Best Investment Options In India : ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పెట్టుబడులు పెట్టాలని అనుకుంటూ ఉంటారు. తమ కష్టార్జితమైన సొమ్మును నష్టపోకుండా, మంచి రాబడి సంపాదించాలని ఆశిస్తారు. ఇలాంటి వారి కోసం మన దేశంలో అనేక పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. ఇవి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించడానికి వీలు కల్పిస్తాయి. అయితే వీటిలో మీకు అనువైన దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్‌లో మన దేశంలో అందుబాటులో ఉన్న 20 ప్రధానమైన పెట్టుబడి మార్గాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP) : జీవిత బీమాతోపాటు, ఆర్థిక వృద్ధిని కోరుకునే వారికి ఈ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. దీనిలో కనిష్ఠంగా రూ.1000 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. యులిప్స్‌లో చేసిన పెట్టుబడులపై 10% నుంచి 24% వరకు రాబడులు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇందులో కాస్త రిస్క్ కూడా ఉంటుందనే విషయాన్ని పెట్టుబడిదారులు గుర్తించుకోవాలి. యూలిప్స్ వచ్చే రాబడిపై ఇన్‌కం టాక్స్ యాక్ట్ 1961, సెక్షన్ 80సీ, సెక్షన్ 10 కింద పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
- క్యాపిటల్ గ్యారెంటీ ప్లాన్స్ : తక్కువ రిస్క్‌తో, స్థిరమైన రాబడి రావాలని ఆశించేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ క్యాపిటల్ గ్యారెంటీ ప్లాన్స్‌లో కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పెట్టుబడులపై 5% నుంచి 18% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. ఆదాయ పన్ను చట్టం 1961, సెక్షన్ 80సీ, సెక్షన్ 10 కింద ఈ పెట్టుబడులపై పన్ను మినహాయింపు పొందవచ్చు.
- పెన్షన్ ప్లాన్స్ : ఏమాత్రం నష్టభయం లేకుండా, దీర్ఘకాలంలో మంచి ఆదాయం సంపాదించాలని ఆశించేవారు ఈ పెన్షన్ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. పెన్షన్స్ ప్లాన్స్‌లో సాధారణంగా రూ.1000 నుంచి ఎంత పెద్ద మొత్తమైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. చరిత్ర చూసుకుంటే పెన్షన్ ప్లాన్స్‌పై సుమారుగా 12%-22% వరకు రాబడి వస్తోంది. ఐటీ యాక్ట్ 1961, సెక్షన్ 80సీ, సెక్షన్ 10 కింద పెన్షన్ ప్లాన్స్‌పై పన్ను మినహాయింపులు లభిస్తాయి.
- చైల్డ్ ప్లాన్స్ : తమ బిడ్డల భవిష్యత్ కోసం మదుపు చేయాలని ఆశించే తల్లిదండ్రులు చైల్డ్ ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్లాన్స్‌లో రిస్క్ కూడా కాస్త ఉంటుంది. కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంత పెద్ద మొత్తమైనా ఈ చైల్డ్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పెట్టుబడులపై సుమారుగా 14% - 22% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. ఆదాయ పన్ను చట్టం కింద, ఈ బాలల పథకాలపై పన్ను మినహాయింపులు పొందవచ్చు.
- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) : ఉద్యోగ విరమణ చేసినవాళ్లు, 60 ఏళ్లు పైబడిన వారు ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌ల్లో మదుపు చేయవచ్చు. దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. తరువాత మరో 3 ఏళ్ల వరకు ఈ ప్లాన్‌ను పొడిగించుకోవచ్చు. ఈ పథకంలో కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు (కండిషన్స్ అప్లై) మదుపు చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్స్‌పై గరిష్ఠంగా 8.2% వరకు రాబడి వస్తోంది. పైగా ఆదాయ పన్ను చట్టం -1961, సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
- నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) : 18-70 ఏళ్ల వయస్సు ఉన్న భారతీయ పౌరులందరూ ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే మార్కెట్ లింక్డ్ స్కీమ్ కనుక దీనిలో కాస్త రిస్క్ ఉంటుంది. కానీ దీర్ఘకాల పెట్టుబడులపై పెద్దగా రిస్క్ ఉండదు. చరిత్రను పరిశీలిస్తే, దీర్ఘకాలంలో ఈ ఎన్పీఎస్ స్కీమ్స్‌పై 9% - 15% వరకు రాబడి వస్తుంది. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో టైర్-1, టైర్-2 ఆప్షన్లు ఉంటాయి. టైర్ 1 : కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా ఎంతైనా మదుపు చేయవచ్చు. టైర్ 2 : కనిష్ఠంగా రూ.250 మదుపు చేయవచ్చు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడిపెట్టిన వారికి ఐటీ యాక్ట్-1961లోని సెక్షన్ 80 సీసీడీ(1), సెక్షన్ 80 సీసీడీ (2), సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.
- పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్ (POMIS) : భారతీయ పౌరులు అందరూ ఈ పోస్ట్ ఆఫీస్ పథకాల్లో మదుపు చేయవచ్చు. దీనిలో రిస్క్ ఏమీ ఉండదు. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో వ్యక్తిగతంగా రూ.1000 నుంచి రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్‌గా అయితే రూ.1000 నుంచి రూ.15 లక్షల వరకు మదుపు చేయవచ్చు. దీనిపై గరిష్ఠంగా 7.4% వరకు రాబడి వస్తుంది. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఎలాంటి పన్ను మినహాయింపులు లభించవు.
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) : భారతీయ పౌరులు అందరూ ఈ దీర్ఘకాలిక పెట్టుబడి పథకంలో చేరవచ్చు. దీనిలో 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. తరువాత కూడా ప్రతీ 5 ఏళ్లకు ఒకసారి దీనిని పొడిగించుకోవచ్చు. ఈ పీపీఎఫ్ పథకంలో పెట్టిన డబ్బులకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ పథకంలో ఒక సంవత్సరానికి కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పీపీఎఫ్ పెట్టుబడులపై 7.1% వరకు గ్యారెంటీ రాబడి వస్తుంది. ఐటీ యాక్స్-1961లోని సెక్షన్ 80సీ, సెక్షన్ 10 కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.
- ఆర్బీఐ సేవింగ్స్ బాండ్స్ : ఈ పథకంలో కనీసం 6 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. భారతీయ పౌరులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, స్వచ్ఛంద సంస్థలు, యూనివర్సిటీలు ఈ ఆర్బీఐ సేవింగ్స్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పెట్టుబడుల్లో ఎలాంటి రిస్క్ ఉండదు. కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంత పెద్ద మొత్తమైనా దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ బాండ్స్‌పై 8% వరకు రాబడి వస్తుంది. అయితే ఈ పథకం కింద వచ్చిన రాబడిపై ఐటీ చట్టం 1961 ప్రకారం, పన్ను కట్టాల్సి ఉంటుంది. కానీ ఐటీ యాక్ట్-1957 ప్రకారం, దీనికి సంపద పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది.
- బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ : ఎలాంటి రిస్క్ లేకుండా, గ్యారెంటీగా ఆదాయం సంపాదించాలని ఆశించేవారికి ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్ అవుతాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.5 కోట్లు వరకు దీనిలో పొదుపు చేయవచ్చు. దీనిపై గరిష్ఠంగా 4% నుంచి 9% వరకు వడ్డీ లభిస్తుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ రాబడులపై పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
- ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (IPO) : డీమ్యాట్ అకౌంట్ ఉన్నవాళ్లు అందరూ ఐపీఓలో పాల్గొనవచ్చు. కానీ దీనిలో రిస్క్- రివార్డ్ రెండూ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఐపీఓలో సంపాదించిన లాభాలపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (STCG), లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (LTCG) చెల్లించాల్సి ఉంటుంది.
- స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ : షేర్ మార్కెట్ పెట్టుబడులు హెవీ రిస్క్‌తో కూడుకున్నవి. అయితే లాభాలు కూడా అంతే స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో మీకు నచ్చినంత డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్లో వచ్చిన లాభాలపై ప్రభుత్వానికి (ఎస్టీసీజీ, ఎల్టీసీజీ) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
- మ్యూచువల్ ఫండ్స్ : కాస్త రిస్క్ తీసుకుని మంచి రాబడులు సంపాదించాలని ఆశించేవారికి మ్యుచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అవుతాయి. చాలా మంది సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌కు నిర్దిష్ట సమయం వరకు లాకిన్ పీరియడ్ కూడా ఉంటుంది. చరిత్రను పరిశీలిస్తే, మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలంలో 8% నుంచి 20% వరకు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్‌పై సంపాదించిన లాభాలపై ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. అయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌తో ముడిపడిన మ్యూచువల్ ఫండ్లకు ఆదాయపన్ను చట్టం 1961, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.
