Adani Hindenburg Issue : అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిప్యులేషన్ ఆరోపణలపై సిట్ లేదా సీబీఐ విచారణ అవసరం లేదని ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని పొరపాట్లు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఆరోపణలపై కొత్త ఆధారాలు లభించాయని, తీర్పును సమీక్షించేందుకు తగిన కారణాలు ఉన్నాయని పిటిషనర్ అనామికా జైస్వాల్ తెలిపారు.
స్టాక్ మానిప్యులేషన్
ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్ నేతృత్వంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్, విదేశీ సంస్థల ద్వారా తమ సొంత సంస్థల స్టాక్‌లలో వేలాది కోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టి, స్టాక్ ప్రైస్‌ను కృత్రిమంగా పెంచిందని, ఈ విధంగా స్టాక్స్ ప్రైస్ మానిప్యులేషన్‌కు పాల్పడిందని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది.
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కూడా అదానీ గ్రూప్‌పై ఇలాంటి ఆరోపణలే చేసింది. అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్లకు పాల్పడిందని ఆరోపించింది. అంతేకాదు సొంత స్టాక్ల్లోనే తమకు చెందిన విదేశీ సంస్థల ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి, కృత్రిమంగా షేర్ల విలువను పెంచిందని పేర్కొంది.
సెబీ దర్యాప్తు
ఈ ఆరోపణల నేపథ్యంలో సెబీ అదానీ గ్రూప్ సంస్థలపై దర్యాప్తు చేపట్టింది. దీనిపై అదానీ గ్రూప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెబీ చేస్తున్న దర్యాప్తును సిట్‌కు గానీ, సీబీఐకు గానీ బదిలీ చేయాలని కోరింది. కానీ సెబీ దర్యాప్తులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దర్యాప్తును సెబీ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్)కి కేసు బదిలీ చేయాలన్న వాదనకు అర్థం లేదని తెలిపింది. అదానీ గ్రూప్‌పై మొత్తం 24 ఆరోపణలు రాగా అందులో 22 కేసుల్లో సెబీ దర్యాప్తు పూర్తైందని గుర్తు చేసిన ధర్మాసనం- సెబీ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో తలదూర్చే అధికారం సుప్రీంకోర్టుకు పరిమితంగానే ఉంటుందని వ్యాఖ్యానించింది. కోర్టు నియమించిన ప్యానెల్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం, సెబీ నడుచుకోవాలని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.
పేటీఎం షేర్లు 9 శాతానికిపైగా పతనం- కంపెనీ గట్టెక్కేనా? యూజర్ల సంగతేంటి?
స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించాలా? వారెన్ బఫెట్ చెప్పిన ఈ 5 టిప్స్ పాటించండి!