సొంతిల్లు, కారు లేని మైసూరు మహారాజు- ఎన్నికల అఫిడవిట్‌లో షాకింగ్ వివరాలు! - yaduveer wadiyar nomination - YADUVEER WADIYAR NOMINATION
Yaduveer Wadiyar Assets And Liabilities : కర్ణాటక మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎన్నికల బరిలో ఉన్న యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో తనకు సొంత ఇల్లు, కారు కూడా లేదని పేర్కొన్నారు.
Published : Apr 2, 2024, 7:03 AM IST
Yaduveer Wadiyar Assets And Liabilities : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలు రాష్ట్రాల్లో రాజ కుటుంబీకులను ఎన్నికల బరిలోకి దింపింది బీజేపీ. ఈ జాబితాలో పూర్వపు మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ తొలిసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటక మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఈయనకు టికెట్ ఇచ్చింది. అయితే ప్రక్రియలో భాగంగా ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తనకు రూ.4.99 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ ఆయనకు సొంత ఇల్లు, భూమి, కనీసం కారు కూడా లేదని అధికారులకు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం.
మహారాజు ఆస్తులు-అప్పులు!
Yaduveer Wadiyar Affidavit : అంతేకాకుండా తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలనూ అఫిడవిట్‌లో పేర్కొన్నారు యదువీర్ కృష్ణదత్. మొత్తంగా రూ.4.99కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వెల్లడించిన ఈ మైసూరు మహారాజు, తన భార్య త్రిషిక కుమారీ వడియార్‌కు రూ.1.04కోట్లు, వారి సంతానం పేరిట రూ.3.64కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు. అయితే వీరి ముగ్గురిపై ఎటువంటి స్థిరాస్తులు లేవని పేర్కొన్నారు. బంగారు, వెండి నగల రూపంలో మొత్తం ఆస్తుల్లో రూ.3.39 కోట్ల విలువైన ఆభరణాలు తన పేరుపై ఉన్నట్లు యదువీర్ పేర్కొన్నారు. భార్యకు రూ.1.02కోట్ల విలువైన ఆభరణాలు, తన సంతానానికి రూ.24.50లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు.
వాస్తవానికి ఈనెల 3న నామినేషన్ దాఖలు చేయాలని భావించారు మహారాజు యదువీర్ కృష్ణదత్. అయితే సోమవారం మంచిరోజు కావడం వల్ల ఆయన రెండు రోజుల ముందే నామినేషన్ వేసినట్లు సమాచారం. తన తల్లి ప్రమోద దేవీ వడియార్, బీజేపీ స్థానిక ఎమ్మెల్యే శ్రీవత్సతో కలిసి మైసూరులోని ఎన్నికల కార్యాలయానికి వెళ్లి రెండు సెట్లు నామినేషన్ పత్రాలు అధికారికి అందజేశారు. కాగా, మరో సెట్‌ను బుధవారం దాఖలు చేయనున్నారు.
అమెరికాలో మహారాజు చదువు!
2013లో శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ కన్నుమూసిన రెండేళ్లకు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ మైసూరు 27వ రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లిటరేచర్, ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2016లో దుంగార్‌పుర్ యువరాణి త్రిషికను వివాహం చేసుకున్నారు.