Women Candidates In Lok Sabha Polls : ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏడు దశల్లో కలిపి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో మహిళల వాటా 10 శాతం కంటే లోపే ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) పేర్కొంది. లోక్‌సభకు మొత్తం 8,360 మంది పోటీచేస్తున్నారు. వారిలో 8,337 మంది అభ్యర్థుల వివరాలను ఏడీఆర్ విశ్లేషించగా వారిలో 797 మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు వెల్లడైంది. ఇది దాదాపు 9.5 శాతానికి సమానం. కొద్దిమంది ప్రమాణపత్రాలు సరిగా స్కాన్ కానందున ఏడీఆర్ విశ్లేషించలేకపోయింది.
మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత జరుగుతున్న తొలి లోక్‌సభ ఎన్నికలు ఇవే కావడం విశేషం. సుమారు 27 సంవత్సరాలపాటు పార్టీల మధ్య సంప్రదింపుల పేరుతో పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లు ఆమోదం పొందినా ఇంకా అమల్లోకి రాలేదు. ఈ బిల్లు అమల్లోకి వస్తే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో అతివలకు మూడోవంతు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల్లో లింగ వివక్షపై రాజకీయ విశ్లేషకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చే వరకు పార్టీలు ఎందుకు ఆగాలని, అంతకుముందే క్రియాశీలకంగా వ్యవహరించి టికెట్లు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. మహిళా అభ్యర్థుల సంఖ్యను పెంచేందుకు రాజకీయ పార్టీలు గట్టి చర్యలు చేపట్టాలని దిల్లీ వర్సిటీకి చెందిన జీసస్ అండ్ మేరీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సుశీలా రామస్వామి డిమాండ్ చేశారు. బ్రిటన్ లేబర్ పార్టీలో పార్టీ సంస్థాగత నిర్మాణంలో మహిళలకు స్థానాలు రిజర్వు చేయడాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళ అభ్యర్థుల వివరాలు
దశ | అభ్యర్థుల సంఖ్య | మహిళా అభ్యర్థులు |
1 | 1,618 | 135 |
2 | 1,192 | 100 |
3 | 1,352 | 123 |
4 | 1,710 | 170 |
5 | 695 | 82 |
6 | 866 | 92 |
7 | 904 | 95 |
మొత్తం | 8337 | 797 |
ఈసారి అత్యధికం
లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు దశల్లో 8,360 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసిన చివరి విడత అభ్యర్థుల సంఖ్యతో దీనిపై స్పష్టత వచ్చింది. 4వ దశలో 96 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 1,717 మంది అభ్యర్థులు పోటీపడగా, ఈనెల 20వ తేదీన 5వ దశలో 49 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అత్యల్పంగా 695 మంది అభ్యర్థులు తలపడ్డారు. ఇప్పటివరకు ఐదు దశల్లో పూర్తయిన పోలింగ్‌లో 6,587 మంది అభ్యర్థుల పోటీ చేశారు.
మే 25న 869 మంది, జూన్ 1న 904 మంది అభ్యర్థుల భవిష్యత్తుపై ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. అందరి జాతకాలు జూన్ 4న బయటపడనున్నాయి. 2019లో 8,054 మంది, 2014లో మొత్తం 8,251 మంది తలపడ్డారు. 2014, 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి అత్యధిక మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగారు. మరోవైపు, ప్రస్తుత ఎన్నికల్లో గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దశ | రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు | మొత్తం స్థానాలు | అభ్యర్థుల సంఖ్య |
1 | 21 | 102 | 1,625 |
2 | 12 | 87 | 1,198 |
3 | 12 | 95 | 1,352 |
4 | 10 | 961 | 1,717 |
5 | 8 | 49 | 695 |
6 | 8 | 57 | 869 |
7 | 8 | 57 | 904 |
1,644 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
లోక్‌సభ ఎన్నికల్లో ఏడు దశల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు అందరిలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లోక్‌సభ స్థానానికి టీడీపీ తరఫున పోటీచేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. తనకు రూ.5,705 కోట్ల ఆస్తి ఉన్నట్లు ఆయన ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనకు రూ.4,568 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలిపారు. 8,337 మంది అభ్యర్థుల్లో 1,644 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. ఆ 1,644 మందిలో 1,188 మందిపై హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేష ప్రసంగాలు తదితర తీవ్రమైన అభియోగాలతో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు- కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు - HC Cancels OBC Certificates