Woman Auto Driver Donates Funds To Wayanad : వయనాడ్ విలయం మనుషులను పొట్టనపెట్టుకోవడమే కాదు, ఏకం కూడా చేసింది. వయనాడ్ బాధితులను ఆదుకోవడానికి చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అండగా నిలిచే ప్రయత్నం చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సాధారణ వ్యక్తులు కూడా వారికి తోచిన ఇతోధిక సాయం అందిస్తున్నారు. ఇలాంటి వారిలో తమిళనాడుకు చెందిన ఓ మహిళా ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు. కేరళ వయనాడ్ ప్రకృతి ప్రకోపానికి గురైన బాధితులకు సాయపడేందుకు ఆమె నడుం బిగించారు. ఇప్పటికే తనవంతు సాయాన్ని అందించారు. ఇకపైనా అందిస్తూనే ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. ఇంతకీ మహిళా ఆటో డ్రైవర్ ఏం చేసిందంటే?
బాధితులకు అండగా రాజీ
చెన్నైలోని పెరంబూర్‌కు చెందిన రాజీ నాయర్ అనే మహిళ ఆటోను నడుపుతోంది. ఆమె ఆది, సోమవారాల్లో ఆటో నడపడం వల్ల తనకు వచ్చిన ఆదాయాన్ని వయనాడ్ బాధితులకు అందించాలని నిర్ణయించుకున్నారు. అందుకే తన సంపాదనను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధి విరాళంగా అందించేదుకు సిద్ధం అవుతున్నారు. అలాగే తన అటో ఎక్కిన కస్టమర్లకు సైతం వయనాడ్ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. అక్కడితో ఆగకుండా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఎంతో కొంత మొత్తాన్ని ఇవ్వాలని కోరుతూ అవగాహన బ్యానర్లను పెట్టింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయలేని వారికోసం తన ఆటో లోపల ఓ చిన్న పెట్టెను పెట్టింది. అందులో వారిని డబ్బులు వేయమని కోరుతోంది. ఇలా రాజీ తన మంచి మనసును చాటుతోంది. అలాగే వయనాడ్ బాధితుల కోసం నిధులు సమకూర్చే అవగాహన కార్యక్రమంలో రాజీ తమిళ టీవీ సెలబ్రిటీ బాలాతో కలిసి ప్రచారం చేస్తోంది.
'కుటుంబ సభ్యుల్లా అందరూ అండగా నిలవాలి'
"నా ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు వెంటనే వయనాడ్ బాధితుల కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆన్‌లైన్‌లో విరాళం పంపమని అభ్యర్థిస్తున్నాను. మరికొందరు వయనాడ్ బాధితుల కోసం నాకు ఎక్కువ ఛార్జీ ఇస్తారు. సొంత కుటుంబంలా వయనాడ్ ప్రజలను భావించి సాయం చేసేందుకు అందరూ ముందుకు రావాలి. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు వసూలు చేయడం ఆపే వరకు ఆది, సోమవారాల్లో నా సంపాదనను విరాళంగా ఇస్తుంటాను" అని రాజీ తెలిపారు.
అండగా నిలిచిన ప్రముఖులు, సామాన్యులు
జులై 30న వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడడం వల్ల వందలాది మంది మరణించారు. మరికొందరు అన్నీకోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు సినీ నటులు, వ్యాపారవేత్తలు తమ వంతు సాయాన్ని అందించారు. అలాగే సామాన్యులు సైతం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు పంపించారు. చిన్నారులు తాము దాచుకున్న డబ్బుల్ని విరాళంగా ఇచ్చారు. ఇలా ఎవరికీ తోచిన సాయాన్ని వారు చేసి వయనాడ్ వాసులకు అండగా నిలిచారు.
'కడుపు నిండింది, మనసూ నిండింది'- వయనాడ్‌కు సాయంగా 'మోయి విరుంధు'! - Wayanad Landslides