Dubai Visa For Indians : దుబాయి ప్రభుత్వం ప్రత్యేకంగా భారతీయ టూరిస్టుల కోసం సరికొత్త వీసా విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దాని పేరే '5 Year Multi Entry Visa'. దీని సాయంతో కేవలం ఒక్కసారి వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, గరిష్ఠంగా 5 ఏళ్ల వరకు మీకు నచ్చినన్ని సార్లు యూఏఈని సందర్శించవచ్చు. మరి ఈ స్పెషల్ వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన ధ్రువపత్రాలు ఏంటి? దీనికి ఎవరు అర్హులు? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వీరు అర్హులు
- దుబాయి టూరిజం డిపార్ట్మెంట్ తీసుకువచ్చిన ఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాకు దరఖాస్తు చేసుకోవాలంటే కచ్చితంగా భారత పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండాలి.
- వీసాకి దరఖాస్తు చేసిన తేదీ నుంచి పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ కనీసం 6 నెలలకు పైగా ఉండాలి.
వీసా దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్
- రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్
- యూఏఈలో చెల్లుబాటు అయ్యే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ.
- గత 6 నెలల కాలంలో 4వేల డాలర్లు లేదా దానికి సమానమైన కనీస బ్యాంక్ బ్యాలెన్స్‌ను కలిగి ఉండాలి. దీనిని స్టేట్మెంట్ రూపంలో సంబంధిత అధికారులకు అందించాలి.
- విమాన టిక్కెట్టు (దుబాయి నుంచి)
- దుబాయ్‌లో మీరు తీసుకునే వసతికి సంబంధించిన వివరాలను అధికారులకు చూపించాలి. అంటే మీరు ఉండబోయే హోటల్ లేదా ఇంటి చిరునామా వివరాలను సమర్పించాలి.
వీసా వివరాలు
- వ్యాలిడిటీ- 5 సంవత్సరాలు
- ఎంట్రీలు- మల్టిపుల్ ఎంట్రీలు
- స్టే వ్యవధి- ఒక్కసారి విజిట్ చేస్తే 90 రోజుల వరకు దుబాయిలో స్టే చేయవచ్చు. దీనిని మరో మూడు నెలలకు కూడా పొడిగించుకోవచ్చు. అంటే మొత్తంగా ఒక్క విజిట్‌కు వెళ్తే గరిష్ఠంగా 180 రోజుల వరకు దుబాయి లేదా యూఏఈలో ఉండవచ్చు.
- ప్రాసెసింగ్ సమయం- దరఖాస్తు చేసుకున్న 2 నుంచి 5 వర్కింగ్ డేస్‌లో మీ చేతికి వీసా వచ్చేస్తుంది.
బెనిఫిట్స్
దుబాయి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త వీసా ప్రాసెస్ వల్ల కలిగే లాభాలు.
- మీరు ప్రతిసారీ వీసా కోసం అప్లై చేయాల్సిన అవసరం లేదు.
- తరచూ దుబాయికి వెళ్లాలనుకునేవారికి ఈ కొత్త వీసా బాగా ఉపయోగపడతుంది.
- ముఖ్యంగా వ్యాపారులకు, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి దుబాయి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ వీసా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
దరఖాస్తుకు ముందు ఈ పనులు చేయండి
వీసా కోసం దరఖాస్తు చేయడానికి ముందు యూఏఈకి చెందిన సంబంధిత అధికారులను సంప్రదించండి. వీసా దరఖాస్తు విషయంలో లేదా కావాల్సిన ధ్రువపత్రాలకు సంబంధించిన విషయాల్లో ఏమైనా మార్పులు, చేర్పులు జరిగాయా? లేదా? అనే అంశాలతో పాటు వాటి విధి విధానాలను అడిగి తెలుసుకోండి. అంతేకాకుండా యూఏఈ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోకి వెళ్తే కూడా మీకు ఈ సమాచారం దొరుకుతుంది. అలాగే విశ్వసనీయ వీసా అప్లికేషన్ సెంటర్ల నుంచి కూడా మీకు కావాల్సిన వివరాలను అడిగి తెలుసుకోవచ్చు.
క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?
తక్కువ బడ్జెట్లో మంచి డీజిల్ కారు కొనాలా? ఈ టాప్-10 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!