Elon Musk Lawsuit : ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ 'ఎక్స్'తో పాటు దాని అధిపతి ఎలాన్ మస్క్‌పై కంపెనీ మాజీ ఉన్నతోద్యోగులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. తమకు ఎలాన్ మస్క్ 128 మిలియన్ డాలర్ల( భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.10,612 కోట్లు) పరిహారం చెల్లించాల్సి ఉందని కోర్టులో దావా వేశారు. తమ బకాయిలను ఎగ్గొట్టడానికి మస్క్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
'ఆ ఒప్పందం ప్రకారమే'
2022లో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ (ప్రస్తుతం 'ఎక్స్')ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ పలువురు ఉన్నతోద్యోగులను తొలగించారు. ఒప్పందం ప్రకారం వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఒక ఏడాది వేతనంతో పాటు తమకిచ్చిన స్టాక్ అవార్డులకు విలువ కట్టి ఇవ్వాల్సి ఉందని దావాలో పేర్కొన్నారు. ఆ లెక్కన మొత్తం 128 మిలియన్ డాలర్లు రావాల్సి ఉందని వెల్లడించారు. కోర్టును ఆశ్రయించిన వారిలో ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, మాజీ సీఎఫ్‌ఓ నెడ్ సెగల్, మాజీ చీఫ్ లీగల్ కౌన్సెల్ విజయ గద్దె, మాజీ జనరల్ కౌన్సెల్ సీన్ ఎడ్జెట్ ఉన్నారు.
'అవన్నీ అసంబద్ధ కారణాలే'
తమకు పరిహారం చెల్లించే ఉద్దేశం మస్క్‌కు లేదని దావాలో పేర్కొన్నారు. అందుకే తమ తొలగింపులకు 'నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తన' వంటి అసంబద్ధ కారణాలు చూపారని ఆరోపించారు. ఆ స్థానాల్లో ఇతర కంపెనీల్లోని ఉద్యోగులను నియమించారని చెప్పారు. ఇలా చేయడం మస్క్ నైజమని విమర్శించారు. ట్విట్టర్ నుంచి ఉద్వాసనకు గురైన చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
'మస్క్ నేతృత్వంలో ట్విట్టర్ అపహస్యం అవుతోంది'
మస్క్ నేతృత్వంలో ట్విట్టర్ అపహాస్యం పాలవుతోందని కాలిఫోర్నియా నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన దావాలో ట్విట్టర్ మాజీ ఉన్నతోద్యోగులు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు, కార్యాలయాలను అద్దెకిచ్చిన యజమానులు, విక్రేతలు సహా కంపెనీ నిర్వహణకు సహకరించే అందరిపై మస్క్ ఆధిపత్యం ప్రదర్శిస్తారని ఆరోపించారు. బిల్లులు కూడా చెల్లించరని తెలిపారు. నియమాలు తనకు వర్తించవని భావిస్తారని చెప్పారు. ఆయనతో విభేదించిన వారిని తన సంపద, పరపతితో అణగదొక్కే ప్రయత్నం చేస్తారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
2022 అక్టోబర్‌లో ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అందుకోసం ఆయన ఒక్కో స్టాక్‌కు 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ డాలర్లు చెల్లించారు. ఆ తర్వాత ఈ సామాజిక మాధ్యమ సంస్థలో అనేక మార్పులు చేశారు. దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. సంస్థ పేరును ట్విట్టర్ నుంచి 'ఎక్స్'గా మార్చారు.
సబ్స్క్రిప్షన్ లేకున్నా ఎక్స్‌లో ఆడియా, వీడియో కాల్స్- ఈ సెట్టింగ్స్ మార్చుకోండి!