LPG Cylinder Price Hiked Today : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు వెరీ బ్యాడ్ న్యూస్! వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.48.5 మేర పెంచుతున్నట్లు వెల్లడించాయి. అక్టోబర్ 1 నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. గృహవినియోగం కోసం ఉపయోగించే, వంట గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి.
వరుసగా మూడోసారి
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వరుసగా ఇది మూడోసారి. ఆగస్టు నెలలో రూ.6.5; సెప్టెంబర్‌లో రూ.39 చొప్పున ఈ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. ఇప్పుడు ఏకంగా గ్యాస్ సిలిండర్‌పై రూ.48.5 పెంచడం గమనార్హం. దీనితో ముంబయిలో 19కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,692.50కు, కోల్‌కతాలో రూ.1,850.50కు, చెన్నైలో రూ.1,903కు పెరిగింది.
వంట గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథం
ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం దిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803గా ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం రూ.603కే ఇది లభిస్తుంది. ముంబయిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50; చెన్నైలో రూ.818.50; హైదరాబాద్‌లో రూ.855; విశాఖపట్నంలో రూ.812గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు!
ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72; లీటర్ డీజిల్ ధర రూ.87.62గా ఉంది.
జెట్ ఫ్యూయెల్ ధర 6 శాతం కట్
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్ ధరలను 6.3 శాతం మేర తగ్గించాయి. దీని వల్ల ఏటీఎఫ్ ధరలు ఈ ఏడాది కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
తాజా ధరల తగ్గింపుతో, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర కిలోలీటర్‌కు రూ.5,883 (6.29%) మేర తగ్గింది. దీనితో దిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.87,597.22 నుంచి రూ.81,866.13కు దిగివచ్చింది. అయితే ఈ ధరలు వివిధ రాష్ట్రాల్లోని స్థానిక పన్నుల ఆధారంగా మారుతూ ఉంటాయి.
సెప్టెంబర్ 1న ఏటీఎఫ్ ధరలను కిలోలీటర్‌కు రూ.4,495.5 (4.58శాతం) తగ్గించిన విషయం తెలిసిందే. వాస్తవానికి విమానాల నిర్వహణ వ్యయంలో ఇంధనం ఖర్చులే 40 శాతం వరకు ఉంటాయి. వీటి ధరలను వరుసగా రెండు సార్లు తగ్గించిన నేపథ్యంలో విమానయాన సంస్థలపై ఉన్న ఆర్థిక భారం కొంత మేర తగ్గనుంది.