Credit Card Bill Payment : క్రెడిట్ కార్డుల యూజర్లు ఈ మధ్యకాలంలో బాగా పెరిగారు. చేతిలో డబ్బులు లేని ప్రతీ సందర్భంలో చాలామంది క్రెడిట్ కార్డులను ఎడాపెడా వాడేస్తున్నారు. దీనివల్ల వారి సంపాదన పెరగట్లేదు కానీ ఖర్చులు మాత్రం ఆదాయం రేంజ్‌ను మించిపోతున్నాయి. వెరసి క్రెడిట్ కార్డుల బిల్లులు చూసుకొని లబోదిబోమనే పరిస్థితి ఎదురవుతోంది. గడువులోగా ఆ బిల్లులను కట్టలేక వడ్డీభారం పెరిగిపోతుందని ఎంతోమంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డు బిల్లును లోన్‌గా మారిస్తే
క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించలేని పరిస్థితే వస్తే ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని మీరు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే కస్టమర్ కేర్‌లో సంప్రదించి ఆ మొత్తాన్ని పర్సనల్ లోన్‌గా మార్చుకోవచ్చు. మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. అదేమిటంటే, వేరే క్రెడిట్ కార్డుకు ఆ అప్పుని బదిలీ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డుకు సంబంధించిన మొత్తం బకాయిని కూడగట్టి వ్యక్తిగత రుణంగా మారిస్తే చాలావరకు టెన్షన్ తగ్గుతుంది. ఇలా మనకు ఏర్పడిన లోన్‌ను ప్రతినెలా ఈఎంఐ రూపంలో కట్టేయొచ్చు. దీనివల్ల వడ్డీ, ఇతర రుసుముల భారం తగ్గిపోతుంది. ఎందుకంటే క్రెడిట్ కార్డులతో పోలిస్తే పర్సనల్ లోన్లకు తక్కువ వడ్డీ ఉంటుంది. చేతిలో డబ్బులు అందుబాటులోకి వచ్చినప్పుడు పర్సనల్ లోన్‌ను వేగంగా కట్టేయొచ్చు కూడా. క్రెడిట్ కార్డు బిల్లును మనం కట్టకుంటే క్రెడిట్ స్కోరు పడిపోతుంది. క్రెడిట్ వినియోగ నిష్పత్తి సైతం పెరుగుతుంది. దీనికి బదులుగా లోన్‌తో ఒకేసారి బాకీ తీరిస్తే, క్రెడిట్ స్కోరు మెరుగు అవుతుంది. గడువులోగా క్రెడిట్ కార్డు బిల్లును కట్టకపోతే భారీగా రుసుముల భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. లోన్‌ను తిరిగి కట్టేస్తే ఈ బాధ ఉండదు.
పర్సనల్ లోన్ తీసుకొని బిల్లు కడితే
క్రెడిట్ కార్డు బిల్లును కట్టేందుకు మీరు ప్రత్యేకంగా పర్సనల్ లోన్‌ను బ్యాంకు నుంచి తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు బ్యాంకుకు వెళ్లి లోన్ పొందే అర్హత ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. క్రెడిట్ స్కోరు, ఆదాయం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మీకు లోన్ తీసుకునే అర్హత ఉందా లేదా అనేది బ్యాంకు డిసైడ్ చేస్తుంది. కొన్ని బ్యాంకులు 12 నుంచి 84 నెలల వరకు వ్యవధితో లోన్లు ఇస్తుంటాయి. వీటిలో మీకు అనువైన వ్యవధితో మీరు లోన్‌ను పొందొచ్చు. రుణం రాగానే ముందుగా మీరు చేయాల్సిన పని క్రెడిట్ కార్డు బాకీని తీర్చడం. ఒకవేళ ఇలా పొందే అమౌంటును మీరు ఇతర అవసరాలకు ఖర్చు చేస్తే కొత్త అప్పు మీ నెత్తిన పడుతుంది. భవిష్యత్తులో ఏ అప్పు కూడా కట్టలేక మీరు చెమటలు కక్కాల్సిన దుస్థితి ఎదురవుతుంది.