Amazon Founder Jeff Bezos : లక్షలు కాదు, కోట్లు కాదు. ఏకంగా రూ.1.25 లక్షల కోట్లు ఒకే ఒక్కరోజులో స్టాక్ మార్కెట్‌లో ఆవిరయ్యాయి. ఈ డబ్బంతా ఒకే వ్యక్తిది. ఆయనే అపర కుబేరుడు, విఖ్యాత ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) అధినేత జెఫ్ బెజోస్. ఇంతకీ అకస్మాత్తుగా ఎందుకిలా జరిగింది?
నష్టాలు మూటకట్టుకోవడం మూడోసారి
అమెరికా స్టాక్ మార్కెట్‌లో అమెజాన్ షేర్లకు భారీ క్రేజ్ ఉంటుంది. అలాంటి విలువైన షేర్లు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 8.8 శాతం మేర నష్టపోయాయి. దీంతో జెఫ్ బెజోస్ నికర సంపద ఒక్కసారిగా రూ.1.27 లక్షల కోట్లు (15.2 బిలియన్ డాలర్లు) తగ్గి రూ.16 లక్షల కోట్లకు (191.5 బిలియన్ డాలర్లు) పడిపోయింది. ఈ వివరాలను బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అమెజాన్ అధిపతి బెజోస్ ఒక్క రోజులోనే ఇంతభారీ నష్టాన్ని మూటకట్టుకోవడం ఇది మూడోసారి అని తెలిపింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక మాంద్యం భయాల వల్లే స్టాక్ మార్కెట్ ఇంతగా షేక్ అయ్యిందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు, పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు కమ్మేయడం వంటి పరిణామాలు కూడా స్టాక్ మార్కెట్‌ను కుదేలు చేశాయని విశ్లేషించింది. అంతకుముందు 2019 ఏప్రిల్ 4న భార్యతో విడాకుల ప్రకటన చేశాక బెజోస్ సంపద 36 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది. 2022 ఏప్రిల్‌లోనూ అమెజాన్ షేర్లు 14శాతం మేర డౌన్ అయ్యాయి. దీంతో అప్పట్లోనూ బెజోస్ నికర సంపద గణనీయంగా తగ్గిపోయింది.
మస్క్, జుకర్‌బర్గ్, బ్రిన్, పేజ్‌లకు సైతం
శుక్రవారం ఒక్కరోజే అమెరికా స్టాక్ మార్కెట్‌లో మరో కీలక పరిణామం కూడా జరిగింది. ఆ రోజున ప్రపంచంలోనే 500 మంది అత్యంత సంపన్నుల మొత్తం నికర సంపదలో ఏకంగా రూ.11. 22 లక్షల కోట్లు (134 బిలియన్ డాలర్లు) ఆవిరయ్యాయి. ఈ ప్రభావంతో ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ రూ.55 వేల కోట్లు, ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిస్ రూ.36వేల కోట్లు, మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్, ల్యారీ పేజ్ చెరో రూ.25వేల కోట్లు చొప్పున సంపదను కోల్పోయారు.
కాగా, ప్రస్తుతం ప్రపంచంలో నంబర్ 1 ధనవంతుడిగా ట్విట్టర్ యజామని ఎలాన్ మస్క్ ఉన్నారు. ఆయన నికర సంపద విలువ రూ.19.69 లక్షల కోట్లు. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్(రూ.16 లక్షల కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు. రూ.15.25 లక్షల కోట్ల సంపదతో మూడో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్, నాలుగో స్థానంలో మార్క్ జుకర్‌బర్గ్, ఐదో స్థానంలో బిల్ గేట్స్ ఉన్నారు.
ఇంటెల్ ఉద్యోగులకు షాక్ - 18,000 జాబ్స్ కట్ - కారణం ఏమిటంటే? - Intel To Lay Off 18000 Employees