Facebook Instagram Down in India : ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్, మెసేంజర్ సర్వీసులకు మంగళవారం రాత్రి అంతరాయం ఏర్పడింది. మెటా సంస్థకు చెందిన ఈ సర్వీసులు సాంకేతిక సమస్య కారణంగా భారత్ సహా పలు దేశాల్లో స్తంభించాయి. వెంటనే స్పందించిన మెటా యజమాన్యం పరిస్థితిని చక్కదిద్దింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, థ్రెడ్స్, మెసేంజర్ సర్వీసుల్లో అంతరాయం సమస్యను గుర్తించి తెలుసుకుని, వెంటనే పరిష్కరించామని మెటా కమ్యూనికేషన్స్ అధిపతి ఆండీ స్టోన్ తెలిపారు. అసౌకర్యానికి గురైన వినియోగదారులు ఆయన క్షమాపణలు చెప్పారు.
అంతకుముందు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్, మెసేంజర్ సర్వీసులప నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఖాతాలను యాక్సిస్ చేయలేక ఇబ్బందులు పడుతున్నట్లు ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ చెప్పింది. ఈ సాంకేతిక సాధనాలపై ఆధారపడిన కోట్లాది మంది నెటిజన్లు ఎందుకిలా జరిగిందో అర్థంకాక, ఆందోళన చెందారు. నిత్యజీవితంలో భాగమైన ఈ సర్వీసులకు అంతరాయం ఏర్పడటం వల్ల త్వరగా సర్వీసులు పునరుద్ధరించాలంటూ ఇతర సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టారు. తమ ఒక్కరికే ఈ పరిస్థితి వచ్చిందా, అందరికీ ఉందా అని ఆరా తీశారు.
సాంకేతిక లోపం తలెత్తడం వల్ల వినియోగదారులు ఫేస్‌బుక్, ఇన్‌స్టా యాప్‌ల్లో లోడింగ్ సమస్య ఏర్పడింది. పరస్పరం సందేశాలు పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు అనేకమంది ఈ సమస్యపై రిపోర్టు చేసినట్లు డౌన్‌డిటెక్టర్ చెప్పింది. కొందరు ఫేస్‌బుక్ ఖాతాను లాగ్ అవుట్ చేసి తిరిగి లాగిన్ కాలేక ఇబ్బందిపడుతున్నట్లు పేర్కొంది.
Twitter Server Down : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్) సేవలకు ఇటీవలే తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్విట్టర్ సేవలు దాదాపు గంట తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విట్టర్ యూజర్స్‌కు ఈ సమస్య తలెత్తింది. దీంతో కొందరు యూజర్స్ సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ట్విట్టర్ ఖాతాలను తెరవగానే టైమ్లైన్లు ఖాళీగా కనిపించాయని పలువురు యూజర్లు ఫిర్యాదులు చేశారు. ఏదైనా పోస్ట్ చేస్తే ఆ ట్వీట్లు మాత్రం టైమ్‌లైన్‌లో కన్పించలేదని తెలిపారు. అటు ఫాలోయింగ్, ఫర్ యూ, లిస్ట్ పేజీలు కూడా ఖాళీగా దర్శనమిచ్చాయని చెప్పారు.