Uttarakhand Trek Accident : ఉత్తరాఖండ్‌లోని ఎగువ హిమాలయ పర్వతాల్లో సహస్త్రతాల్ సరస్సు వద్దకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన బృందంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ట్రెక్కర్లు అక్కడే చిక్కుకుపోయారు. చిక్కుకుపోయిన వారిలో ఐదుగురిని ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు కాపాడాయి. మిగిలిన వారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి.
ఇదీ జరిగింది
హిమాలయాల్లో 4 వేల 400 మీటర్ల ఎత్తున సహస్త్రతాల్ సరస్సు ఉంది. మే 29న 22 మందితో కూడిన ట్రెక్కింగ్ బృందాన్ని హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ సరస్సు వద్దకు పంపింది. వారిలో 18మంది ట్రెక్కర్లు కర్ణాటకకు చెందిన వారు కాగా, ఒకరు మహారాష్ట్ర వాసి. ముగ్గురు స్థానిక గైడ్లు వారిని తీసుకుని వెళ్లారు. అయితే జూన్ 7న తిరుగు ప్రయాణంలో ప్రతికూల వాతావరణం కారణంగా వారు దారి తప్పారు. వారు బేస్ క్యాంప్‌నకు చేరుకోకపోవడం వల్ల ట్రెక్కింగ్ ఏజెన్సీ అప్రమత్తమైంది. ఇందులో 9 మంది ట్రెక్కర్లు చనిపోయినట్లు గుర్తించింది. మిగిలిన వారు అక్కడే చిక్కుకుపోయినట్లు తేల్చింది. దీంతో వెంటనే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇవ్వడం వల్ల హెలికాఫ్టర్ సాయంతో SDRF వారిని కాపాడినట్లు ఉత్తరకాశి కలెక్టర్ తెలిపారు. సహాయక చర్యల కోసం భారత వాయుసేన సాయం కోరినట్లు వెల్లడించారు. మిగిలిన వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టామని జిల్లా మేజిస్ట్రేట్ వివరించారు. మట్లీ, హర్సిల్, ఇతర హెలిప్యాడ్‌ల నుంచి సహాయక చర్యలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అంతకుముందు అటవీ శాఖకు చెందిన 10 మంది సభ్యుల రెస్క్యూ టీమ్, ఎస్‌డీఆర్‌ఎఫ్(SDRF) బృందం బుధవారం తెల్లవారుజామున ఉత్తరకాశీ నుంచి బయలుదేరాయని తెలిపారు. ఉత్తరకాశీ జిల్లా ఆసుపత్రి, భట్వాడీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేశామని, 14మంది రక్షణ సిబ్బంది, ఒక వైద్యుడిని ఘటనా స్థలానికి పంపామని అధికారులు చెప్పారు. క్షతగాత్రులను వెంటనే తరలించడానికి హెలికాప్టర్, అంబులెన్స్‌లను సిద్ధం చేశామన్నారు.