EPFO New Guidelines : ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్. యూజర్ల వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేయడానికి, లావాదేవీలు నిర్వహించని పీఎఫ్ ఖాతాల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాల్లో ఈపీఎఫ్‌ఓ పలు మార్పులు చేసింది. చందాదారుడు, తండ్రి, తల్లి, భార్య పేర్లలో తప్పులు ఉంటే జాయింట్ డిక్లరేషన్ల ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఇచ్చింది.
కీలక మార్పులివే!
పేరులో రెండు అక్షరాలకు మించి సవరణ చేయాల్సి ఉంటే గతంలో పెద్ద మార్పుగా ఈఫీఎఫ్ఓ పరిగణించేది. ఇప్పుడు ఆ పరిమితిని 3 అక్షరాలకు తగ్గించింది. స్పెల్లింగ్ పరంగా చేయాల్సిన మార్పులకు, పూర్తి పేరు నమోదు చేసుకునేందుకు అక్షరాల పరిమితిని తొలగించింది. చేయాల్సిన మార్పులు మూడక్షరాలకు తక్కువగా ఉన్నా, పెళ్లి తర్వాత భార్య ఇంటి పేరు మార్చాల్సి ఉన్నా వాటిని చిన్న సవరణలుగానే భావిస్తుంది.
ఈ-కేవైసీ బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి!
కొన్నేళ్లుగా లావాదేవీలు లేని పీఎఫ్ ఖాతాల్లో నుంచి నగదు విత్‌డ్రాలో ఇబ్బందులతో పాటు, మోసాల నివారణకు ఈ-కేవైసీ బయోమెట్రిక్ ధ్రువీకరణను ఈపీఎఫ్‌ఓ తప్పనిసరి చేసింది. అలాగే ట్రాన్సాక్షన్స్ లేని పీఎఫ్ అకౌంట్లలో ఎక్కువ వాటికి యూనివర్సల్ అకౌంట్ నంబరు (యూఏఎన్) లేదు. ఈ తరహా కేసుల్లో ఖాతాదారులు సంబంధిత కార్యాలయాలకు వెళ్లి లేదా ఈపీఎఫ్‌ఐజీఎంఎస్ పోర్టల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నవారు పోర్టల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుంటే చాలు, వారి ఇంటి వద్దకే వెళ్లి పీఎఫ్ సిబ్బందికి యూఏఎన్‌ను ఇస్తారు. కేవైసీ పూర్తి చేసి నగదు క్లెయిమ్ చేసుకోవచ్చు.
పీఎఫ్ చందాదారుడి ఖాతాలో నగదు నిల్వ రూ.1లక్ష కన్నా తక్కువగా ఉంటే సంబంధిత అకౌంట్స్ అధికారి(ఏవో), రూ.1లక్ష కన్నా ఎక్కువగా ఉంటే సహాయ పీఎఫ్ కమిషనర్(ఏపీఎఫ్‌సీ) లేదా ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్(ఆర్‌పీఎఫ్‌సీ) వాటిపై నిర్ణయం తీసుకుంటారు. పనిచేసిన కంపెనీ మూతపడిన సందర్భాల్లో యూఏఎన్ లేనివారు పీఎఫ్ కార్యాలయాల్లో దాన్ని తీసుకోవచ్చు. చందాదారుడు చనిపోయినపుడు ఫారం-2లో పేర్కొన్న నామినీ పేరిట ఈ-కేవైసీ చేసి నగదు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశమిచ్చింది. నామినీ పేరును పేర్కొనకుంటే చట్టబద్ధమైన వారసులు ఈపీఎఫ్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు.
EPF అకౌంట్లోని మీ వివరాలు మార్చుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - EPF KYC Correction