EPF Advance Claim Limit Extend: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న చాలా మందికి పీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈ ఖాతాలను నిర్వహిస్తోంది. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు పలు సేవలు ప్రవేశపెడుతూనే ఉంది. తాజాగా తమ చందాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఈపీఎఫ్ సంస్థ. దీని కారణంగా 27 కోట్లకు పైగా వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న సొమ్ము రిటైర్మెంట్ కోసం ఉద్దేశించినదైనా.. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం.. ఇలా పలు సందర్భాల్లో ఈపీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తం నగదును అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. తాజాగా నగదు విత్‌డ్రా పరిమితుల్లో ఈపీఎఫ్‌వో కీలక మార్పులు తెచ్చింది. ఎడ్యుకేషన్, మ్యారేజ్ క్లెయిమ్ సహా హౌసింగ్ క్లెయిమ్స్‌కు కూడా ఆటో సెటిల్‌మెంట్ సదుపాయం తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది.
కొద్ది రోజుల కిందట వైద్య ఖర్చుల అడ్వాన్స్ లిమిట్ పెంచిన సంగతి తెలిసిందే. రూల్ 68J కింద ఇది గతంలో రూ. 50 వేలు ఉండగా.. దీనిని రూ. లక్షకు పెంచింది. తాజాగా.. అదే పరిమితిని విద్య, హౌసింగ్, మ్యారేజ్ వంటి క్లెయిమ్స్‌కు కూడా వర్తిస్తుందని తెలిపింది. అంటే.. ఈ అవసరాల కోసం రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చన్నమాట. ఇది సదరు పీఎఫ్ అకౌంట్ హోల్డర్ లేదా నామినీకి ఎవరికైనా ఉపయోగించుకోవచ్చు.
మీ PF బ్యాలెన్స్ తెలుసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Check PF Balance
మూడు రోజుల్లోనే డబ్బు..
గతంలో.. క్లెయిమ్ డబ్బు అకౌంట్లో జమ కావడానికి చాలా ప్రాసెస్ ఉండేది. ఈపీఎఫ్ సభ్యుడి పూర్తి వివరాలు, క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం సమర్పించిన డాక్యుమెంట్ల పరిశీలన, పీఎఫ్ అకౌంట్ KYC స్టేటస్, బ్యాంక్ అకౌంట్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవడం వంటి వాటి కోసం చాలా సమయం పట్టేది. కొన్నిసార్లు రిజెక్ట్ కూడా అయ్యేవి. అయితే ఇప్పుడు దాని అవసరం లేకుండా దీనిని కూడా ఆటో సెటిల్మెంట్ కిందికి తీసుకు వచ్చారు. మానవ ప్రమేయం లేకుండానే వేగంగా ఈ క్లెయిమ్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఈ మార్పు ద్వారా పీఎఫ్ అడ్వాన్స్ డబ్బులు 3 రోజుల్లోనే అందుకుంటారు. ఈ నిర్ణయం చాలా మంది చందాదారులకు ఊరట అని చెప్పవచ్చు.
PF డబ్బులు తీయాలా? - ఇలా చేయకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది!