Women In Key Posts in Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో తొలిసారి మూడు కీలక పోస్టుల్లో మహిళలు నియమితులయ్యారు. రాష్ట్ర డీజీపీగా రష్మీ శుక్లా, చీఫ్ సెక్రటరీగా సుజాత సౌనిక్, అటవీ సంరక్షణ ప్రధానాధికారి (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్)గా షోమితా బిస్వాస్ బాధ్యతలు చేపట్టారు.
మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ సుజాతా సౌనిక్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆమె చీఫ్ సెక్రటరీగా నియామకం కాకముందు హోం శాఖ, పరిపాలనా విభాగం ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 64 ఏళ్ల మహారాష్ట్ర చరిత్రలో ఒక మహిళ చీఫ్ సెక్రటరీగా నియామకం కావడం ఇదే తొలిసారి. మరో ఆసక్తికర విషమేమిటంటే సుజాతా సౌనిక్ భర్త, మనోజ్ సౌనిక్ 2023లో మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు.
'మహిళల నచ్చిన రంగాల్లో పనిచేయాలి'
"ఓ మహిళ మహారాష్ట్రకు చీఫ్ సెక్రటరీగా పనిచేయడం సంతోషంగా ఉంది. మహిళలందరూ బాగా చదివి, వారికి నచ్చిన రంగాల్లో పనిచేయాలి. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం 'లాడ్లీ బెహెనా' వంటి పథకాలను తీసుకొచ్చింది. మరికొద్ది రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తాం." అని 'ఈటీవీ భారత్'కు సుజాతా సౌనిక్ తెలిపారు.
రాష్ట్రానికి మొదటి మహిళా డీజీపీ
మరోవైపు, రాష్ట్ర డీజీపీగా 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె అంతకుముందు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. ఆ సమయంలో రష్మీ శుక్లాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చాయి. పుణెలో ఆమెపై ఓ కేసు కూడా నమోదైంది. ఆ కేసులో క్లీన్ చిట్ లభించాక రాష్ట్ర డీజీపీగా రష్మీ శుక్లా నియమితులయ్యారు. మహారాష్ట్ర మొదటి మహిళా డీజీపీ రష్మీ శుక్లానే.
వారి భద్రతే నా మొదటి ప్రాధాన్యం
రాష్ట్రంలో మహిళల భద్రతకు తాను తొలి ప్రాధాన్యం ఇస్తానని డీజీపీ రష్మీ శుక్లా తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. మహారాష్ట్ర మొదటి డీజీపీగా సేవ చేయడం సంతోషంగా, గర్వంగా ఉందని శుక్లా పేర్కొన్నారు.
మహారాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారి షోమితా బిశ్వాస్. ఆమె 1988 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి. బిశ్వాస్ అంతకుముందు కాంపెన్సేటరీ ఫారెస్టెషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా) సీఈఓగా పనిచేశారు. అలాగే పలు హోదాల్లో విధులు నిర్వర్తించారు.
'మహారాష్ట్రకు గర్వకారణం'
"మూడు అత్యున్నత పదవుల్లో మహిళలే ఉండటం మహారాష్ట్రకు గర్వకారణం. ఇది మహారాష్ట్ర ప్రగతిశీల అడుగు. మా విధుల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. నేను చీఫ్ సెక్రటరీ, డీజీపీ నుంచి అవసరం అయితే సాయం తీసుకుంటాను. మహారాష్ట్ర ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అడవుల్లో మహిళా ఉద్యోగులు సమర్థధతతో పని చేసే వాతావరణాన్ని కల్పిస్తా." అని 'ఈటీవీ భారత్'తో షోమితా బిశ్వాస్ తెలిపారు