How to Store Pattu Sarees: సంప్రదాయ వేడుకలేవైనా పట్టు లంగా, ఓణీలు, చీరల్లో కుందనపు బొమ్మల్లా మెరిసిపోతుంటారు అమ్మాయిలు. ఎంత మోడరన్ అమ్మాయికైనా పట్టు తెచ్చే వన్నే వేరు మరి. అయితే పట్టుచీరలను అజాగ్రత్తగా భద్రపరిస్తే వాటి మన్నిక దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. అలాకాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించమని సలహా ఇస్తున్నారు.
ప్రత్యేకంగా: పలు ఫంక్షన్ల కోసం ప్రత్యేకంగా వేలు ఖర్చు పెట్టి కొన్న పట్టుచీరను కూడా కబోర్డ్‌లో కుక్కేస్తే మడతలు పడి, నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాదు వాటికి ఏమైనా మరకలు పడితే వాటినంత సులువుగా శుభ్రం చేయలేం. అందుకే మనసుకు నచ్చి కొనుక్కున్న పట్టు చీరలను అపురూపంగా దాచుకోవాలి. అలా దాచుకోవాలంటే.. వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి. కాబట్టి.. పట్టు చీరలు, ఇతర చీరల్ని ఒకే ప్లేస్‌లో పెట్టొద్దు. దీని వల్ల పట్టు చీరలు పాడైపోతాయి. అలా కాకుండా పట్టు చీరలన్నింటిని ప్రత్యేకమైన ప్లేస్‌లో ఉంచండి. వీలైతే వాటిని శారీ బాక్స్‌లలో పెడితే.. ఎప్పటికీ కొత్తవాటిలానే ఉంటాయి.
హ్యాంగర్లు: చాలా మంది పట్టు చీరలను స్టీల్ హ్యాంగర్లకు తగిలించి బీరువాలో పెట్టేస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదంటున్నారు. ఎందుకంటే స్టీల్ హ్యాంగర్లు తుప్పు పట్టి చీర పాడయ్యే అవకాశం ఉందంటున్నారు. దానికి బదులుగా ప్లాస్టిక్ తో చేసి హ్యాంగర్లు వాడమని సలహా ఇస్తున్నారు.
అప్పుడే క్లీనింగ్‌కు: ఎంత ఖరీదైనా పట్టుచీరైనా.. చాలా మంది ఒక్కసారి కట్టగానే డ్రై క్లీనింగ్‌కు ఇస్తుంటారు. అయితే అలాకాకుండా పట్టుచీరలను ఒక్కసారి కట్టిన వెంటనే కాకుండా మూడు, నాలుగు సార్లు కట్టిన తర్వాతే క్లీనింగ్‌కి ఇవ్వాలంటున్నారు.
నాఫ్తలీన్ గోళీలు: చాలా మంది ఈ ఉండల్ని వాడితే చీరలు పాడవవు ఉపయోగిస్తుంటాకు. అయితే చీరల్లో ఎక్కువ రోజులు అలాగే ఉంచితే చీరల రంగు పోతుందంటున్నారు. కాబట్టి నాఫ్తలీన్ ఉండ చీరని తగలకుండా ఒక పాలిథీన్ కవర్లో లేదా పేపర్లో చుట్టి దానికి రంధ్రాలు చేసి బీరువా లేదా కబోర్డ్ మూలల్లో చీరలకు దూరంగా పెట్టమని చెబుతున్నారు.
కంచి చీరలు ఎందుకు అంత ఫేమస్ - మీకు తెలుసా? - why Kanchipuram Sarees Popular
ఆరబెట్టడం: చీరలు వాడినా, వాడకపోయినా ప్రతి మూడు నెలలకోసారి వాటిని నీడలో ఆరబెట్టి.. వాటి మడతలను మార్చాలంటున్నారు. అంటే ఇది వరకు ఎలాగైతే మడిచి పెట్టుకున్నామో దానికి రివర్స్‌లో మడత పెట్టుకోవాలని.. దానివల్ల అచ్చుల్లాగా పడిపోవంటున్నారు.
ఎండలో ఆరబెట్టొద్దు: చాలా మంది పట్టు చీరలు కట్టుకున్న తర్వాత వాటిని కొద్దిసేపు ఎండలో ఆరేస్తుంటారు. కారణం.. చీరలకు పట్టిన తేమ వదిలిద్దని. కానీ ఈ పద్ధతి చీరల మన్నికను దెబ్బతీస్తుందని అంటున్నారు. 2015లో Journal of Textile Associationలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం పట్టుచీరలను ఎండలో ఆరబెట్టడం వల్ల రంగులు వెలిసిపోవడం, చీర నాణ్యత దెబ్బ తినే అవకాశం ఉంటుందని కనుగొన్నారు. ఎందుకంటే సూర్యరశ్మిలోని అతినీలలోహిత (UV) కిరణాలు పట్టు చీరలలోని రంగు అణువులను విచ్ఛిన్నం చేస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దిల్లీ విశ్వవిద్యాలయంలో టెక్స్టైల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ సునీతా శర్మ పాల్గొన్నారు. పట్టు చీరల మన్నిక దెబ్బతినకుండా ఉండాలంటే నీడలో ఆరబెట్టడం మంచిదని చెబుతున్నారు.
పర్ఫ్యూమ్ వద్దు: చాలా మంది పట్టు చీరలు కట్టిన తర్వాత పర్ఫ్యూమ్ కొట్టుకుంటుంటారు. అయితే ఇలా చేయవద్దని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అందులోని రసాయనాలు చీర నాణ్యతను దెబ్బతీస్తాయని అంటున్నారు.
Note: పైన తెలిపిన వివరాలు పలువురు నిపుణులు, పరిశోధన ఆధారంగా ఇచ్చినవే. వీటిని పాటించడం, పాటించకపోవడం మీ వ్యక్తిగత విషయం.
నార్మల్ చీరతో డిజైనర్ లుక్ - ఈ టిప్స్ పాటిస్తే మెరిసిపోతారంతే!