Water Bottle Banned In Taj Mahal : తాజ్ మహల్‌పై మరోసారి వివాదం తలెత్తింది. ఆ అపురూప పాలరాతి కట్టడంలోని ప్రధాన సమాధి వద్దకు వాటర్ బాటిళ్లను తీసుకెళ్లడాన్ని బ్యాన్ చేశారు. సోమవారం సాయంత్రం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఎవరైనా పర్యటకులకు తాగునీళ్లు అవసరమైతే ప్రధాన సమాధి సమీపంలోనే ఉండే చమేలీ ఫ్లోర్‌లోకి వచ్చి నీటిని తాగొచ్చని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సమాధిపై గంగాజలం
తాజ్ మహల్ అసలు పేరు తేజోమహాలయం అని, అది శివుడికి నెలవు అని అఖిల భారత హిందూ మహాసభ వాదిస్తోంది. ఈక్రమంలోనే ఆగస్టు 3న (శనివారం) అఖిల భారత హిందూ మహాసభ కార్యకర్తలు శ్యామ్, వినేష్, తాజ్ మహల్‌లోని ప్రధాన సమాధిపై గంగాజలం పోశారు. దానిపై ఓం స్టిక్కర్లు అంటించారు. అక్కడే కాషాయ జెండాలూ ఊపుతూ హరహర మహాదేవ్ నినాదాలు చేశారు. ఇదంతా జరిగాక సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. సీఐఎస్‌ఎఫ్ ఫిర్యాదు మేరకు శ్యామ్, వినేష్‌లపై తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇద్దరినీ జైలుకు పంపారు.
ఏం జరిగిందంటే
ఆగస్టు 5న (సోమవారం) మీరా రాథోడ్ అనే మహిళ తాజ్ మహల్‌లోని ప్రధాన సమాధి వద్దకు చేరుకుని గంగాజలాన్ని సమర్పించింది. అనంతరం ఆమె కూడా కాషాయ జెండాలను ఊపుతూ హరహర మహాదేవ్ నినాదాలు చేసింది. అనంతరం సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మీరా రాథోడ్‌ను విచారించగా అఖిల భారత హిందూ మహాసభతో ఆమెకు సంబంధం ఉందని వెల్లడైంది. ఆమెను సీఐఎస్ఎఫ్ కార్యాలయానికి తరలించిన వెంటనే, మీరా రాథోడ్ సంబంధీకులు అక్కడికి చేరుకున్నారు. మీర మానసిక స్థితి సరిగ్గా లేదని, ఎవరో చెప్పింది విని ఆమె తాజ్‌మహల్‌లో అలా ప్రవర్తించిందని వారు తెలిపారు. దీంతో సీఐఎస్ఎఫ్ సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ ప్రిన్స్ వాజ్‌పేయి, మీరా రాథోడ్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. అంతకుముందు జూలై 29న ఓ మహిళ కావడిని చేతపట్టి తాజ్ మహల్ పశ్చిమ ద్వారం పార్కింగ్ వద్దకు చేరుకొని హల్‌చల్ చేసింది.
అభిషేకాల అనుమతి కోరుతూ పిటిషన్
ఈసారి శ్రావణ మాసం వేళ తాజ్ మహల్‌లో జలాభిషేకం, క్షీరాభిషేకం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ యోగి యూత్ బ్రిగేడ్ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతోపాటు తాజ్ మహల్‌పై సర్వే చేయించాలని, ఈ అధ్యయనం కోసం కోర్టు కమిషనర్‌ను నియమించాలని ఆ పిటిషన్‌లో వారు డిమాండ్ చేశారు. దీనిపై ఆగస్టు 13న విచారణ జరగనుంది. తాజ్ మహల్ అనేది ప్రాచీన శివాలయమని ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు.
'వాటర్ బాటిళ్లపై బ్యాన్ సరికాదు'
తాజ్ మహల్ ప్రధాన సమాధి వద్దకు వాటర్ బాటిళ్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్ టూరిస్ట్ గైడ్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దీపక్ దాన్ అన్నారు. ఏఎస్ఐ, సీఐఎస్ఎప్ అప్రమత్తంగా ఉండి అలాంటి ఘటనలను అడ్డుకోవాలే తప్ప, వాటర్ బాటిళ్లను తీసుకెళ్లొద్దని నిషేధం అమలు చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. దీనివల్ల పర్యాటకులు ఇబ్బందిపడే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
'వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు'
తాజ్‌మహల్‌పై వివాదాన్ని లేవనెత్తడానికి కొందరు ప్రయత్నిస్తుండటం సరికాదని ఏఎస్‌ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రాజ్‌కుమార్ పటేల్ అన్నారు. తాజ్‌మహల్‌ను సందర్శించే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ప్రధాన సమాధి వద్ద పర్యటకులకు అవసరమైతే చిన్న నీటి సీసాలను అందిస్తామని తెలిపారు. ఎవరైనా పర్యటకులకు అత్యవసర పరిస్థితి ఎదురైతే ఉచితంగానే వాటర్ బాటిళ్లను అందజేస్తారని చెప్పారు.