్తంభించిపోతాయి. తరువాత ఆ అకౌంట్లు పునరుద్ధరణ చేసుకోవాలంటే, జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. పైగా పలు ప్రయోజనాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది.
- Public Provident Fund : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో ప్రతి సంవత్సరం కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. ఒకవేళ గడువులోగా కనీస మొత్తం జమ చేయకపోతే ఖాతా స్తంభించిపోతుంది. తిరిగి ఖాతా పునరుద్ధరణ చేయాలంటే, రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా పీపీఎఫ్ అకౌంట్ తెరిచిన మూడో సంవత్సరం నుంచి రుణం తీసుకోవచ్చు. ఆరో సంవత్సరం నుంచి నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. ఒక వేళ అకౌంట్ స్తంభించిపోతే ఈ లోన్, విత్‌డ్రా సదుపాయాలను కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ స్తంభించిన పీపీఎఫ్ ఖాతాను పునరుద్ధరించాలంటే, జరిమానా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.550 చొప్పున చెల్లించాల్సి వస్తుంది.
- Sukanya Samriddhi Yojana : కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకమే సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకంలో ఏటా కనిష్ఠంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. కనీస మొత్తం జమ చేయకపోతే అకౌంట్ స్తంభించిపోతుంది. మళ్లీ రూ.50 జరిమానా చెల్లించి ఖాతాను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అంటే కనీస డిపాజిట్ మొత్తం + జరిమానా రూ.50 కలిపి చెల్లించాల్సి వస్తుంది. ఏదైనా కారణంతో ఖాతాను పునరుద్ధరించకపోతే, ఖాతాలోని మొత్తం డబ్బు మెచ్యూరిటీ తరువాత మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది. ఎస్‌ఎస్‌వై ఖాతా తెరిచిన 21 ఏళ్ల తర్వాత లేదా అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తరువాత ఈ అకౌంట్ మెచ్యూర్ అవుతుంది.
- Amrith Kalash Scheme Deadline : మనదేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తమ కస్టమర్ల కోసం 'అమృత్ కలశ్' పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకంలో చేరడానికి ఆఖరు తేదీ 2024 మార్చి 31. ఎస్బీఐ 2023 ఫిబ్రవరి 15న అమృత్ కలశ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఒక ప్రత్యేకమైన ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. దీని కాలపరిమితి 400 రోజులు మాత్రమే. ఎస్బీఐ ఈ స్కీమ్ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.60 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు ఈ అమృత్ కలశ్ పథకం ద్వారా అధిక లబ్ధి పొందుతారు. 2023 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకాన్ని మార్చి 31 వరకే అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నారు. కానీ వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో రెండు సార్లు ఈ పథకం గడువును పెంచారు. ఈ పథకంలో గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రవాస భారతీయులు కూడా ఈ స్కీమ్‌లో చేరడానికి అర్హులే. ఈ పథకంలో చేరినవారు వడ్డీ చెల్లింపునకు నెల, ఆరు నెలల, లేదా సెమీ యాన్యువల్ కాలవ్యవధులను ఎంచుకోవచ్చు. దీని ఆధారంగా నగదు మీ ఖాతాలో జమ అవుతుంది. అయితే ఇన్కమ్ టాక్స్ చట్టం ప్రకారం, ఈ పథకం కింద వచ్చిన ఆదాయంపై టీడీఎస్ కట్ అవుతుంది. ఈ అమృత్ కలశ్ పథకంలో రుణం సదుపాయంతోపాటు, ముందే డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
- ఎలక్ట్రిక్ వాహనం లోన్‌పై వడ్డీ చెల్లింపులు
ఎలక్ట్రిక్ వాహనాన్ని లోన్‌పై కొన్నవారు కూడా పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. అయితే 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనం కొన్నవారు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 80EEB కింద పన్ను ప్రయోజనం పొందేందుకు అర్హులు. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు లోన్ వడ్డీ చెల్లింపులపై ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. ఈ వడ్డీని పన్ను చెల్లింపుదారుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొన్న వారంతా ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. - ప్రధానమంత్రి వయ వందన యోజన
ప్రధానమంత్రి వయ వందన యోజన(PMVVY) స్కీం ఎన్‌రోల్‌మెంట్ కోసం మార్చి 31 వరకు అవకాశం ఉంది. ఈ స్కీంలో సీనియర్ సిటిజన్లు ఒకసారి పెట్టుబడి పెడితే స్థిరమైన ఆదాయం లభిస్తుంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తులు ఈ పథకానికి అర్హులు. ప్రస్తుతం ఈ స్కీంలో పెట్టే పెట్టుబడులకు 7.4 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తారు. PMVVY స్కీం 10 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్‌ను కలిగి ఉంటుంది.
4. వీటికి మరో రెండు రోజులే ఛాన్స్!
- మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్నవారు కచ్చితంగా మార్చి 31లోపు రీ-కేవైసీ పూర్తి చేయాలి.
- బ్యాంకు ఖాతాలు ఉన్నవారు (ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయకుండా ఉంటే) మార్చి 31లోపు కేవైసీని అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
- సొంతిల్లు కొనాలనుకునే వారికి పలు బ్యాంకులు ప్రత్యేక రాయితీతో మార్చి 31 వరకూ లోన్స్ అందిస్తున్నాయి. కనుక ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిది.