Best Tips For Reverse Parking Car : కారును రయ్ రయ్ మంటూ.. ముందుకు ఎవ్వరైనా ఈజీగా నడిపేస్తారు. కానీ.. రివర్స్ చేయాల్సి వస్తేనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు! వెహికిల్ డ్యామేజ్ అయిపోతుంది. అంతేకాదు.. అక్కడ మనుషులు ఎవరైనా ఉంటే ప్రాణాలకూ ప్రమాదం జరగొచ్చు! అందుకే.. కారు రివర్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కొన్నేళ్లుగా కారు డ్రైవింగ్ చేసేవారు ఈజీగా రివర్స్ చేస్తారు. కానీ.. ఈ మధ్యనే డ్రైవింగ్ నేర్చుకున్న వారు ఇబ్బంది పడతారు. ఇలాంటి వారు కారును రివర్స్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
సైడ్ మిర్రర్ తప్పక చూడాలి :
మీరు ఏదైనా రోడ్డుమీద కారు రివర్స్ చేయాల్సి వస్తే.. వెనుక నుంచి జనాలు ఎవరైనా వస్తున్నారా? ఏవైనా వాహనాలు వస్తున్నాయా? అనే విషయాలను తప్పక గమనించాలి. ఇందుకోసం కచ్చితంగా సైడ్ మిర్రర్ చూసుకోవాలి. సైడ్ మిర్రర్తోపాటు ముందున్న అద్దంలో కూడా చూస్తూ.. జాగ్రత్తగా రివర్స్ చేయాలి. ఎవరూ లేరు, వాహనాలు ఏవీ రావడం లేదని నిర్ధారించుకున్న తర్వాతనే రివర్స్ చేయాలి.
అక్కడ పిల్లలుంటారు :
స్కూల్స్, గ్రౌండ్స్, అపార్ట్‌మెంట్స్, పార్క్‌ల దగ్గర చిన్న పిల్లలు ఎక్కువగా తిరుగుతుంటారు. కాబట్టి.. ఈ ప్లేస్‌లలో కారును రివర్స్ చేస్తున్నప్పుడు, పార్క్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు కారు వెనకాల ఉంటే.. డ్రైవర్‌కు కనిపించరు. అందువల్ల ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని.. పిల్లలు ఎవరూ లేరని చూసుకున్న తర్వాతే కారు రివర్స్ చేయాలని గుర్తుంచుకోండి.
ఇంకా..
- పెద్ద రోడ్డు నుంచి చిన్న రోడ్డుకు రివర్స్ చేస్తున్నప్పుడు రెండు రహదారుల్లో ఏవైనా వాహనాలు వస్తున్నాయా లేదా చూసుకోవాలి. వెహికిల్స్ రానప్పుడే కారు రివర్స్ చేయాలి.
- ఇప్పుడిప్పుడే కారు రివర్స్ చేయడం నేర్చుకుంటున్న వారు ముందుగా ఎక్కువగా స్పేస్ ఉండే చోట రివర్స్ చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాత కొద్ది స్పేస్ ఉన్న చోట రివర్స్ చేయాలి.
- నైట్ టైమ్‌లో రివర్స్ చేస్తున్నప్పుడు.. వెనకాల ఏం ఉన్నాయో సరిగ్గా కనిపించవు. కాబట్టి, ముందు జాగ్రత్తగా ఒకసారి కారు దిగి అంతా చెక్ చేసుకోవాలి. దీనివల్ల ఈజీగా రివర్స్ పార్కింగ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- కారుని రివర్స్ చేస్తున్నప్పుడు ఆక్సిలరేటర్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే.. రివర్స్ గేర్‌లో కారు ఆటోమెటిక్‌గా కొంత స్పీడ్‌తో వెనక్కి వెళ్తుంది.
- ఒకవేళ మీరు కొండపైకి కారును రివర్స్ చేయాలనుకుంటే కొద్దిగా ఆక్సిలరేటర్‌ను ప్రెస్ చేయవచ్చు.
- కారును రివర్స్ చేస్తున్నప్పుడు పగలు, రాత్రి కూడా ఇండికేటర్స్ తప్పక వేయండి.
- అలాగే కారును రివర్స్ చేసేటప్పుడు, పార్క్ చేస్తున్నప్పుడు మీ దృష్టి అంతా స్టీరింగ్ పైనే ఉండాలి. మొబైల్ ఫోన్ వాడడం.. పక్కన ఉన్నవారితో ముచ్చట్లు పెట్టడం వంటివి చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
కారు గేర్లు ఎలా వేస్తున్నారు? - సరిగ్గా వేయకపోతే "బాక్స్ బద్ధలైపోద్ది"!
కారు ఇంజిన్‌లో ఎలుకలు దూరి అంతా పాడు చేస్తున్నాయా? - ఈ టిప్స్‌తో అవి పరార్!
ఆటోమేటిక్ Vs మాన్యువల్ కారు - భారతీయులు ఏది ఎక్కువ కొంటున్నారు? - ఎందుకు?