Advantages Of Having House Insurance : సొంతింటి కల అందరికీ ఉంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బుతో సొంతిల్లు కట్టుకున్న తర్వాత దాని భద్రతపై చాలా మంది పెద్దగా శ్రద్ధ పెట్టరు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే పరిస్థితేంటి అనేది ఆలోచించరు. ఈ అజాగ్రత్త భారీ నష్టాన్ని తెచ్చిపెట్టే ముప్పు ఉంటుంది. అందుకే ఇంటిని కట్టడంపై మనం ఎంత శ్రద్ధపెట్టామో, దాని భద్రతపైనా అంతే శ్రద్ధ పెట్టాలి. ఈక్రమంలో హోం ఇన్సూరెన్సు పాలసీ చేయించుకుంటే చాలా సేఫ్. ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగి మనం నష్టపోయినప్పుడు పరిహారాన్ని పొందేందుకు ఈ పాలసీ దోహదం చేస్తుంది. మనం వెంటనే నష్టం నుంచి కోలుకునేందుకు దన్నుగా నిలుస్తుంది.
అద్దెకు ఉన్నవాళ్లు పాలసీ తీసుకోవచ్చా?
హోం ఇన్సూరెన్స్ పాలసీని ఇంటి ఓనర్లే తీసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. వాస్తవానికి అద్దె ఇళ్లలో ఉండేవాళ్లు కూడా ఈ పాలసీని చేయించుకోవచ్చు. తద్వారా ఆ ఇంట్లో తాము ఉంచుకుంటున్న విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదుకు భరోసా లభిస్తుంది. అగ్నిప్రమాదం, దొంగతనం వంటివి జరిగినప్పుడు హోం ఇన్సూరెన్స్ పాలసీదారుడికి పరిహారం వస్తుంది. ఏదైనా ప్రమాదం వల్ల ఆస్తి ధ్వంసమైనప్పుడు లేదా అద్దెకు ఉన్న వారు దాన్ని ఖాళీ చేసినప్పుడు ఇంటి ఓనర్లకు ఆదాయ నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి నష్టాలను కూడా గృహ బీమా పాలసీలు పూడుస్తుంటాయి. ఒక రోజు వ్యవధి నుంచి మొదలుొని ఐదేళ్ల కాలం దాకా మనం హోం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు. అందుకే ఇంటి యజమానులు ఈ పాలసీని తీసుకోవడం చాలా సేఫ్.
ఏమేం కవర్ అవుతాయి?
- హోం ఇన్సూరెన్స్ పాలసీలో ఇంట్లోని ఫర్నీచర్, దుస్తులు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు అన్నీ కవర్ అవుతాయి.
- ఆభరణాలు కూడా హోం ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలోకి వస్తాయి. ఇంట్లో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ తిరుగుతున్నా మీ ఆభరణాలకు హోం ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
- ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు హోం ఇన్సూరెన్స్ పాలసీ నుంచి పరిహారం అందుతుంది. కొన్నాళ్లపాటు మరో ఇంట్లో ఉండేటప్పుడు అవసరమైన ఖర్చులనూ చెల్లించేలా యాడ్-ఆన్ పాలసీలు కూడా ఉంటాయి.
- హోం ఇన్సూరెన్స్ చేయించుకున్న ఇంట్లో దొంగతనం జరిగితే, దొంగలు ఎత్తుకెళ్లిన వస్తువుల విలువకు సమానమైన మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తారు.
- ఇంటికి మరమ్మతులు చేస్తున్న టైంలో, గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల, అగ్ని ప్రమాదం వల్ల పక్క ఇంటి వారికి నష్టం కలిగితే కూడా బీమా కవరేజీ పొందొచ్చు. ఇలాంటి సందర్భాల్లో హోం ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చిన కంపెనీ - థర్డ్ పార్టీకి (పక్క ఇంటివారికి) కూడా పరిహారం అందిస్తుంది. దీనికోసం మనం హోం ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటప్పుడు పబ్లిక్ లయబిలిటీ కవరేజీ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
పన్ను ఎగ్గొట్టాలని చూస్తున్నారా? జర జాగ్రత్త! ఐటీ శాఖ ఈజీగా పసిగట్టేస్తుందిలా? - ITR Filing 2024
సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్త కావాలనుకుంటున్నారా? ఈ టాప్-6 టిప్స్ మీ కోసమే! - Business Launch Tips