Ambani Adani Collaboration : దేశంలో అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ- గౌతమ్ అదానీ విద్యుత్ రంగంలో ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. 500 మెగావాట్ల కోసం అదానీ పవర్ లిమిటెడ్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ 20 సంవత్సరాల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. తద్వారా అదానీ పవర్ ప్రాజెక్ట్‌లో 26 శాతం వాటాను కైవసం చేసుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్.
అదానీ పవర్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్‌లో 5 కోట్ల ఈక్విటీ షేర్ల్ కోసం కోసం రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది. క్యాప్టివ్ యూజర్స్ పాలసీ ప్రకారం ఈ ఒప్పందం జరిగింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో రెండు సంస్థలు ఈ విషయాన్ని గురువారం తెలిపాయి
"అదానీ పవర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్ (MEL), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)తో క్యాప్టివ్ యూజర్ పాలసీ కింద 500 మెగా వాట్ల కోసం 20 సంవత్సరాల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విధానమంతా ఎలక్ట్రిసిటీ రూల్ 2005 కింద జరిగింది" అని అదానీ పవర్ లిమిటెడ్ స్టాక్ ఫైలింగ్‌లో పేర్కొంది.
"విద్యుత్ ఉత్పత్తి, సరఫరా రంగంలో MEL నిమగ్నమై ఉంది. ఆ సంస్థ టర్నోవర్ 2022-23కు రూ. 2,730 కోట్లు, 2021-22కు రూ.1,393.59కోట్లు, 2020-21కు రూ. 692.03 కోట్లుగా ఉంది. MELతో షరతులతో కూడిన పెట్టుబడి ఒప్పందం కుదిరింది. రెండు వారాల్లోపు పూర్తి ప్రక్రియ పూర్తవుతుంది" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులర్ ఫైలింగ్‌లో తెలిపింది.
MEL మొత్తం కార్యాచరణ సామర్థ్యం 2,800 MWగా ఉంది. ఇందులో 600 మెగావాట్ల యూనిట్‌ను క్యాప్టివ్ యూనిట్‌గా మార్చాలని ప్రతిపాదించారు. అదానీ పవర్ ప్రకారం క్యాప్టివ్ పాలసీ ప్రయోజనాలను పొందేందుకు, పవర్ ప్లాంట్ మొత్తం సామర్థ్యానికి అనుగుణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యాప్టివ్ యూనిట్‌లో 26 శాతం యాజమాన్య వాటాను కలిగి ఉండాలి. అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టనుంది రిలయన్స్.
గుజరాత్‌కు చెందిన గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ వ్యాపార రంగంలో కొన్నేళ్లుగా పోటీ పడుతున్నారు. దేశంలో పలు వ్యాపారాలను జోరుగా విస్తరిస్తున్నారు. బిలియన్ల పెట్టుబడులు పెడుతూ ఆస్తులను పెంచుకుంటున్నారు. జామ్‌నగర్‌లో నాలుగు గిగా ఫ్యాక్టరీలను అదానీ నిర్మిస్తుండగా, రిలయన్స్ సంస్థ మూడు గిగా ఫ్యాక్టరీలను నిర్మిస్తోంది. ఇటీవల జరిగిన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కూడా అదానీ హాజరయ్యారు. కొద్ది రోజులకే అంబానీ, అదానీకి చెందిన వ్యాపార సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
అదానీ బౌన్స్ బ్యాక్- భారత్‌లో అత్యంత ధనవంతుడిగా అవతరణ
జంతువులపై అంబానీల ప్రేమ- 3 వేల ఎకరాల్లో 'వన్‌తారా' అడవి సృష్టించిన రిలయన్స్ ఫౌండేషన్