Demat Account Opening Mistakes : స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే డీమ్యాట్ ఖాతాను కచ్చితంగా తెరవాలి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు జీవన కాల గరిష్ఠాలను తాకిన నేపథ్యంలో చాలామంది డీమ్యాట్ ఖాతాలను ప్రారంభిస్తున్నారు. ఇందులో 49 శాతం మంది 25 ఏళ్ల లోపు యువకులే ఉంటున్నారని తెలుస్తోంది. అయితే డీమ్యాట్ అకౌంట్‌ను ఓపెన్ చేసేటప్పుడు చేసే పొరపాట్లు ఏంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డీమ్యాట్ ఖాతాలో షేర్లతో పాటు మ్యూచువల్ ఫండ్లలోనూ మదుపు చేసేందుకు వీలుంటుంది. కాబట్టి, క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయాలనుకునే వారూ డీమ్యాట్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. డీమ్యాట్ ఖాతాను సీడీఎస్ఎల్, ఎన్‌ఎస్‌డీఎల్ డిపాజిటరీల్లో ఏదో ఒక చోట ప్రారంభించవచ్చు. మీకు నచ్చిన కంపెనీని ఎంచుకొని, అది ఎందులో భాగంగా ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ విషయాలను అస్సలు మరిచిపోవద్దు
ఇటీవలి కాలంలో చాలా సంస్థలు ఫ్రీగా డీమ్యాట్ ఖాతాలని చెబుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో చెక్ చేయండి. పూర్తిగా ఉచితమా, ఎన్ని లావాదేవీలు చేయాల్సి ఉంటుంది లాంటి వివరాలను తెలుసుకోండి.
- మీ పాన్, ఆధార్, బ్యాంకు ఖాతాలో వివరాలన్నీ ఒకేలా ఉండేలా చూసుకోండి. వాటిల్లో తప్పులుంటే డీమ్యాట్ అకౌంట్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని తెలుసుకోండి. ఆధార్‌తో మొబైల్ నంబరు లింక్ కాకపోతే ఈ-కేవైసీ చేయడం కుదరకపోవచ్చు.
- డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేసేటప్పుడు షరతులను నిశితంగా పరిశీలించండి. మీ డీమ్యాట్ అకౌంట్‌ను థర్డ్ పార్టీ వ్యక్తులు నిర్వహించకుండా కట్టడి చేయండి. పర్మిషన్స్ ఇచ్చే విషయంలో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండండి.
- మీరు డిజిటల్ విధానంలో డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేస్తుంటే సమర్పించే పత్రాలు, మీ ఫొటో స్పష్టంగా ఉండాలి.
- డీమ్యాట్ అకౌంట్‌కు నామినీ పేరును చేర్చే అంశాన్ని చాలామంది పట్టించుకోరు. మీరు కచ్చితంగా నామినీ పేరును నమోదు చేయండి. ఇది మాత్రం మర్చిపోవద్దు.
దేశంలో 15 కోట్లు దాటిన డీమ్యాట్ అకౌంట్లు
ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దేశంలో డీమ్యాట్ ఖాతాలు 15 కోట్లు దాటి సరికొత్త రికార్డును నమోదు చేశాయి. మార్కెట్లలో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండడమే అందుకు కారణం. గత 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 3.70 కోట్ల కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి మంచి రాబడులు వస్తుండటం వల్ల ప్రతి నెలా సగటున 30 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయినట్లు తెలుస్తోంది.
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ - మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాల నామినేషన్ గడువు పెంపు