Chanakya Arthashastra for Success In Business : చాణక్యుడి 'అర్థశాస్త్రం' ఎంతటి అమూల్యమైన గ్రంథమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణించడానికి ఇందులోని అమూల్యమైన సమాచారం దిక్సూచిలా దారిని చూపిస్తుంది. మౌర్య సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించిన గురువుగా చాణక్యుడికి ఎంతో ఖ్యాతి ఉంది. ఆర్థికవేత్తగా, రాజకీయ వ్యూహకర్తగా ఆయనకు ఆయనే సాటి. ఇంతటి ఘనత కలిగిన చాణక్యుడు క్రీ.పూ 3వ శతాబ్దంలో అర్థశాస్త్రాన్ని రచించాడు. ఈ పురాతన గ్రంథాన్ని 15 పుస్తకాలుగా విభజించారు. ఈ అర్థశాస్త్రంలో స్టేట్‌క్రాఫ్ట్, గవర్నెన్స్, ఎకనామిక్స్, డిప్లొమసీకి సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలు ఉంటాయి. నేటి ఆధునిక వ్యాపార రంగానికి వర్తించే ఎన్నో సూత్రాలు కూడా అర్థశాస్త్రంలో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వ్యూహాత్మక ఆలోచన - నిర్ణయాలు తీసుకోవడం
చాణక్యుడి అర్థశాస్త్రం నుంచి మనం ప్రధానంగా వ్యూహాత్మక ఆలోచనా విధానం, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. వ్యాపార రంగంలో ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగాలంటే క్రమశిక్షణ, అంకితభావం కలిగి ఉండాలని అర్థశాస్త్రం చెబుతోంది. వ్యాపారంలో ఉండే రిస్క్‌ను ముందస్తుగా మదింపు చేసుకోవడం, దానికి అనుగుణంగా చురుకైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమని చాణక్యుడు బోధించాడు. ఇప్పటి వ్యాపారాలకు కూడా ఈ చిట్కాలు పనికొస్తాయి. వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసే సామర్థ్యం తప్పకుండా వ్యాపారికి ఉండాలి. అతడు ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేలా ముందే వ్యూహరచన చేసుకోవాలి. వ్యూహాత్మక దూరదృష్టి అనేది వ్యాపారికి తప్పనిసరిగా ఉండాలని చాణక్యుడు అంటారు.
నాయకత్వం - నిర్వహణ
వ్యాపారం విజయవంతంగా ముందుకు సాగాలంటే సమర్ధవంతమైన నాయకత్వం కావాలి. తన సంస్థలో మెరుగైన పని వాతావరణాన్ని కల్పించేందుకు వ్యాపారి ప్రయత్నించాలి. ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించాలి. వ్యాపారాన్ని నిర్వహించే వ్యక్తి తన ఉద్యోగులు, వాటాదారుల సంక్షేమానికి తగిన ప్రణాళికను అమలు చేయాలి. ఈ కాలంలో నడుస్తున్న కంపెనీలు కూడా వీటిని అనుసరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారికి కొన్ని నైతిక బాధ్యతలు కూడా ఉంటాయని చాణక్యుడు అంటారు.
ఆర్థిక నిర్వహణ
వ్యాపారం చేసే వ్యక్తికి కొన్నిప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. వనరుల కేటాయింపు, ఉత్పత్తి లక్ష్యం, రాబడి విశ్లేషణ, మార్కెట్ విశ్లేషణ, ఆర్థిక విధానాల రూపకల్పనపై వ్యాపారికి అవగాహన ఉండాలి. ఆర్థిక వివేకంతో వ్యవహరిస్తూ, సమర్థవంతమైన వనరుల నిర్వహణ చేపడితే వ్యాపారికి విజయం దక్కుతుందని, లాభాలు వస్తాయని చాణక్యుడు అంటారు.
దౌత్యం - చర్చలు
దౌత్యానికి, చర్చలకు మధ్య కొంత తేడా ఉంటుంది. ఇవి రెండూ ఒకటేనని మనం భావించకూడదు. దౌత్యం, చర్చల మధ్యనున్న సూక్ష్మభేదాలను చాణక్యుడు అర్థశాస్త్రంలో నిశితంగా వివరించాడు. పొత్తులు పెట్టుకోవడానికి, విభేదాలను పరిష్కరించుకోవడానికి సంబంధించిన సూత్రాలను కూడా అర్ధశాస్త్రంలో ఆయన ప్రస్తావించారు. ఆనాడు చాణక్యుడు వివరించిన చర్చల వ్యూహాలు, సూత్రాలు నేటి వ్యాపారాలకు కూడా వర్తిస్తాయి. వీటిని వినియోగిస్తే కంపెనీల చర్చలు, వ్యాపార విలీనాలు, భాగస్వామ్యాలను ఈజీగా చేసుకోవచ్చు. మానవ మనస్తత్వ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలన్నా తప్పకుండా చాణక్యుడి బోధనలను చదవాల్సిందే.
వ్యూహం మార్చుకోవాలి!
నేటి ప్రపంచం వేగంగా మారుతోంది. మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార వ్యూహాలను మార్చుకోవాలని చాణక్యుడు అర్థశాస్త్రంలో బోధించారు. దీనివల్ల మార్కెట్‌పై పట్టును కొనసాగించవచ్చని తెలిపారు. నేటి వ్యాపార సిద్ధాంతాలు కూడా ఇదే విధమైన భావనతో ముందుకు సాగుతున్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ నియమాలనే అనుసరిస్తుంటాయి.
నైతిక వ్యాపార పద్ధతులు
వ్యాపార వ్యవహారాలలో నైతికతకు కూడా చోటు ఉండాలని చాణక్యుడు అంటారు. వ్యాపార లావాదేవీలు, వ్యాపార నిర్వహణలో చిత్తశుద్ధి, నిజాయితీ, న్యాయబద్ధత ఉండాలని ఆయన బోధించారు. ఇవి అన్ని కాలాలకూ వర్తించే రూల్స్. కార్పొరేట్ నైతికతల గురించి నేటికాలంలోనూ ప్రధాన చర్చ జరుగుతోంది. ఈ సూత్రాలు స్థిరమైన, ప్రసిద్ధ వ్యాపారాలకు పునాదిగా నిలుస్తాయి.
వ్యాపారులకు మంచి సూచనలు
క్రీస్తు పూర్వం చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం వ్యూహాత్మక జ్ఞానానికి శాశ్వతమైన రిజర్వాయర్ లాంటిది. ఆధునిక వ్యాపారపు సంక్లిష్ట, పోటీతత్వ వాతావరణానికి దోహదపడే ఎన్నో టిప్స్ అర్థశాస్త్రంలో ఉన్నాయి. మన దేశంలోని ఎంతో మంది పారిశ్రామిక దిగ్గజాలు కూడా అర్థశాస్త్ర సూత్రాలను ఫాలో అవుతుంటారు. వాటిని తమ కంపెనీ రూల్స్‌లో అమలు చేస్తుంటారు. మన దేశ సైన్యంలోని ఉన్నతాధికారులకు చాణక్యుడు చెప్పిన వ్యూహ రచనా నైపుణ్యాలను బోధిస్తుంటారు. చాణక్యుడి బోధనలు వ్యాపార కళలో వ్యాపారులను ఆరితేరేలా చేయగలవు. వారికి మంచి మార్గదర్శకత్వాన్ని అందించగలవు.