- బంగారంపై పెట్టుబడులు : భారతదేశంలో చాలా మంది బంగారం కొనేందుకు ఇష్టపడతారు. కష్ట సమయంలో బంగారం మనల్ని ఆదుకుంటుందని నమ్ముతారు. బంగారంపై దీర్ఘకాలంలో 8% - 18% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ద్వారా వచ్చిన లాభాలపై ప్రభుత్వానికి (ఎస్టీసీజీ, ఎల్టీసీజీ) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
- రియల్ ఎస్టేట్ : భారతదేశంలో నేడు స్థిరాస్తి రంగం మంచి భూమ్లో ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కనుక రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. లీగల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. అయితే భూమిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు అని పెద్దలు చెబుతుంటారు. కనుక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాబడులపై గవర్నమెంట్‌కు కచ్చితంగా (ఎస్టీసీజీ, ఎల్టీసీజీ) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
- రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (REITs) : ఈ స్థిరాస్తి రంగ పెట్టుబడులకు రిస్క్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ REITsలో కనిష్ఠంగా రూ.10,000 నుంచి గరిష్ఠంగా ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 10% - 15% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రాబడులపై కచ్చితంగా ప్రభుత్వానికి పన్నులు కట్టాలి.
- క్రిప్టోకరెన్సీ : ప్రపంచంలో ఎవరైనా ఈ క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిలో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. రిటర్న్స్ కూడా అంతే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సరైన అవగాహన లేకుండా ఈ క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. అయితే ఒక సంవత్సరంలో క్రిప్టోకరెన్సీపై సంపాదించిన లాభాలపై 30 శాతం వరకు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- కార్పొరేట్ బాండ్స్ : కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాభివృద్ధి కోసం బాండ్స్ జారీ చేసి, ప్రజల నుంచి డబ్బులు సేకరిస్తూ ఉంటాయి. ఇలా బాండ్స్ తీసుకున్నవారికి ఫిక్స్డ్ ఇంట్రస్ట్ రేట్స్ ఇస్తూ ఉంటాయి. మెచ్యూరిటీ డేట్ వచ్చిన తరువాత అసలు, వడ్డీలను ఇన్వెస్టర్లకు అందిస్తూ ఉంటాయి. అయితే దీనిలో కాస్త రిస్క్ కూడా ఉంటుంది. కనుక మంచి రేటింగ్ ఉన్న కార్పొరేట్ సంస్థల బాండ్లనే ఎంచుకోవాలి.
- గవర్నమెంట్ బాండ్స్ : ప్రభుత్వాలు సావరిన్ బాండ్స్ జారీ చేస్తుంటాయి. ఈ బాండ్స్ పూర్తి సురక్షితమైనవి. ఇన్వెస్టర్లకు దీనిపై ఫిక్స్డ్ ఇన్‌కం వస్తుంది. కనుక ఏమాత్రం నష్టభయం లేకుండా మంచి రాబడి సంపాదించాలని ఆశించేవారు ఈ గవర్నమెంట్ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలి.
- పీర్-టు-పీర్ లెండింగ్ (P2P) : భారతదేశంలో ఆర్బీఐ నియంత్రణలోనే పీర్-టు-పీర్ లెండింగ్ కొనసాగుతుంది. కనుక న్యాయబద్ధంగా, పారదర్శకంగా పీర్-టు-పీర్ లెండింగ్ జరుగుతుంది. కాబట్టి పెట్టుబడిదారుల డబ్బులకు రిస్క్ తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చాలా ఆన్లైన్ పీ2పీ లెండింగ్ ప్లాట్‌ఫాంలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఇతరులకు అప్పులు ఇచ్చి, వడ్డీ రూపంలో ఆదాయం సంపాదించవచ్చు.
ఇన్‌కం ట్యాక్స్ Vs టీడీఎస్ - వీటి మధ్య ఉన్న భేదాలు ఏమిటి?
పర్సనల్ లోన్ తీసుకోవాలా? - ఓవర్ డ్రాఫ్టా? - ఏది మంచిదో తెలుసా?