2015లో రష్యాకు చెందిన ఓ టీనేజర్ ఆత్మహత్య చేసుకోవడంతో ప్రచారంలోకి వచ్చిన ఈ గేమ్.. ప్రపంచాన్నే కలవర పెడుతోంది. తాజాగా అమెరికాలో ఓ భారత విద్యార్థి చనిపోయాడు. అతను "బ్లూ వేల్" ఆన్‌లైన్ గేమ్ ఆడటం ద్వారానే చనిపోయాడని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బ్లూ వేల్ గేమ్ మరోసారి చర్చలోకి వచ్చింది. మరి, ఈ గేమ్ ఎందుకింత ప్రమాదం? ఎలా ఆడుతారు? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? అనే వివరాలు ఇక్కడ చూద్దాం.
ఎత్తైన టవర్ల అంచున నిల్చోవడం, చేతులపై గాయాలు చేసుకోవడం.. చివరిగా ఆటగాళ్లను ప్రాణాలు తీసుకోమని అడగొచ్చు. ఒకసారి ఈ గేమ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత బయటపడటం దాదాపు అసాధ్యం. బెదిరించి, మానసికంగా తప్పుదోవ పట్టించి టాస్క్‌లు పూర్తిచేసేలా చూస్తుంటారు. ఉద్దేశపూర్వకంగా నీటి నుంచి బీచ్‌కు వచ్చి, ప్రాణాలు తీసుకునే బ్లూవేల్ ప్రవర్తన ఆధారంగానే ఈ గేమ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
బ్లూ వేల్ ఛాలెంజ్ ఎలా పని చేస్తుంది?
ఈ గేమ్ సుమారు 50 రోజుల పాటు కొనసాగుతుంది. బ్లూ వేల్ ఆడే వ్యక్తులు ఒక సీక్రెట్ ఆన్‌లైన్ గ్రూప్‌లో చేరతారు. ఈ గ్రూప్ నిర్వాహకులు ఆటగాళ్లకు ప్రతిరోజూ ఒక టాస్క్ ఇస్తారు. ఇవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. మొదటి టాస్క్‌ల్లో భాగంగా అర్ధరాత్రి నిద్ర లేవడం, భయానక దృశ్యాలు చూపించడం.. వంటివి ఉండొచ్చు. ఆ తర్వాత రోజు రోజుకూ టాస్క్‌ల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ప్రతీ టాస్క్‌ను పూర్తి చేసిన తర్వాత, ప్రూఫ్ కోసం ఆటగాడు ఫొటో లేదా వీడియో పంపించాలి. మొదట గేమ్ మాస్టర్ ఆటగాడితో చాలా సాఫ్ట్‌గా ఉంటాడు. టాస్క్‌లు కంప్లీట్ చేయడానికి సహకరిస్తుంటాడు. మోటివేట్ చేస్తూ ఉంటాడు. రాను రానూ డేంజర్‌గా మారిపోతాడు. 50వ రోజు ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపిస్తాడు.
మధ్యలో వదిలేయొచ్చు కదా?
ఇంత ప్రమాదకరంగా ఉండే గేమ్ ను ఆటగాళ్లు మధ్యలోనే వదిలేయొచ్చు కదా? అనే డౌట్ మనకు వస్తుంది. కానీ.. గేమ్ ఆడుతున్న వ్యక్తికి డేంజర్ అని మొదట్లో అనిపించదు. అదొక ఛాలెంజ్‌గా భావిస్తారు. పబ్జీ వంటి గేమ్స్ ఆడుతున్న వారికి ఓ కిక్కు వస్తుంది. ఇదే కిక్కు బ్లూ వేల్ గేమ్ లోనూ ఆటగాళ్లు వెతుక్కుంటారు. అలా టాక్స్ కంప్లీట్ చేస్తూ ముందుకు సాగుతుంటారు. 50 రోజుల గేమ్‌లో మధ్యలోకి వెళ్లేంత వరకూ అది చాలా తీవ్రమైనదని ఆటగాళ్లకు అర్థంకాదు.
వ్యసనం..
మానసికంగా ఒంటరిగా ఫీలయ్యే వాళ్లే గేమ్స్‌కు అడిక్ట్ అవుతారు. ఇలాంటి వారికి బ్లూ వేల్ గేమ్ కనెక్ట్ అవుతుంది. వీరికి మొదట్లో సరదాగా అనిపించిన ఈ గేమ్.. ఆ తర్వాత వ్యసనంగా మారిపోతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆపేద్దామని అనిపించినా.. దాని తాలూకు ఆలోచనలను మాత్రం వారు ఆపలేకపోతారు. దీంతో.. మళ్లీ ఆడటాన్ని మొదలుపెడతారు.
బయటకు రావాలనుకున్నా..
కొద్ది మంది బలవంతంగా బయటకు రావాలని అనుకున్నా.. గేమ్ మాస్టర్ రానివ్వడు. తీవ్రంగా బెదిరిస్తాడు. మానసికంగా తనకు లోబరుచుకుంటాడు. అయినా లొంగకపోతే.. మీ కుటుంబ సభ్యులు, ఇష్టమైన వారికి హాని కలిగిస్తామని భయపెడతాడు. ఫోన్ నెంబర్ మొదలు.. పర్సనల్ సమాచారం మొత్తం ముందే సేకరిస్తారని తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా ఆటగాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తాడు. అదే సమయంలో నీ గేమ్ ముగియడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి.. కంప్లీట్ చెయ్ అంటూ మోటివేట్ చేస్తుంటాడు. అలా.. గేమ్ కంటిన్యూ చేయిస్తాడు. 50వ రోజు దగ్గర పడుతున్న కొద్దీ మానసికంగా మరింతగా హింసించే టాస్క్‌లు ఇచ్చి, ఆఖరి రోజు ఆత్మహత్య చేసుకునేలా తయారు చేస్తాడ. అవగాహన పెద్దగా లేని టీనేజర్లు.. ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఇంతకు మించిన మార్గం లేదని సూసైడ్ చేసుకుంటారట.
తల్లిదండ్రులూ జాగ్రత్త..
ఈ భయంకరమైన గేమ్‌ను చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. అయితే.. ఎప్పటికప్పుడు మారిపోతున్న టెక్నాలజీ కారణంగా బ్లూ వేల్ అందుబాటులోకి వస్తోందని చెబుతున్నారు నిపుణులు. అందువల్ల ఈ గేమ్ పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. టీనేజర్లు, యువకులే ఎక్కువగా ఈ గేమ్‌కు బలవుతున్నారు. కాబట్టి.. పిల్లల స్మార్ట్‌ఫోన్ వినియోగంపై నిత్యం ఓ కన్నేసి ఉంచాలి. ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో వారు ఎలాంటి పోస్టులను షేర్ చేస్తున్నారో కూడా పరిశీలిస్తూ ఉండాలి. వాళ్లు దూరంగా కూర్చొని ఏడవడం, బాధపడటం వంటివి చేస్తుంటే.. వాళ్లతో మాట్లాడి విషయం తెలుసుకోవాలి. ప్రాబ్లమ్ క్లియర్ చేయాలి. పిల్లలతో ప్రేమగా మెలగడం ద్వారా ఇలాంటి వాటి బారిన పడకుండా చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మీ వయసు 30 దాటుతోందా? - మీ బాడీలో ఈ విటమిన్స్ తగ్గిపోతే అంతే! - Vitamins for Mens after 30 Years