Bank Locker Rules And Regulations 2024 : ప్రస్తుత కాలంలో చాలా మంది బ్యాంకు లాకర్లు ఉపయోగిస్తున్నారు. ఇంటి వద్ద సరైన రక్షణ లేకపోవడం, దొంగల భయం, ఇతరత్రా కారణాలతో చాలా మంది బ్యాంకు లాకర్లలోనే బంగారు అభరణాలు, విలువైన పత్రాలు భద్రపరుస్తున్నారు. అయితే ఎక్కువ మంది కస్టమర్లకు బ్యాంకు లాకర్ నియామాలపై సరైన అవగాహన ఉండటం లేదు. అసలు బ్యాంకు లాకర్లు ఎలా ఓపెన్ చేయాలి? ఒకవేళ అందులోని విలువైన వస్తువులు పోతే ఎంత పరిహారం చెల్లిస్తారు. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి కాదు!
బ్యాంకు లాకర్ ఓపెన్ చేయాలంటే, సదరు బ్యాంకులో మీకు ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీకు A అనే బ్యాంక్‌లో అకౌంట్ ఉంది అనుకుందాం. B అనే బ్యాంకులో మీ పేరు మీద ఎలాంటి ఖాతా లేదు అని అనుకుందాం. అయినా సరే మీరు B బ్యాంకులో లాకర్ తీసుకోవచ్చు. అయితే మీరు సదరు బ్యాంకులో కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
2. లాకర్ల గురించి మీకు చెప్పాల్సిందే!
కస్టమర్లు లాకర్ల కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో లాకర్లు అందుబాటులో లేవని బ్యాంకులు చెబుతూ ఉంటాయి. కానీ ఇకపై అలా కుదరదు. 2021 సంవత్సరంలో ఆర్బీఐ బ్యాంక్ లాకర్ల నిబంధనల్లో కీలకమైన మార్పులు చేసింది. దీని ప్రకారం, బ్యాంకులు తమ వద్ద ఉన్న లాకర్ల వివరాలను కచ్చితంగా కస్టమర్లకు తెలియజేయాలి. ఒకవేళ లాకర్లు అందుబాటులో లేనట్లయితే, తప్పనిసరిగా వెయిటింగ్ లిస్ట్ నంబర్‌ను కస్టమర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.
3. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది!
కొత్తగా బ్యాంకు లాకర్ ఓపెన్ చేసే కస్టమర్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని బ్యాంకులు కోరవచ్చు. అప్పుడు కనీసం 3 సంవత్సరాల అద్దె మెుత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, కస్టమర్ ఒకవేళ అద్దె చెల్లించకపోయినా, లేదా సదరు లాకర్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసినా, బ్యాంకులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇలాంటి ఏర్పాటు చేసుకుంటాయి.
4. నామినీని ఏర్పాటు చేసుకోవాలి!
చాలా మంది కస్టమర్లు తమ లాకర్లకు నామినీని నియమించకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. మీరు బ్యాంకులో లాకర్ ఓపెన్ చేసిన వెంటనే, తప్పనిసరిగా నామినీని ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల దురదృష్టవశాత్తు కస్టమర్‌కు ఏదైనా జరిగితే, అతని నామినీకి సదరు లాకర్‌ను యాక్సెస్ చేయడానికి అర్హత లభిస్తుంది. బ్యాంకులు సైతం తప్పనిసరిగా బ్యాంకు లాకర్ ఓపెన్ చేసిన వారికి నామినీని నియమించుకునే అవకాశం కల్పించాల్సి ఉంటుంది.
5. పరిహారం రాదు!
అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, బ్యాంకులు లాకర్లలోని వస్తువులకు ఎలాంటి బాధ్యత వహించవు. అందువల్ల ఎలాంటి పరిహారం కూడా అందించవు. దొంగతనం, అగ్నిప్రమాదం, భవనం కూలిపోవడం లాంటివి జరిగితే, బ్యాంకులు కేవలం మీరు చెల్లించిన లాకర్ అద్దెకు 100 రెట్లు వరకు మాత్రమే పరిహారంగా అందిస్తాయి. ఉదాహరణకు మీరు లాకర్ అద్దె కింద నెలకు రూ.5000 చెల్లించారని అనుకుంటే, మీకు 100 రెట్లు వరకు పరిహారం లభిస్తుంది. అంటే మీ చేతికి రూ.5,00,000 అందుతుంది. అంతే గానీ లాకర్లో ఉన్న వస్తువులకు పరిహారం లభించదు. ఈ విషయాన్ని మీరు కచ్చితంగా గుర్తించుకోవాలి.
రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!
క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారా? ఇకపై బిల్లింగ్ డేట్‌ను మీరే ఫిక్స్ చేసుకోవచ్చు!