Credit Card Price Protection : మీరు క్రెడిట్ కార్డ్ వినియోగదారులా? మీకు ఆన్లైన్ షాపింగ్ అంటే చాలా ఇష్టమా? మంచి ఆఫర్స్, డీల్స్ వస్తే కచ్చితంగా షాపింగ్ చేస్తారా? అయితే ఇది మీ కోసమే. 'క్రెడిట్ కార్డ్ ప్రైస్ ప్రొటక్షన్' ఫీచర్‌తో మీరు అనుకున్న బడ్జెట్లోనే కోరుకున్న వస్తువులు కొనుక్కోవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ప్రైస్ ప్రొటక్షన్ ఫీచర్ అనేది కేవలం కొన్ని క్రెడిట్ కార్డులకే ఉంటుంది. ఇలాంటి కార్డులను ఉపయోగిస్తే చాలు, తక్కువ ధరలోనే మీరు కోరుకున్న వస్తువులు కొనుక్కోవచ్చు. బాగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందంటే?
ఉదాహరణకు మీరు ఒక వస్తువును క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేశారని అనుకుందాం. కానీ తరువాత ఆ వస్తువు ధర చాలా వరకు తగ్గింది. ఇలాంటి సందర్భంలో ప్రైస్ ప్రొటక్షన్ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కొన్న ధరకు, తగ్గిన ధరకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందో, అంత అమౌంట్‌ను సదరు క్రెడిట్ కార్డ్ జారీ చేసిన సంస్థ మీకు వాపసు ఇస్తుంది. దీని వల్ల మీకు చాలా వరకు డబ్బులు ఆదా అవుతాయి.
కండిషన్స్ అప్లై!
క్రెడిట్ కార్డ్ ప్రైస్ ప్రొటక్షన్ ఉన్న కార్డుతో మీరు వస్తువులు కొనుగోలు చేసిన తరువాత, వాటి ధర ఎంత మేరకు తగ్గిందో చూసుకోవాలి. ఆ వివరాలను మీ క్రెడిట్ కార్డ్ ఇష్యూయెర్కు తెలియజేయాలి. వారు దానిని చెక్ చేసి, మీకు రావల్సిన డబ్బులను రీఫండ్ చేస్తారు. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, అన్ని క్రెడిట్ కార్డులకు ఈ ఫీచర్ ఉండదు. పైగా ఈ ప్రొటక్షన్‌కు కొంత కాల వ్యవధి (టైమ్ ఫ్రేమ్), రీఫండ్ అమౌంట్ లిమిట్ ఉంటాయి. పైగా అనేక నియమ, నిబంధనలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ మీరు ముందుగానే తెలుసుకోవడం మంచిది.
ఏయే వస్తువులు కొనచ్చు!
క్రెడిట్ కార్డ్ ప్రైస్ ప్రొటక్షన్ ఫీచర్ ఉపయోగించి, అనేక రకాల వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అవి ఏమిటంటే?
- స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్స్, కెమెరా లాంటి ఎలక్ట్రానిక్స్ అన్నీ కొనుగోలు చేయవచ్చు.
- ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్ లాంటి ఇంటికి కావాల్సిన ఉపకరణాలు కొనచ్చు.
- ష్యాషన్ ఐటెమ్స్ ధరలు చాలా వేగంగా పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. కనుక ఇవి కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా ప్రైస్ ప్రొటక్షన్ వాడుకోవచ్చు.
- అలాగే ఫర్నీచర్, డెకరేషన్ ఐటెమ్స్, యాక్సెసరీస్ లాంటివి కూడా కొనుగోలు చేయవచ్చు.
వీటికి ప్రైస్ ప్రొటక్షన్ ఉండదు!
- త్వరగా పాడైపోయే ఆహార పదార్థాలు, మొక్కలు
- హోటల్స్ రూమ్ బుకింగ్, రిజర్వేషన్లు
- వేలం లేదా బిడ్డింగ్‌ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు
- లిమిటెడ్ టైమ్ ఆఫర్ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఈ ప్రైస్ ప్రొటక్షన్ ఉండదు.
క్లెయిమ్ చేసుకోవడం ఎలా?
- ముందుగా మీరు కొనుగోలు చేసిన వస్తువుకు సంబంధించిన రిసిప్ట్ దగ్గర ఉంచుకోవాలి. అలాగే సదరు వస్తువుపై ఎంత ధర తగ్గిందో ఆ (ప్రైస్ డ్రాప్) వివరాలు సేకరించాలి.
- మీకు క్రెడిట్ కార్డ్ జారీ చేసిన కంపెనీ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి, క్లెయిమ్ ప్రాసెస్ చేయమని అడగాలి.
- కస్టమర్ కేర్ వాళ్లు చెప్పినట్లుగా అవసరమైన అన్ని పత్రాలు మెయిల్ ద్వారా పంపాలి.
- క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్లు మీ క్లెయిమ్‌ను పరిశీలించి అప్రూవ్ చేయవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
- మీ క్లెయిమ్ కనుక సక్సెస్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లో సదరు రీఫండ్ డబ్బులు క్రెడిట్ అవుతాయి.
బిజినెస్ క్రెడిట్ కార్డ్ Vs పర్సనల్ క్రెడిట్ కార్డ్ - ఏది బెస్ట్ ఆప్షన్?