Best Penny Stocks In 2024 : పెన్నీ స్టాక్ 'లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ' (LME) మదుపరులకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 2021 మార్చిలో రూ.11లుగా ఉన్న ఈ షేర్ వాల్యూ ఇప్పుడు రూ.673.70కు చేరుకుంది. అంటే కేవలం మూడేళ్లలోనే షేర్ వాల్యూ 6000 శాతం పెరిగింది.
విజయ ప్రస్థానం!
2021 మార్చిలో లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ షేర్ వాల్యూ కేవలం రూ.11 మాత్రమే ఉండేది. కానీ మొదటి ఏడాదిలోనే 136 శాతం వృద్ధితో రూ.284.70కు ఎగబాకింది. అయితే 2023 ఏప్రిల్ 25 నాటికి షేర్ వాల్యూ రూ.277.40లతో 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. కానీ తరువాత క్రమంగా పుంజుకున్న ఈ స్టాక్ అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ 2024 ఏప్రిల్ 12 నాటికి రూ.710.50కు పెరిగింది. మదుపరులకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ - బిజినెస్ వివరాలు
ఎల్ఎంఈ కంపెనీ ముంబయిలో 1977లో ప్రారంభమైంది. ఇది స్పాంజ్ ఐరెన్ ఉత్పత్తులను తయారు చేసి, విక్రయిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఈ కంపెనీ స్పాంజ్ ఐరెన్, పవర్, మైనింగ్ అనే మూడు సెగ్మెంట్లను ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇది చార్, ఫ్లై యాష్, ఈఎస్పీ డస్ట్, బెడ్ మెటీరియల్స్, ఐరెన్ ఓర్ ఫైన్స్ లాంటి బై-ప్రొడక్టులను కూడా విక్రయిస్తూ ఉంటుంది.
బోర్డ్ ఆఫ్ లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ గత నెలలో 'క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్' (క్యూఐపీ) ద్వారా రూ.5 వేల కోట్ల వరకు నిధులు సేకరించాలని నిర్ణయించింది. ఈ నిధులను విడతల వారీగా సేకరించే అవకాశం ఉంది.
లాభాలతో దూసుకుపోతోంది!
డిసెంబర్ త్రైమాసికంలో ఎల్ఎంఈ కంపెనీ రూ.331 కోట్ల నికర ఆదాయాన్ని సంపాదించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ.230 మాత్రమే. అంటే ఒక ఏడాదిలోనే కంపెనీ 44 శాతం అధికంగా లాభాలను నమోదు చేసింది. అలాగే కంపెనీ రెవెన్యూ కూడా 2023 డిసెంబర్ నాటికి రూ.1,910 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో కంపెనీ రెవెన్యూ రూ.999 కోట్లు మాత్రమే ఉండేది. అంటే ఒక ఏడాదిలోనే కంపెనీ రెవెన్యూ 99 శాతం పెరిగింది. ఇవన్నీ మదుపరుల సెంటిమెంట్‌కు బలం చేకూర్చాయి. అందుకే ఒకప్పుడు పెన్నీ స్టాక్‌గా ఉన్న షేర్ ఇప్పుడు మల్టీ బ్యాగర్‌గా మారింది.
నోట్ : పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఈ చిన్న కంపెనీల్లో నిధులు చాలా తక్కువగా ఉంటాయి. లాభాలు వస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ నష్టాలు వచ్చినప్పుడు, వాటిని తట్టుకునే శక్తి ఈ చిన్న కంపెనీలకు ఉండదు. అందువల్ల పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుని మాత్రమే సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.