Housing Prices In Top Cities In India : భారత్‌లోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 7శాతం నుంచి 57శాతం రేంజ్లో పెరిగాయని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ పోర్టల్ ప్రాప్‌టైగర్ నివేదక తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఎక్కువగా 57శాతం పెరుగుదల కనిపించిందని వెల్లడించింది. దేశంలోని ప్రముఖ రియల్ఎస్టేట్ హబ్‌లలో ఒకటైన హైదరాబాద్‌లో తక్కువగా 7శాతం పెరుగుదల నమోదైందని నివేదిక పేర్కొంది.
గత ఏడాది జులై-సెప్టెంబర్ కాలంలో దిల్లీ-ఎన్సీఆర్లో ఒక చదరపు అడుగు ధర రూ.5,105 ఉండగా, ఈ ఏడాది అదే సమయంలో 57శాతం పెరిగి రూ.8,017కు చేరింది. ఇక హైదరాబాద్‌లో గతేడాది రూ.6,580 ఉండగా, ఈ ఏడాది 7శాతం వృద్ధితో రూ.7,050కి చేరింది. హై-ఎండ్ ప్రాపర్టీలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇళ్ల ధరలు పెరుగుతున్నాయని ప్రాప్‌టైగర్ వెల్లడించింది.
ధరల పెరుగుదలకు కారణాలివే!
ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేసే అంశాలను ప్రాప్‌టైగర్ తన నివేదికలో ప్రస్తావించింది. "గత 10 పాలసీ సమావేశాల్లో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు 6.5శాతాన్ని యథాతథంగా ఉంచింది. ఫలితంగా ధరలు తగ్గకుండా అదే స్థాయిలో ఉంటున్నాయి. దీంతో బిల్డర్లు, కొనుగోలుదారులు ఎక్కువ వడ్డీలు చెల్లిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తిపై ఇది ప్రభావం చూపిస్తోంది" అని నివేదికలో పేర్కొంది.
ఆస్తి విలువలో స్థిరమైన పెరుగుదల, భారత్ రెసిడెన్సియల్ రియల్ ఎస్టేట్ రెసిలియెన్స్, వృద్ధి సామర్థ్యాన్ని సూచిస్తోందని BPTP సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరీందర్ ధిల్లాన్ అన్నారు. దిల్లీ-ఎన్సీఆర్, గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి కీలక మార్కెట్లలో ఇళ్ల ధరలు పెరిగాయని, ఈ ప్రాంతాల్లో నాణ్యమైన రెసిడెన్సియల్ ప్రాజెక్టులకు డిమాండ్ ఎక్కువగా ఉందని ధిల్లాన్ చెప్పారు. ఆయా చోట్ల మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ఆధునిక జీవనశైలి సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దానివల్ల గృహ కొనుగోలుదారులకు, బిల్డర్లకు పెట్టుబడి అవకాశాలు వస్తాయని తెలిపారు.
2023-2024 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ధరలు(ఒక చదరపు అడుగుకు) | |||
ప్రాంతం | 2023 | 2024 | పెగురుదల(%) |
దిల్లీ-ఎన్సీఆర్ | రూ.5,105 | రూ.8,017 | 57 |
చెన్నై | రూ.5,885 | రూ.7,179 | 22 |
కోల్‌కతా | రూ.4,797 | రూ.5,844 | 22 |
అహ్మదాబాద్ | రూ.3,900 | రూ.4,736 | 21 |
ముంబయి | రూ.10,406 | రూ.12,590 | 21 |
పుణె | రూ.5,892 | రూ.6,953 | 18 |
బెంగళూరు | రూ.6,550 | రూ.7,512 | 15 |
హైదరాబాద్ | రూ.6,580 | రూ.7,050 | 7 |
సౌత్‌లో తగ్గిన ప్రాపర్టీ లాంఛ్‌లు!
అయితే దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టుల లాంఛ్‌లు, హౌసింగ్ యూనిట్ల విక్రయాలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ కరెక్షన్కు(10శాతం కంటే ఎక్కువగా 20శాతం కంటే తక్కువగా మార్కెట్ పడిపోవడం) నిదర్శనమని బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేడీ అన్నారు. డిమాండ్-సరఫరా సమతుల్యతను కొనసాగించడం, అన్‌సోల్డ్ యూనిట్స్‌ను నివారించడం వంటి- పెరుగుతున్న ధరలను అరికట్టే చర్యల వల్ల ఇలా జరుగుతోందన్నారు.
రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్-5 టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!