Uttarakhand Cabinet UCC : ఉమ్మడి పౌర స్మృతిపై నిపుణుల కమిటీ రూపొందించిన ముసాయిదాకు ఉత్తరాఖండ్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆధ్వర్యంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేశారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఈ ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదా తుది ప్రతిని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.
ఉమ్మడి పౌర స్మృతిపై చట్టం చేయడానికి సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశం కానుంది. డ్రాఫ్ట్‌కు మంత్రివర్గ ఆమోదం లభించడం వల్ల శాసనసభలో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది. ఒకవేళ ఈ చట్టం అమలైతే, స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌర స్మృతి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది. బహుభార్యత్వం, బాల్య వివాహాలపై పూర్తి నిషేధం, అన్ని మతాలకు చెందిన మహిళలకు వివాహయోగ్య వయసును ఒకేలా నిర్ధరించడం వంటి నిబంధనలు ఇందులో ఉన్నట్లు సమాచారం.
'దీన్ని ముందుకు తీసుకువెళతాం'
దీనిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ఉమ్మడి పౌరస్మృతిపై రూపొందించిన ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, దీనిని చట్టంగా చేయడానికి మరింత ముందుకు తీసుకువెళ్తాం అని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌ను ఉదాహరణంగా ఇతర రాష్ట్రాలు తీసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
-
#WATCH | Dehradun: Uttarakhand Chief Minister Pushkar Singh Dhami says, "During the cabinet meeting, today, the UCC report was approved. We will move forward in the direction to make it an Act." https://t.co/NfyJL6yke9 pic.twitter.com/2rXGtcHWrm
— ANI (@ANI) February 4, 2024
ఈ కమిటీ 2022 మేలో ఏర్పాటైంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తుది ముసాయిదాను సిద్ధం చేసి, ముఖ్యమంత్రికి సమర్పించింది. అయితే ఈ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసే క్రమంలో కమిటీ 2.33 లక్షల లిఖితపూర్వక సూచనలు స్వీకరించింది. దీని కోసం కమిటీ 70 సార్లకు పైగా సమావేశమై దాదాపు 60 వేల మందితో మాట్లాడి అభిప్రాయాలు తీసుకుంది.
ఉమ్మడి పౌరస్మృతిపై వరుస ప్రకటనలు
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అమలుపై మధ్యప్రదేశ్ భోపాల్ పర్యటన సందర్భంగా చిన్న హింట్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అప్పటినుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి మద్దతుగా వరుస ప్రకటనలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక పుష్కర్ సింగ్ ధామీ ఈ అంశాన్ని మొదటగా లెవనెత్తారు. ఆ తర్వాత కమలం పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ యూసీసీ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై రాష్ట్రంలో చర్చిస్తామని తెలిపారు.