E-insurance Is Mandatory From April 1 : బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజేషన్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అంటే ఇకపై అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే (E-insurance) బీమా పాలసీలను అందించాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్యం, సాధారణ బీమా సహా అన్ని ఇన్సూరెన్స్ పాలసీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. నూతన ఆర్థిక సంవత్సరం (2024 ఏప్రిల్ 1) నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి.
ఇ-ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్ (EIA) అనే ఆన్‌లైన్ ఖాతాలో మీరు తీసుకున్న బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో సేవ్ చేస్తారు. ఈ అకౌంట్ సాయంతో పాలసీదారులు బీమా ప్లాన్‌లను ఆన్‌లైన్‌లోనే యాక్సెస్ చేయవచ్చు. అంటే ఇ-ఇన్సూరెన్స్ వల్ల బీమా పాలసీల నిర్వహణ మరింత సౌకర్యంగా మారుతుంది. నేడు దేశంలో ఇన్సూరెన్స్ పాలసీలకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అందుకే బీమా పాలసీల నిర్వహణను మరింత సులభతరం చేయాలని ఐఆర్‌డీఏఐ భావిస్తోంది.
ఫిజికల్ డాక్యుమెంట్స్ కావాలంటే?
ఖాతాదారులు కావాలంటే, ఫిజికల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ కూడా తీసుకోవచ్చు. మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడే, మీకు భౌతిక పత్రాలు కావాలని బీమా కంపెనీని అడగవచ్చు. లేదా తరువాతనైనా అడిగి తీసుకోవచ్చు.
ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా?
మీరు స్వయంగా బీమా రిపోజిటరీల పోర్టల్స్ నుంచి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. ఇన్సూరెన్స్ కంపెనీయే సదరు అకౌంట్ ఓపెనింగ్‌కు అయ్యే రుసుము (సుమారుగా) రూ.35-రూ.40 చెల్లిస్తుంది. ఇందుకోసం ఆధార్, పాన్ కార్డులను సమర్పించి, ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
బీమా డిజిటలైజేషన్ వల్ల ఉపయోగాలు ఏమిటి?
అన్ని బీమా పాలసీలను డిజిటలైజ్ చేయడం వల్ల ఇ-ఇన్సూరెన్స్ ఖాతా (EIA) ద్వారా సులభంగా వాటిని యాక్సెస్ చేయవచ్చు. ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది కనుక, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు పోయినా ఫర్వాలేదు. వాటిని చాలా సులువుగా తిరిగి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫిజికల్ కాపీలతో పోలిస్తే డిజిటల్ పత్రాలు పోయే ప్రమాదం చాలా తక్కువ. మరీ ముఖ్యంగా డిజిటలైజేషన్ వల్ల బీమా పాలసీల వివరాలను, పునరుద్ధరణ తేదీలను మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. పాలసీలో చిరునామా మార్చాలన్నా, వివరాలు అప్‌డేట్ చేయాలన్నా ఇ-ఇన్సూరెన్స్‌తో చాలా సులభంగా వాటిని చేయవచ్చు.
ఒకవేళ పాలసీదారు మరణిస్తే, అతని/ఆమె కుటుంబ సభ్యులు పత్రాల కోసం వెతకాల్సిన పని ఉండదు. నేరుగా ఇన్సూరెన్స్ ఆఫీస్‌కు వచ్చి పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే పాలసీల డిజిటలైజేషన్‌తో ఇన్సూరెన్స్ సంస్థలకు, పాలసీదారులకు మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఫలితంగా క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారుతుంది.
అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏమిటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? - What Is Advance Tax
ఫైనాన్సియల్ డెడ్‌లైన్స్ - మార్చి 31లోగా ఇవి పూర్తి చేయాల్సిందే! - Financial Deadlines In March 2024