Wedding Business In India : భారతీయ సమాజంలో పెళ్లికి ఉన్నంత ప్రాధాన్యం, ప్రత్యేకత మరే సందర్భానికీ ఉండదు. తమ వారి పెళ్లి కోసం ప్రతి కుటుంబం కొన్నిసార్లు శక్తి మేర ఎక్కువ సార్లు శక్తికి మించి ఖర్చు చేస్తుంటాయి. ఖరీదైన బట్టలు, ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, వాచీలు, అలంకరణ సామగ్రి కొనుగోళ్లు, భోజనాలు, కార్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లలో గదులను అద్దెకు బుక్ చేయడం ఇలా ఎన్నో అవసరాలకు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.
రానున్న పెళ్లిళ్ల సీజన్‌లో 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పెళ్లిళ్ల కోసం చేసే ఖర్చులతో వివిధ రంగాల్లో రూ.6 లక్షల కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒక్క దిల్లీలోనే నాలుగున్నర లక్షల వివాహాలు జరుగుతాయని వెల్లడించింది. రూ.6 లక్షల కోట్ల వ్యాపారంలో దిల్లీ వాటా లక్షన్నర కోట్ల వరకు ఉంటుందని వివరించింది. నవంబరు 12వ తేదీన నుంచి డిసెంబరు 16వ తేదీన మధ్య 18 రోజులు దివ్యమైన ముహుర్తాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ, సీఏఐటీ నేషనల్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖాన్‌దెల్‌వాల్ తెలిపారు.
"దేశవ్యాప్తంగా 48 లక్షల వివాహాలు జరగనున్నాయి. తద్వారా వివిధ రంగాల్లో 6 లక్షల కోట్ల మేర వ్యాపారం జరగనుంది. గతేడాది 35 లక్షల వివాహాలు జరగగా, రూ. 4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. అయితే గతేడాది 11 రోజుల మాత్రమే ముహుర్తాలు ఉన్నాయి. ఈ ఏడాది నవంబరు 12 నుంచి డిసెంబరు 16 మధ్య 18 రోజులు ముహుర్తాలు ఉండటంతో వ్యాపారంలో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాం."
--ప్రవీణ్ ఖాన్‌దెల్‌వాల్, సీఏఐటీ నేషనల్ సెక్రటరీ జనరల్
సన్నద్ధమవుతున్న వ్యాపార సంస్థలు
వివాహాల సమయంలో తలెత్తే ఆకస్మిక డిమాండ్‌కు అనుగుణంగా వస్తువులు, సేవలు అందించేందుకు వ్యాపార సంస్థలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయని సీఏఐటీ తెలిపింది. వివాహాలు జరిగే తీరును వెడ్డింగ్ ఈవెంట్ మేనేజర్లు పూర్తిగా మార్చివేశారని సీఏఐటీ వైస్ ప్రెసిడెంట్ సమీర్ అరోరా తెలిపారు. గతంలో క్యాటరింగ్, బ్యాండ్, ఫొటోలు, వీడియోలు, అతిథులకు మర్యాదులు తదితర విషయాల్లో గందరగోళంగా ఉండేదని చెప్పారు. కాని ఇప్పుడు అన్ని క్రమ పద్ధతిలో జరిగిపోతున్నాయని వెల్లడించారు. వివాహానికి వచ్చే అతిథులు, బంధువులను సాదరంగా ఆహ్వానించడమే పెళ్లి నిర్వాహకులకు ఇప్పడున్న పని అని అన్నారు. అంతకుమించి వారు చేసేందుకు ఏమీ లేదని ప్రతీది ఈవెంట్ నిర్వహకులే దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పారు.
వ్యాపారాల్లో మంచి లాభలు
పెళ్లిళ్ల సీజన్‌లో బట్టల దుకాణాలు, కల్యాణ మండపాలు, హోటళ్లు, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు తమ వ్యాపారాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తామని సీఏఐటీ అంచనా వేసింది. వచ్చే ఏడాది జరిగే వివాహాల కోసం కూడా ఇప్పట్నుంచే సంప్రదింపులు మెుదలుపెడుతున్నారు. వేదికల నుంచి భోజనాల వరకు అన్నింటికీ ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారని ప్రజలు అంటున్నారు. ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి అన్నింటికి కోసం ప్రణాళికలు చేసుకుంటున్నారని అంటున్నారు.