Yusuf Pathan Bengal Politics : బంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బహరాంపుర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీపై మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తాను బహరాంపుర్‌ను వదిలి వెళ్లబోనని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలతో మమేకం కావడానికే అక్కడి నుంచి బరిలోకి దిగినట్లు ఆయన చెప్పారు. చాలా ఏళ్లుగా బహరాంపుర్ నుంచి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరీ ఎంపీగా గెలుస్తూ వస్తున్నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని యూసుఫ్ పఠాన్ ఆరోపించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు.
'అధీర్ సమాధానం చెప్పాలి'
''బహరాంపుర్ ప్రజలు ఇప్పటికే నన్ను కుమారుడిగా, సోదరుడిగా, స్నేహితుడిగా ఆదరిస్తున్నారు. ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఎంపీగా గెలుస్తాననే నమ్మకం నాకు ఉంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అధీర్ రంజన్ కేంద్రంతో మాట్లాడి నియోజకవర్గానికి నిధులను సాధించడంలో విఫలమయ్యారు. దీనిపై నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. బహరాంపుర్ ప్రజలు తనను గెలిపిస్తే స్థానిక సమస్యలను పరిష్కరిస్తాను" అని హామీ ఇచ్చారు యూసుఫ్ పఠాన్.
'ఇక్కడి నుంచి వెళ్లనివ్వం'
''ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్రైడర్స్ తరఫున మ్యాచ్‌లు ఆడినప్పటి నుంచి మమతా బెనర్జీ నాకు సుపరిచితం. రాష్ట్రంలో మమత చేసిన అభివృద్ధిని నేను కళ్లారా చూశాను. అందుకే టీఎంసీలో చేరాను'' అని యూసుఫ్ పఠాన్ తెలిపారు. బహరాంపుర్‌లో గడుపుతున్న ప్రతి గంట తనలో విశ్వాసాన్ని పెంచుతోందన్నారు. అక్కడి ప్రజలు తనతో మెలుగుతున్న తీరును బట్టి గెలవడం ఖాయమని అనిపిస్తోందని ఆయన చెప్పారు. తాము ఇక్కడి నుంచి తనను వెళ్లనివ్వమని నియోజకవర్గ ప్రజలు తనతో చెబుతున్నారని పేర్కొన్నారు.
'వలసలను ఆపుతా-ఉద్యోగాలు సృష్టిస్తా'
''నేను ఈ ఎన్నికల్లో గెలిస్తే బహరాంపుర్ యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లకుండా చేస్తా. ప్రపంచ స్థాయి క్రీడా సముదాయాన్ని స్థానికంగా నిర్మిస్తా. పట్టు, థర్మోకోల్, జనపనార పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తా. రైతుల పంటలకు మద్దతు ధర దొరికేలా చేస్తా'' అని యూసుఫ్ పఠాన్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.
'ఇర్ఫాన్, అఫ్రీన్‌తో మాట్లాడాకే పొలిటికల్ ఎంట్రీ'
''నా క్రికెట్ కెరీర్ ముగిసింది. ఇక నేను ఏదో ఒకటి చేయాలి కదా. అదేదో ప్రజలకు సేవ చేస్తే బాగుంటుందని భావించా. అందుకే మమతా బెనర్జీ ఆహ్వానం మేరకు టీఎంసీలో చేరాను. బహరాంపుర్ ప్రజలకు సేవ చేయమని ఆమె చెప్పారు. అందుకే పోటీ చేస్తున్నా. నా సోదరుడు ఇర్ఫాన్, భార్య అఫ్రీన్‌తో సంప్రదించాకే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదల కోసం ఖర్చు చేయడానికి వెనుకాడను'' అని యూసుఫ్ పఠాన్ తెలిపారు.